సోనియా కామరాజ్ ప్లాన్: సీనియర్లు వెనక్కి, రాహుల్ గాంధీ వ్యూహం ఇదీ...

By Sree SFirst Published Apr 30, 2020, 4:35 PM IST
Highlights

రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఫ్రంట్ సీట్లో కనబడుతున్నారు. మొన్నటి జూమ్ కాల్ ఇంటర్వ్యూలో కూడా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం సంగతి నేను చూసుకుంటాను, మీరంతా కరోనా వైరస్ సంగతి చూసుకోండి అని అన్నాడు. 

కరోనా మహమ్మారి పుణ్యమాని దేశమంతా లాక్ డౌన్ లోనే కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ వల్ల అందరూ కూడా ఇండ్లకే పరిమితమయిపోయారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఉపాధి కోల్పోయి, తినడానికి తిండి లేక వారు అల్లాడిపోతున్నారు. 

రెండవ దఫా విధించిన లాక్ డౌన్ కూడా ముగింపు దశకు వస్తున్న వేళ... దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి ఎలా పట్టాలెక్కించాలనే దానిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ తో ఆన్ లైన్ లో ఇక చిన్న చిట్ చాట్ నిర్వహించారు. 

చిట్ చాట్ లో ఎం మాట్లాడారు అనేది పక్కన పెడితే.... రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ఫ్రంట్ సీట్లో కనబడుతున్నారు. మొన్నటి జూమ్ కాల్ ఇంటర్వ్యూలో కూడా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం సంగతి నేను చూసుకుంటాను, మీరంతా కరోనా వైరస్ సంగతి చూసుకోండి అని అన్నాడు. 

ఇక కాంగ్రెస్ సీనియర్లు ఈమధ్య పెద్దగా కనబడడం లేదు. కొత్తగా కేసీ వేణుగోపాల్, గౌరవ్ వల్లభ్, సుప్రియ శ్రీనాతె, రోహన్ గుప్త కనబడుతున్నారు. పార్టీ సీనియర్లు గులాం నబి ఆజాద్, కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఎవరు కూడా కనబడడం లేదు. 

సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తులైన ఈ సీనియర్లంతా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకలాపాల్లో కనపడడం లేదు అని 10 జనపథ్ టాక్. ఇలా రాహుల్ గాంధీ అన్ని తానే అని ప్రొజెక్ట్ చేసుకోవడం, వీలైనంతమేర వేదికల మీద కనబడడం ఇవన్నీ చూస్తుంటే... కాంగ్రెస్ లో అసలు ఎం జరుగుతుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. 

రాహుల్ కి పగ్గాలు... సోనియా ప్లాన్ ఇదీ!

సోనియా గాంధీ ఆరోగ్యం కూడా పెద్దగా ఆమెకు సహకరించడం లేదు. ఆమె కూడా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి బాధ్యతలను అప్పగించి ఆమె తప్పుకుందామనుకున్నారు. 

కానీ రాహుల్ గాంధీ మౌనముని తిరుగుబాటు వల్ల ఆమే అధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ ఆమె ఫుల్ టైం అధ్యక్షురాలయితే కాదు. ఆమె కాంగ్రెస్ బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించాలని చూస్తోంది. అది ఎప్పటికైనా తప్పదు కూడా!

రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవిని అప్పగించాలంటే... రాహుల్ డిమాండ్ కి ఆమె తలొగ్గక తప్పదు. రాహుల్ గాంధీ ఎప్పటినుండో చేస్తున్న డిమాండ్ ఏదైనా ఉందంటే... అది సీనియర్లను పక్కకు తప్పించడం. 

రాహుల్ ఈ విషయాన్నీ 2017లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ అయినప్పటినుండి బయటపెడుతూనే ఉన్నాడు. సీనియర్ల మీద ఏదో ఒక రూపంలో తన అసహనాన్ని బయటపెడుతున్నాడు. 2019లో ఎన్నికలు ముగిసినప్పుడు కూడా ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సీనియర్లను కూడా చేయమన్నారు. 

కానీ వారు చేయకపోవడంతో కథ మరోసారి అడ్డం తిరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఇక పగ్గాలను అప్పగించాల్సిన వేళయింది. ఈ నేపథ్యంలో రాహుల్ కి అప్పగించేందుకు ఆమె మరోమారు కామరాజ్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

కామరాజ్ ప్లాన్ అంటే...?

కామరాజ్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నేత. చదువు రాదు. ఇంగ్లీష్, హిందీ రావు కాబట్టి ప్రధానమంత్రి పదవిని వద్దనుకున్నారు(అధికారాన్ని మాత్రం కాదు, అది తరువాత మాట్లాడుకుందాము). చైనా తో యుద్ధంలో భారతదేశం ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ లో నూతన జవసత్వాలని నింపేందుకు ఆయన సీనియర్లందరిని రాజీనామా చేయమన్నారు. 

అలా సీనియర్లను పక్కకు తప్పించి మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్ల ఆశలకు గండి కొట్టి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీల రూపంలో ఇద్దరు ప్రధానులను అందించారు. అలా సీనియర్లతో పదవులకు రాజీనామా చేయించి వారికి చెక్ పెట్టగలిగారు. 

ఇప్పుడు సోనియా కూడా సీనియర్లకు అలానే చెక్ పెట్టినట్టే కనబడుతున్నారు. సీతారాం కేసరి నుంచి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తనకు కట్టబెట్టడంలో అత్యంత విశ్వాసపాత్రులుగా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, గులాం నబి ఆజాద్, అంబికా సోని వంటివారంతా ఇప్పుడు కనుమరుగవనున్నారు అనే విషయం అర్థమవుతుంది. 

ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే.... రాహుల్ గాంధీ త్వరలోనే మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేలా కనబడుతోంది. ఈ కరోనా కాలాన్ని ఆయన తన ఇమేజ్ ని బిల్డ్ చేసుకోవడానికి బాగానే వాడుతున్నట్టుగా అయితే కనబడుతుంది. 

click me!