పుదుచ్చేరి: అన్నాడీఎంకే - బీజేపీ - ఎన్ఆర్ కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు పూర్తి, సీఎం అభ్యర్ధి ఎవరంటే..

By Siva KodatiFirst Published Mar 9, 2021, 4:53 PM IST
Highlights

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. పోటీ చేసే స్థానాలపై ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి పక్షాల మధ్య అవగాహన కుదిరింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఈ కూటమి ప్రకటించలేదు. 

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో భాగంగా అన్నాడీఎంకే, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. పోటీ చేసే స్థానాలపై ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి పక్షాల మధ్య అవగాహన కుదిరింది. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ఈ కూటమి ప్రకటించలేదు.

ఎన్‌ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఏఐఏడీఎంకే నేతల సమక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగస్వామి, బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు వి. స్వామినాథన్ సీట్ల పంపకం ఒప్పందంపై సంతకాలు చేశారు. 

కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, పుదుచ్చేరి రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జి నిర్మల్ కుమార్ సురానా మాట్లాడుతూ, తమ కూటమికి ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ రంగస్వామి నాయకత్వం వహిస్తారని వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల నుంచి, బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి 14 స్థానాల నుంచి పోటీ చేస్తాయని సురానా వెల్లడించారు. ఈ 14 స్థానాలలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో బీజేపీ, ఏఐఏడీఎంకే నిర్ణయించుకుంటాయని నిర్మల్ కుమార్ చెప్పారు.

అయితే కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తాయని సురానా స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల అనంతరం నియమించవలసిన మూడు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులపైనా, రాజ్యసభ సభ్యత్వంపైనా చర్చ జరగలేదని సురానా చెప్పారు. 

రంగస్వామి మాట్లాడుతూ, తమ కూటమి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం పుదుచ్చేరి అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు... పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతానని రంగస్వామి స్పష్టం చేశారు.

ఏఐఏడీఎంకే నేత ఏ అంబజగన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం, పుదుచ్చేరి ప్రభుత్వం మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాభివృద్ధి జరగలేదని అంబజగన్ ఆరోపించారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి శాసన సభకు ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. 

click me!