ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కింద నోటీసులు జారీచేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే కవితకు విచారణకు సంబంధించి సీబీఐ ఆప్షన్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే కవితకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేవంత్ వాదనల్లో పసలేదనే చెప్పాలి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీచేశారు. ఆమె సౌకర్యార్థం హైదరాబాద్‌లోని నివాసంలో గానీ, ఢిల్లీలోని నివాసంలో గానీ ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారించాలని అనకుంటున్నామని చెప్పారు. విచారణ ప్రదేశాన్ని తెలియజేయాని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైదరాబాద్‌లోని నివాసంలో విచారణ అధికారులకు సమాధానమిస్తానని చెప్పారు. అయితే శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అనంతరం సీబీఐకి కవిత లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై వచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ ప్రతులను ఇవ్వాలని లేఖలో సీబీఐని కవిత కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని తెలిపారు. తనకు పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో సమావేశ తేదీని ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు.
undefined
అయితే కవిత విచారణ స్థలాన్ని ఎంచుకోవాల్సిందిగా సీబీఐ నోటీసుల్లో పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అందరినీ విచారణ నిమిత్తం ఈడీ, సీబీఐలు ఢిల్లీకి పిలిచాయని అన్నారు. ఈ కేసులో కవితను ఢిల్లీలో ఎందుకు విచారించరని ప్రశ్నించారు. కవిత విషయంలో మాత్రం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారణ చేస్తామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ తీరు సరిగ్గా లేదని... కవితను ఇంట్లోనే విచారణ చేపట్టేందుకు అనుమతివ్వడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.
దీంతో కవితకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ మరింతగా చర్చ సాగుతుంది. అయితే కవితకు సీఆర్‌పీసీ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందని.. ఆ విషయం విమర్శించేవారు తెలుసుకోవాలని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే సీఆర్‌పీసీ సెక్షన్ 160ని పరిశీలించినప్పుడు.. కవితకు నోటీసుల వ్యవహారంలో విపక్షాలు చేస్తున్న విమర్శల్లో లాజిక్ మిస్ అయ్యారనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఆర్‌పీసీ-160 సెక్షన్ ఏం చెబుతుంది..
నేరంపై సరైన, సమర్థవంతమైన దర్యాప్తు కోసం పోలీసులకు సెక్షన్ 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీచేయవచ్చు. కేసుకు సంబంధించిన వాస్తవాలతో ఒక వ్యక్తికి పరిచయం ఉండవచ్చని సమాచారం అందినప్పుడు.. వారి వివరణ కోరుతూ దర్యాప్తు అధికారులు అటువంటి వ్యక్తిని పిలిచి విచారించేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. దర్యాప్తు అధికారి పేరుతో నోటీసులు జారీ చేస్తారు. అయితే దర్యాప్తు అధికారి జారీచేసే నోటీసులు లిఖిత పూర్వకంగా ఉండాలి. అయితే ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్నవారిని వారి పరిధిలోని కార్యాలయంలో గానీ, పక్కనే ఉన్న కార్యాలయంలో గానీ విచారణకు పిలవవచ్చు. అయితే ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకునే 15 ఏళ్ల లోపు వారికి, 65 ఏళ్లు పైబడినవారికి ఈ విషయంలో మినహాయింపు ఉంటుంది. అలాగే స్త్రీలకు, శారీరకంగా వైకల్యం ఉన్న వ్యక్తులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. వీరిని దర్యాప్తు అధికారులు వారి వద్దకు పిలవకుండా.. వారు ఉన్నచోటుకే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సీఆర్‌పీసీ 160 సెక్షన్‌కు ఎలాంటి పరిధి ఉండదని.. ఎక్కడైనా, ఎవరికైనా నోటీసులు ఇచ్చేందుకు అధికారం ఉంటుందని.. వీరిని సాక్షులుగానే చూడాల్సి ఉంటుందని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేసిన అధికారులు.. కవితను విచారణకు సంబంధించిన ప్రదేశాన్ని ఎంచుకోవాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కవిత హైదరాబాద్‌లోని తన నివాసాన్ని విచారణకు ఎంచుకున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదనల్లో పస లేదని తెలుస్తోంది.