తెలుగులో తమిళ తంబీల తడాఖా: తమిళంలో మన సినిమాల బోల్తా

By telugu teamFirst Published Oct 28, 2019, 11:39 AM IST
Highlights

తమిళ చిత్రాలు తెలుగులో డీసెంట్ గా ఆడుతున్నాయి. ఓపెనింగ్ షేర్స్ రాబడుతున్నాయి. కానీ మన సినిమాలు ఎందుకు అక్కడ అంతలా ఆడలేకపోతున్నాయి? దానికి కారణాలేంటో చూద్దాం... 

సినిమా అభిమానులను వేధిస్తున్న ఒక ప్రశ్న ఏదన్నా ఉందంటే, తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయితే డీసెంట్ ఓపెనింగ్స్ ని రాబడుతున్నాయి. మరి ఎందుకు తెలుగు సినిమాలు అక్కడ ఇలాంటి రన్ పొందలేక పోతున్నాయి? ఉదాహరణకు విజయ్ సినిమా విజిల్ తెలుగులో 2.8కోట్ల ఓపెనింగ్ షేర్ రాబట్టింది. అతని గత సినిమా సర్కార్ కూడా 2కోట్ల ఓపెనింగ్ షేర్ రాబట్టింది. ఎందుకు ఇలా తమిళ సినిమాలు చేస్తున్న పనిని తెలుగు సినిమాలు చేయలేకపోతున్నాయి?

దీనికి సమాధానం కావాలంటే తొలుత మనం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల విధానాన్ని అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. తమిళంలో డబ్బింగ్ చిత్రం పైన విధించే పన్నులు తెలుగులో డబ్బింగ్ చిత్రాలపై విధించే పన్నుల కన్నా అధికంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన నిర్మాతలు,హీరోలు ఒకటి రెండు ప్లాపుల తరువాత అంత ఈజీ గా ఆ ధైర్యం చెయ్యలేకపోతున్నారు. తెలుగు చిత్రాలు అధికంగా తమిళంలో డబ్ అవ్వకపోవడానికి అదొక ముఖ్య కారణం. 

అంతే కాకుండా మీడియా ప్రమోషన్. తమిళ సినిమాల బజ్ ను మన మీడియా ప్రమోట్ చేసినంతగా తమిళ మీడియా మన సినిమాలను ప్రమోట్ చెయ్యదు. దానికి తోడు సోషల్ మీడియా. తమిళ చిత్ర సోషల్ మీడియా పబ్లిక్ రిలేషన్స్ టీం, మన తెలుగు చలనచిత్ర పిఆర్ టీం కన్నా చాల మెరుగ్గా పనిచేస్తుంది. మచ్చుకి విజయ్ బీగిల్ సినిమా తీసుకోండి, తెలుగులో సినిమా డబ్ కాకపోయి ఉన్నా కూడా మనకు సదరు విజయ్ సినిమా విడుదలవుతుంది అనే సమాచారం మాత్రం ఉంది. సోషల్ మీడియా హైప్ సృష్టించడంలో మన తెలుగు సినిమా కన్నా, తమిళ సినిమా ఎంతో ముందుందనడంలో నో డౌట్. 

ఇక్కడివరకు ఇదంతా వారి సినిమా పరిశ్రమ గురించి. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ వైపు నుండి కూడా కొన్ని తప్పులు మనకు కనపడుతున్నాయి. మొన్నటి సైరా సినిమాకు హైప్ వచ్చింది. కానీ సినిమా ఎబవ్ యావరేజ్ మాత్రమే. దీనికి ఖచ్చితంగా కారణం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమనే! 

తమిళ సినిమాలు తెలుగులో విడుదలవుతున్నాయనగానే తమిళ స్టార్స్ తెలుగు చానెళ్లకు ఒకదానితర్వాత మరొకటిగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఇలాంటి పనులు మన స్టార్లు చెయ్యరు. తమిళ స్టార్లు కార్తీ,సూర్య,రజనీకాంత్ వంటివారెందరో వస్తారు వచ్చి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవ్వకుండా ఇంటర్వ్యూలిచ్చి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటారు. 

నెక్స్ట్ అంశం టార్గెటింగ్. తమిళ సినిమాలు తెలుగులో ప్లాప్ అయినా కంటిన్యుయస్ గా విడుదల చేస్తుంటారు. కానీ మన హీరోలు అలా కాదు. స్పైడర్ తరువాత మహేష్ బాబు తమిళ చిత్ర పరిశ్రమవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నాని కూడా 2 సినిమాల తరువాత ఆ ప్రయత్నం మానుకున్నాడు. వరుసగా కనుక మంచి సినిమాలు అక్కడ విడుదలైతే, మన స్టార్స్ ఇమేజ్ పెరుగుతుంది. తమిళ మార్కెట్ కూడా చాలా పెద్దది. అక్కడ గనుక మన సినిమాలు రెగ్యులర్ గా విడుదలవడం మొదలైతే మన సినిమా పరిశ్రమ కూడా అలరారుతుంది. 

ఇప్పటికైనా మన ప్రొడ్యూసర్లు,హీరోలు ఈ విషయమై దృష్టి సారించాలి. అన్ని సినిమాలు కాకున్నా, మంచి సినిమాలనైనా విడుదల చేస్తే బాగుంటుంది. రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్. దాన్ని ఇంత వరకు తమిళంలో విడుదల చేసే ప్రయత్నమెందుకు చేయలేదో సదరు దర్శక నిర్మాతలకు హీరోకే తెలియాలి. 

click me!