కేసీఆర్, జగన్ అత్యుత్సాహం: హైకోర్టుల చేతుల్లో మొట్టికాయలు

By Sree SFirst Published May 26, 2020, 5:20 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తాజగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి ఒక కీలక వ్యాఖ్య చేసింది. మేము మిమ్మల్ని నమ్మలేము అని పేర్కొంటూ... డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ కి అప్పగిస్తున్నట్టు తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తాజగా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఉద్దేశించి ఒక కీలక వ్యాఖ్య చేసింది. మేము మిమ్మల్ని నమ్మలేము అని పేర్కొంటూ... డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ కి అప్పగిస్తున్నట్టు తెలిపింది. 

ఇక అధికారిక భవనాల రంగులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పై (కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్) కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేస్తున్నట్టు చెబుతూ... 28వ తేదీన కేసును విచారణ చేయబోతున్నట్టు తెలిపింది కోర్టు. 

ఈ రెండు కేసుల్లోనూ అత్యుత్సాహం పాలకవర్గానిదే అని తెలిసినా కోర్టుకు స్వయానా ముఖ్యమంత్రులను న్యాయస్థానం లాగలేదు కాబట్టి ఇలా ఉన్నతాధికారులను కోర్టు విచారణకు పిలుస్తుంది. ఈ రెండు కేసుల్లోనూ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. డాక్టర్ సుధాకర్ విషయంలోనయితే ఏకంగా పోలీసులను నమ్మలేము అన్నట్టుగా మాట్లాడడం నిజంగా శోచనీయం. 

డాక్టర్ సుధాకర్ విషయంలో కోర్టు ఇలా వ్యాఖ్యానించడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. పోలీసులు ఒకటే గాయముయిందని చెబితే, జడ్జి స్వతంత్ర నివేదికలో 6 గాయాలున్నట్టు తేలడం, అతి తక్కువ సమయంలోనే డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి సరిగా లేదని వేరే డాక్టర్ సర్టిఫై చేయడం ఇవన్నీ కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం అయి ఉండొచ్చు. 

ఇలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర పోలీసులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది రెండవసారి. మొన్నామధ్య చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడును ఎయిర్ పోర్టు నుండి అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన సందర్భంలో కూడా కోర్టు వారిని తప్పుబట్టింది. 

ఇక ప్రభుత్వ భవనాలకు రంగులను మార్చాలని హై కోర్ట్ ఆదేశించినప్పటికీ.... ఆ మూడు రంగులకు తోడుగా (ఒకలాంటి ఎర్రమట్టి) టెర్రకోట రంగును జతచేసి దానికి సరికొత్త నిర్వచనం చెప్పింది ప్రభుత్వం. ఈ కేసులో ఏకంగా ప్రధాన కార్యదర్శితోపాటు మరికొందరు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును నమోదయింది. 

ఇలా ఉన్నతస్థాయి అధికారులపై కోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయవలిసి రావడం దురదృష్టకరం. వారి సర్వీస్ రూల్స్ ని విస్మరిస్తూ మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారన్నది ఇక్కడ ఉద్భవిస్తున్న ప్రశ్న. 

మొన్న తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె అప్పుడు కూడా హై కోర్టు తెలంగాణ అధికారులను, వారి వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. అధికారులు కోర్టు ముందు ఉంచిన లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని అందుకోసమని ఏకంగా ఫైనాన్స్ సెక్రెటరీనే కోర్టుకు హాజరు కమ్మని చెప్పింది న్యాయస్థానం. 

ప్రభుత్వం వద్ద జీతాలకు డబ్బులు లేవు అని అన్నప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో గెలిచిన తరువాత హామీలకు ఇవ్వడానికి డబ్బు ఉంది కానీ... కార్మికులకు జీతాలివ్వడానికి డబ్బులు లేవా అని కూడా కోర్టు నిలదీసింది. 

ఇలా ఉన్నతాధికారులు, అందునా అల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎందుకు కోర్టు ఆగ్రహానికి గురవుతున్నారనేది ఇక్కడి ప్రశ్న. వారికి ఇలా చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు తెలియవా అంటే... తెలియదని కాదు. వారు భారతదేశ పరిపాలనకు స్టీల్ ఫ్రేమ్ వంటి వారు. 

వారికి రాజ్యాంగం ప్రకారంగా ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసు. అయినా కూడా కొన్నిసార్లు ప్రభుత్వ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తున్నారు. అలా ఒత్తిళ్లకు లోబడకుండా నిలబడితే... వారికి బహుమానాల రూపంలో ట్రాన్స్ఫర్లు ప్రాముఖ్యతలేని పోస్టింగులు సిద్ధంగా ఉంటాయి. 

ఇలాంటివి ఎదురైనా నీతిగా న్యాయంగా పోరాడే ఎందరో అధికారులు మనకు కనబడతారు. వీరిని అధికారంలోఉన్న పార్టీతో సంబంధం లేకుండా ట్రాన్స్ఫర్లు మాత్రం పలకరిస్తూనే ఉంటాయి. అశోక్ ఖేమ్కా మనకొక చక్కటి ఉదాహరణ. 28 సంవత్సరాల సర్వీసులో 53 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎక్కడా ఆయన వెరవలేదు. ఏ నాడూ అధికారంలో ఉన్నవారి ప్రాపకం కోసం పాకులాడలేదు. 

అధికారులకు ముఖ్యంగా వారి సర్వీసుల చివరిదశలో ఉన్న ప్రధాన కార్యదర్శులవంటి వారికి ఇలాంటి అవమానాలు వారి మొత్తం కెరీర్ కే మచ్చ తీసుకొచ్చిపెట్టగలీగ్ ప్రమాదం కూడా లేకపోలేదు. 

click me!