జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద తుపాకి పెట్టి రాజకీయ ప్రత్యర్థులు జగన్, చంద్రబాబులను ఎదుర్కోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. వకీల్ సాబ్ వివాదం విషయంలో ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమైంది.
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇమేజ్ మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చాలని ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వకీల్ సాబ్ సినిమా విడుదల విషయంలో బిజెపి నేతలు సునీల్ దియోధర్, సత్య చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి పవన్ కల్యాణ్ ను బిజెపి అస్త్రంగా ప్రయోగిసోంది.
తెలుగు సినీ రంగంలో పవన్ కల్యాణ్ కు ఉన్నంత అభిమానుల సంపద మరో హీరోకి లేదనే చెప్పాలి. అంతేకాకుండా పవన్ కల్యాణ్ ను భక్తుల్లా అభిమానించే అభిమానులు చాలా ఎక్కువ. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితే రెచ్చిపోయే దండు ఆయనకు ఉంది. ఇదంతా రాజకీయాల్లో తమకు కలిసి వస్తుందని బిజెపి విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే, పవన్ కల్యాణ్ మీద తుపాకి పెట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది.
undefined
వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతించకపోవడంపై బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు జగన్ భయపడుతున్నారని వారు వ్యాఖ్యలు చేశారు. జనసేన, బిజెపి కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కూడా వారు నమ్ముతున్నట్లు మాట్లాడుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన జనసేనపై బిజెపి నీళ్లు చల్లింది. ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను బిజెపి పోటీకి దించింది. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి బిజెపి నేతలు పవన్ కల్యాణ్ జపమే చేస్తున్నారు. కాస్తా ముందుకు వెళ్లి పవన్ కల్యాణ్ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు తెగ సంతోషించారనే చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ కూడా దానిపై స్పందించారు. తనకు పదవులపై ఆశ లేదు గానీ ముఖ్యమంత్రి అయితే మిగతావారికన్నా మెరుగైన పాలన అందించగలనని ఆయన అన్నారు.
తమ తమ్ముడు పవన్ కల్యాణ్ తనను గెలిప్తాడని బిజెపి, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అన్నారు. పవన్ కల్యాణ్ తిరుపతిలో రత్నప్రభకు అనుకూలంగా ఓ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో కలిసి ఆయన తిరుపతిలో ర్యాలీలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. మొత్తంగా, పవన్ కల్యాణ్ ఇమేజ్ ను వాడుకుంటూ ఏపీలో పాగా వేయాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు మాత్రం స్ఫష్టంగా అర్థమవుతూనే ఉంది.