ఛోటీ దీపావళి ఈ రోజే.. శుభ ముహూర్తం, కథ, పూజా ఆచారాల గురించి తెలుసా?

By Shivaleela RajamoniFirst Published Nov 11, 2023, 10:23 AM IST
Highlights

choti diwali 2023: దీపాళికి ఒక రోజు ముందు ఛోటీ దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజును ఎన్నో పేర్లతో పిలుస్తారు. మత విశ్వాసాల ప్రకారం.. ఈ పవిత్రమైన రోజు నాడు యముడికి దీపాలు వెలిగించి శ్రీకృష్ణుడిని పూజిస్తారు. చోటీ దీపావళిని జరుపుకోవడానికి వెనకున్న అసలు కథ తెలుసా?
 

choti diwali 2023: హిందూ ముఖ్యమైన పండుగల్లో ఛోటి దీపావళి ఒకటి. ఐదు రోజుల దీపావళి పండుగ నిన్న ధనత్రయోదశి తోనే ప్రారంభం అయ్యింది. కాగా దీపావళికి ఒక రోజు ముందునాడే చోటి దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజును నరక చతుర్ధశి అని కూడా అంటారు. 

మత విశ్వాసాల ప్రకారం.. నరక చతుర్ధశి లేదా ఛోటీ దీపావళి నాడు యమ దేవుడికి దీపాలు వెలిగిస్తారు. అలాగే ఈ రోజు  శ్రీకృష్ణుడిని పూజిస్తారు. గోపాలుడి అనుగ్రహం పొందితే జీవితంలోని అన్ని కష్టాలు, బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. మరి ఈ రోజున కన్నయ్యను ఎలా పూజించాలి? ఈ రోజును జరుపుకోవడానికి వెనకున్న కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

నరక చతుర్దశి 

చతుర్దశి తిథి ప్రారంభం - నవంబర్ 11 - 01:57 గంటలకు

చతుర్దశి తిథి ముగింపు - నవంబర్ 12- 02:27 గంటలకు

ఛోటీ దీపావళి ఆచారాలు

ఈ రోజు భక్తులు శ్రీకృష్ణుడిని, కాళీమాతను, యముడు, హనుమంతుడిని పూజిస్తారు. వీరిని పూజించడం వల్ల చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందుతారట. అలాగే కష్ట, నష్టాల నుంచి బయటపడతారని నమ్ముతారు. 

ఛోటీ దీపావళి లేదా నరక చతుర్దశి నాడు అభ్యంగ స్నానం కూడా చేస్తారు. ఇది ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే అభ్యంగన స్నానం ప్రజలను నరకం నుంచి విముక్తి కల్పిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున శరీరానికి నూనెను  రాస్తే మలినాలన్నీ తొలగిపోతాయట.

నరక చతుర్దశి కథ

ఈ నరక చతుర్దశి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం.. నరక చతుర్ధశి నాడు గోపాలుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. అలాగే16000 మంది గోపికలను రక్షిస్తాడు. దీంతో అప్పటి నుంచి నరక చతుర్దశి నాడు  శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ రోజును చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. 

click me!