వాళ్లదేమీ లేదు, మీరే అంతా...: గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖలోని ఆంతర్యం ఇదే...

By Sreeharsha GopaganiFirst Published Jun 25, 2020, 1:11 PM IST
Highlights

ప్రభుత్వ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇప్పటికైనా తనను తిరిగి హైకోర్టు ఆదేశాలనుసారం పునర్నియమించమని కోరుతున్నట్టుగా గవర్నర్ కి లేఖ రాసారు రమేష్ కుమార్. 

ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనూహ్య మలుపులు తిరిగుతోంది. న్యాయస్థానం తనను నియమించమని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తనను నియమించడంలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా తనను కాపాడాలంటూ గవర్నర్ కి ఒక లేఖ రాసారు. 

హైకోర్టు తనను పునర్నియమించాలని తీర్పును వెలువరించినప్పటికీ..... పాత కమిషనర్ కనగరాజ్‌కు ఇంకా ఎన్నికల కమిషనర్ సదుపాయాలను కల్పిస్తున్నారని రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ప్రభుత్వ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇప్పటికైనా తనను తిరిగి హైకోర్టు ఆదేశాలనుసారం పునర్నియమించమని కోరుతున్నట్టుగా గవర్నర్ కి లేఖ రాసారు రమేష్ కుమార్. 

తన తీర్పులో హై కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నియమించాలని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. 

ఆయన విధుల్లో చేరబోతుంటే..ప్రభుత్వం తరుఫున ఏజీ మాట్లాడుతూ... ఆయనను ప్రభుత్వం నియమించాలని, హై కోర్టు  తన తీర్పులో కూడా అదే  చెప్పిందని, ఆయనంతట ఆయన ఎలా వెళ్లి చేరతారు అని ప్రశ్నించింది. 

తొలుత తాను తిరిగి విధుల్లో చేరుతున్నట్టు ఉత్తర్వులను జారీచేసిన రమేష్ కుమార్... ఆ తరువాత తిరిగి వాటిని వెనక్కి తీసుకున్నారు. ఎలాగైతే వైసీపీ ప్రభుత్వం తీర్పులోని ఉన్న వ్యాఖ్యానాల ఆధారంగా వ్యవహరించిందో... ఇప్పుడు రమేష్ కుమార్ కూడా అదే బాటలోపయనించినట్టుగా కనబడుతుంది. 

హై కోర్టు తీర్పులో ప్రభుత్వం ఆయనను నియమించాలని చెప్పింది. ఇక్కడ ప్రభుత్వం అంటే.... మంత్రి మండలి అని ప్రత్యేకించి చెప్పనందున గవర్నర్ ని వెళ్లి కలిసి ఆయన ద్వారా విధుల్లో చేరాలని చూస్తున్నారు రమేష్ కుమార్.  

ఎన్నికల కమీషనర్ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి, దానికితోడుగా రాష్ట్రప్రభుత్వానికి అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటో స్వయంగా సుప్రీమ్ కోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన గవర్నర్ ద్వారా ఈ పోస్టులో తిరిగి చేరేందుకు వెళ్లి కలిసినట్టుగా కనబడుతుంది. దానితోపాటుగా ఎన్నికల కమీషనర్ ని నియమించేది గవర్నర్. అందుకే రమేష్ కుమార్ కలిశారట. 

ఇకపోతే రమేష్ కుమార్ వ్యవహారంలో హై కోర్టు ఆయనను తిరిగి నియమించామని చెప్పింది. సుప్రీంకోర్టు ఆయన నియామకం స్టే  ఇవ్వడానికి నిరాకరించింది. దానితో తన నియామకం ఇక ఖాయం అనుకున్న నిమ్మగడ్డకు ఆశించిన ఫలితం దక్కలేదు.

దానితో ఆయన మరోసారి  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఈ విషయంలో ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలేమిటని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కారుకు అక్కడ చుక్కెదురైనా సంగతి తెలిసిందే. 

హైకోర్టు తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.... రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని హెచ్చరించింది.  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఒక ఆర్డినెన్సుతో ఎలా తొలగిస్తారని నిలదీసింది. దీన్ని దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించింది.

తొలుత హై కోర్టు, ఆ తరువాత సుప్రీమ్ కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ... హుందాగా ప్రవర్తించాల్సిన ప్రభుత్వం మాత్రం అలా కాకుండా సుప్రీమ్ తీర్పుకి మరో కొత్త  భాష్యం చెబుతున్నాయి. 

నోటీసులకు బదులివ్వడానికి రెండు వారల గడువు ఇచ్చినందున, అంతలోపల ఆయనను నియమించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. ఒక వేళ రమేష్ కుమార్ నియామకాన్ని రెండు వారాలపాటు నిలువరించాలి అనుకుంటే... ఏకంగా రెండు వారల స్టే సుప్రీంకోర్టు విధించేది కదా! ఈ లాజిక్ ను ప్రభుత్వం ఇక్కడ మిస్ అవుతుంది. 

దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి. సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలుచేస్తారు. ప్రభుత్వ మంత్రి మండలి నియమాలకు అనుగుణంగా నడుచుకుంటారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. 

తాను ప్రభుత్వ మంత్రిమండలి నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరిస్తానని అంటారా... లేదంటే తన విచక్షణాధికారాలను ఉపయోగించి తాను ఇక్కడ ఎటువంటి నియామకాలను చేయడంలేదు, కేవలం న్యాయస్థానం తీర్పుకు లోబడి మాత్రమే వ్యవహరిస్తున్నాను అంటారా వేచి చూడాల్సిన అంశం. 

click me!