తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ముసలం: విహెచ్ ఆగ్రహం వెనక...

By telugu teamFirst Published Jun 3, 2021, 3:05 PM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలను కాంగ్రెసు అధిష్టానం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెసు సీనియర్ నేత విహెచ్ రేవంత్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెసు పార్టీలో ఎంపీ రేవంత్ రెడ్డి ముసలం ప్రారంభమైంది. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేసే సమయంలో ఆయన తిరిగి రేవంత్ రెడ్డిపై సమరానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉండడం వల్లనే విహెచ్ సమరానికి సిద్ధపడినట్లు భావిస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవి కాకపోయినా ప్రచార కమిటీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రేవంత్ రెడ్డికి కీలకమైన పదవి అప్పగించి, పార్టీ బరువు బాధ్యతలను ఆయనపై పెట్టే ఆలోచనలోనే కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 

రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నాయని తాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలికి లేఖలు రాసినట్లు విహెచ్ అంటున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే ఆయన జైలుకు వెళ్తే పార్టీ మొత్తం జైలు చుట్టూ తిరగాలా అనే ప్రశ్న వేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైతే పార్టీ కార్యాలయం గాంధీభవన్ కు ఎవరినీ రానివ్వడని కూడా ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి సత్తాపై కూడా విహెచ్ ఓ విసురు విసిరాడు. గ్రైటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎన్ని సీట్లు గెలిపించాడని ఆయన అడిగారు.

అంతేకాకుండా పార్టీలో మొదటి నుంచీ ఉన్నవాళ్లకు కాకుండా కొత్తగా పార్టీలో చేరినవారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టిందని ప్రచారం జరుగుతున్న సమయంలో విహెచ్ మళ్లీ గళమెత్తారు. 

రేవంత్ రెడ్డి ఇవాళ తనను తిట్టారని, రేపు మరొకరిని తిడుతారని ఆయన అన్నారు. అధిష్టానానికి లేఖలు రాసీ రాసీ అలిసిపోయానని ఆయన చెప్పారు. మొత్తం మీద, విహెచ్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు అర్థమవుతోంది. విహెచ్ మొదటి నుంచీ కాంగ్రెసులో ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 

తెలంగాణ కాంగ్రెసుకు తిరిగి జవజీవాలు పోయడానికి చురుకైన నాయకుడు కావాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉంది. పీసీసీ పదవి కోసం కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా పోటీ పడుతున్నారు. తాను కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ జీవర్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి దక్కవచ్చుననే వార్తలు కూడా వచ్చాయి. పిసిసీ అధ్యక్ష పదవి దక్కకపోయినప్పటికీ రేవంత్ రెడ్డికి కీలకమైన పదవి మాత్రం లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ నడిపించడానికి వీలైన పదవినే రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించే అవకాశాలున్నాయి. 

click me!