శంకర్ పామర్తి : ధిక్కార కళకు దీపస్తంభం

By telugu teamFirst Published Jan 11, 2020, 11:41 AM IST
Highlights

అతడు ఎదిరిస్తున్నది ప్రపంచానికి పెద్దన్న ఐన ‘ట్రంప్’ కావడం యాదృచ్చికం కాదు. అది తన కాలం అనివార్యత. తాను ఎంచుకున్న పోలిటికల్ కార్టూనిజం తాలూకు అసాధారణ శక్తి. తానే ప్రత్యేకంగా కృషి చేసి రాణిస్తున్న కేరికేచరిజం స్పెషాలిటీ. దానికి నరసింహస్వామి ఆన.

చూడటానికి చిన్నవాడే. బక్కజీవే. కానీ, తాను సంక్షోభకాలంలో ‘ట్రంపిజా’న్ని శక్తిమేరా ఎదురొడ్డి పోరాడుతున్న కళాకారులకు అందివచ్చిన న్యాయ నిర్ణేత. నేడు అతడికి అభినందనలు చెప్పడం అంటే - అది మనందరికీ ఒక వెన్నుదన్ను.

శంకర్ పామర్తి. అతడు నల్లగొండలో తొలితరం విద్యుత్ కాంతులకు కారణమైన ఓ సామాన్యమైన లైన్ మెన్ బిడ్డ. తరగతికే పరిమితం కారాదని డ్రాయింగ్ టీచర్ గా ఉద్యోగం మానేసిన దీర్ఘదర్శి. రెడ్ హిల్స్ కేంద్రంగా తన గీతలతో రాతలతో హోరెత్తించిన మోహన్ గారి వారసుడు. తదుపరి సాక్షి దినపత్రికలో పొలిటికల్ కార్టూనిస్టు. అంతేనా? కాదు. అతడు మన తెలుగు ప్రజలకే కాదు, యావత్ భారతానికి, మూడో ప్రపంచ దేశాలకూ, మీదు మిక్కిలి మొత్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నిరసించే ప్రజల పాలిటి ఒపీనియన్ పోల్. దీపస్తంభం. చురుకైన రంగుల పెన్సిల్. వ్యంగ చిత్ర వైభవానికి వన్నె తెస్తున్న ఇండియన్ ఇంక్. ఒక్క ముక్కలో చెప్పాలంటే అతడు మన ట్రంప్ కార్డ్. The card that wins a hand at last.

నిజం. అతడు ఎదిరిస్తున్నది ప్రపంచానికి పెద్దన్న ఐన ‘ట్రంప్’ కావడం యాదృచ్చికం కాదు. అది తన కాలం అనివార్యత. తాను ఎంచుకున్న పోలిటికల్ కార్టూనిజం తాలూకు అసాధారణ శక్తి. తానే ప్రత్యేకంగా కృషి చేసి రాణిస్తున్న కేరికేచరిజం స్పెషాలిటీ. దానికి నరసింహస్వామి ఆన.

ముఖ్యంగా ఇటీవలి రెండు దశాబ్దాలలో ఇంతింతై వటుడింతై అన్నట్టు, ఇంటర్నెట్ మాధ్యమాన్ని అత్యంత సానుకూలంగా మలుచుకుని, తన వ్యంగ చిత్ర వైభవంతో ప్రపంచ ప్రఖ్యాత కేరికేచరిస్టుల్లో ఒకరిగా ఎదిగిన శంకర్ పామర్తి – రెండేళ్లక్రితమే తన రంగంలో నోబెల్ గా చెప్పుకునే పురస్కార గ్రహీత కావడం అంతర్జాతీయంగా అతడి ప్రతిభకు దక్కిన గుర్తింపు. మధ్యలో మరెన్నో అవార్డులు, రివార్డులు. ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఇరాన్ కార్టూన్ డాట్ కాం సంస్థ నిర్వహిస్తోన్న ‘ట్రంపిజమ్: కార్టూన్ / క్యారికేచరల పోటీ’లో -విజేతలను ఎంపిక చేసే ఇద్దరు అంతర్జాతీయ జ్యూరి మెంబర్లలో ఒకరిగా వెళ్ళడం, అది చాన్స్ కాదు, ఛాయస్. అదృష్టం ఎంతమాత్రం కాదు, అది సబబైన ఎంపిక. అరుదైన గౌరవం. ప్రౌడ్ అఫ్ యూ శంకర్. నీ ధిక్కార కళకు జేజేలు.

చిత్రమేమిటంటే, శంకర్ పామర్తి పొట్టివాడు. బలహీనంగా కనిపిస్తాడు. కానీ నేడు మహా శక్తి సంపన్నుడు. నేడు అట్టుడుకుతున్న ఇరాన్ లో అడుగిడిన తాను గడ్డిపరకల్తో మదగజాన్ని నిలువరించే ఒక ప్రయత్రంలో అగ్రగణ్యుడు. సర్పాన్ని తన చేత చిక్కించుకునే చలిచీమల ఇగురంలో కీలక చోదకుడు. తాను నేడు ఎలా కనిపిస్తున్నాడూ అంటే, డిక్టేటర్ ను ఎదిరించిన చార్లీ చాప్లిన్ వలే.

ఈ రోజే. ఇరాన్ లో డోనాల్డ్ ట్రంప్ పై వేసిన కేరికేచర్లతో అక్కడ ఒక గొప్ప ప్రదర్శన ఉన్నది. అమెరికన్ ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి ఒక్కటైన వందలాది వ్యంగ చిత్ర కారులకు తాను వెన్నుదన్నుగా నిలబడవలసి ఉన్నది. ఇప్పటికే ఎంపిక చేసిన పురస్కార విజేతలను నేడు ప్రకటించవలసి ఉన్నది. అది కూడా టెహ్రాన్ లోని అమర జవానుల స్మారక స్థలిలో. ఇటువంటి ఉద్విగ్న చారిత్రక తరుణంలో ఒకే ఒక్కటి గుర్తోస్తున్నది. అది ‘ది గ్రేట్ డిక్టేటర్ ‘ సినిమాలో చాప్లిన్ చివరి ప్రసంగం.

సందర్భమే ఒక సామాన్యుడిని అసాధారణమైన వ్యక్తిగా మలుస్తుందని చెప్పడానికి అది నిదర్శనం.  మరి, శంకర్ పామర్తీ, అభినందనలు. ‘ట్రంపిజమ్ పై మీ అందరి ‘అభిశంసన’కు వందనాలు. మీకు ఇరాన్ మీదుగా అమెరికా దాక వినిపించే చప్పట్లు. గర్వంతో కూడిన ఆలింగానాలు. May your tribe increase.

 -కందుకూరి రమేష్ బాబు

వ్యాసకర్త ఇండిపెండెంట్ జర్నలిస్టు, ఫోటోగ్రాఫర్

click me!