గుజరాత్ మోడల్ నే కాదు, జనతా కర్ఫ్యూని కూడా రిపీట్ చేసిన మోడీ!

By Sree S  |  First Published Mar 21, 2020, 6:42 PM IST

జనతా కర్ఫ్యూ... ఈ పేరు వినగానే చాలా మందికి ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ దీనికి పిలుపునిచ్చిన మోడీకి మాత్రం ఇది కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. 


ప్రపంచంలో కరోనా వైరస్ పేరు చెబితేనే అన్ని దేశాలు వణికిపోతున్నాయి. భారత దేశం కూడా ఈ వైరస్ బారిన పడింది. ఇప్పటికీ ఇంకా రెండవ స్టేజిలోనే ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలిగితే.... ఈ మహమ్మారి బారి నుండి బయటపడొచ్చని భావిస్తున్నారు. 

అందుకోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ అంటే... ప్రజలంతా స్వచ్ఛందంగా ఇండ్లలోనే ఉండి బయటకు రాకుండా ఉండడం. ఈ పేరు వినగానే చాలా మందికి ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ దీనికి పిలుపునిచ్చిన మోడీకి మాత్రం ఇది కొత్త విషయం ఎంత మాత్రమూ కాదు. 

Latest Videos

undefined

మోడీ గారికి దీనితో ఉన్న సంబంధాన్ని తెలుసుకునే కన్నా ముందు.... అసలు ఈ జనతా కర్ఫ్యూ కి మన దేశానికి ఉన్న సంబంధాన్ని ఒకసారి చూద్దాం. 

భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలాసార్లు ఇలాంటి కర్ఫ్యూ లను పాటించారు. పేర్లేమైనప్పటికీ... అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అసంతృప్తిని తెలియపరిచేందుకు ఈ పద్ధతిని ఎంచుకునేవారు. 

1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ జనతా కర్ఫ్యూ లను అధికంగా ఉపయోగించారు. అదంతా స్వతంత్రం రాకముందు. స్వతంత్రం వచ్చిన తరువాత ఈ జనతా కర్ఫ్యూ లను భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడారు. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టేవారు. 

ఆ కాలంలోనే మన ప్రధాని నరేంద్రమోడీ ఈ జనతా కర్ఫ్యూ లో తొలిసారిగా పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఆయన ఏబీవీపీ ప్రచారక్ గా పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన అప్పుడు ఒక ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్నారు. 

స్వాతంత్రానంతరం తొలి జనతా కర్ఫ్యూ... 

1956 నుంచి 1960 మధ్య కాలంలో మహా గుజరాత్ ఉద్యమం ఉధృతంగా జరిగింది. అప్పట్లో బొంబాయి రాష్ట్రం నుంచి గుజరాత్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ కాలంలో అప్పటి బొంబాయి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ కచ్ ను గుజరాత్ లో కలపడానికి వ్యతిరేకంగా వారంపాటు నిరాహారదీక్షకు పిలుపునిచ్చారు. 

తొలిసారి ముఖ్యమంత్రి దీక్షకు వ్యతిరేకంగా ఇందూలాల్ యాగ్నిక్ ప్రజలందరినీ ఇళ్లలోనే ఉండమని పిలుపునిచ్చారు. తొలిసారి మనకు జనతా కర్ఫ్యూ కి ఉదాహరణ స్వతంత్ర భారతదేశంలో కనబడుతుంది. 

ప్రధాని మోడీ పాల్గొన్న జనతా కర్ఫ్యూ...

ఇక 1974లో అవినీతి, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా జనతా కర్ఫ్యూ ని పాటించారు. దాదాపుగా 23 నగరాల్లో దెగ్గర దెగ్గర 63 రోజులపాటు ఇలా జనతా కర్ఫ్యూ ని పాటించారు. అప్పట్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఏబీవీపీ లో ప్రచారక్ గా కొనసాగుతున్నారు. ఆయన ఈ ఉద్యమంలో ముందుండి పాల్గొన్నారు. 

ఆ ఉద్యమం దెబ్బకు ప్రభుత్వం కూలింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేసారు. బయట మనుషులెవ్వరు తిరగలేదు. వాహనాలను రోడ్ల మీద చూడడమే కష్టతరమైంది. అప్పట్లో ఆ ఉద్యమం ఫుల్ సక్సెస్. ఆయన రాజీనామా చేసిన తరువాత గుజరాత్ లో రాష్ట్రపతి పాలన విధించబడింది. 

ఈ మధ్యకాలంలో జనతా కర్ఫ్యూలు...  

ఆ తరువాత ఈ మధ్యకాలంలో కూడా మనం కొన్ని జనతా కర్ఫ్యూ లను చూసాము. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా ఇలాంటి ఒక జనతా కర్ఫ్యూ కి చాలా సార్లు పిలుపునిచ్చారు. ఆయన బంద్ పిలుపులు కొన్నిసార్లు ఇండ్లలోనే ఉండడమయితే, మరికొన్ని సార్లు రోడ్లపైకి వచ్చి వంటావార్పు లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించారు.  

2013లో ప్రత్యేక గోర్ఖలాండ్ ను డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోర్ఖ జన ముక్తి మోర్చా జనతా కర్ఫ్యూ లాంటి పరిస్థితిని సృష్టించింది. తాజాగా ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కాశ్మీర్ లో అక్కడక్కడా ఇలా ప్రజలు స్వచ్చంధంగా బయటకు రాకుండా లోపలే ఉన్నారు. 

ఇన్ని సార్లు జనతా కర్ఫ్యూ లు జరిగినా అన్ని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమకున్న అసంతృప్తిని తెలియజేయడానికి వాడారు. కానీ ఇప్పుడు తొలిసారి ప్రభుత్వమే ఇలా ప్రజలందరినీ బయటకు రావొద్దని కోరడం ఇదే తొలిసారి. 

దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని ఇలా నేరుగా ప్రజలందరికీ ఇలా పిలుపునివ్వడం... దేశ పరిస్థితులను అర్థం చేసుకొని స్వచ్చంధంగా ప్రజలంతా ముందుకువస్తు తామంతా ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతోపాటుగా ఉన్నామని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయం. 

ఇలాంటి జనతా కర్ఫ్యూ వల్ల మహమ్మారి భారత్ ను వదిలి వెళ్తుందని చెప్పుకున్నప్పటికీ.... ప్రభుత్వంతోపాటుగా ప్రజలంతా ఉన్నామని, ఎలాంటి విపత్తినైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్దమనే ఒక మెసేజ్ ఇందులో దాగుంది.   

click me!