మోడీ సర్కార్ 2.0: ఫస్ట్ ఇయర్ రిపోర్ట్ కార్డు

By Sree S  |  First Published May 29, 2020, 9:03 PM IST

ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తో సహా ప్రపంచదేశాలన్ని పోరు సాగిస్తూ బిజీగా ఉన్న తరుణంలోనే మోడీ సర్కార్ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి తన మొదటి సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకుంది. 


- రాజీవ్ చంద్రశేఖర్ 

ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై భారత్ తో సహా ప్రపంచదేశాలన్ని పోరు సాగిస్తూ బిజీగా ఉన్న తరుణంలోనే మోడీ సర్కార్ రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి తన మొదటి సంవత్సరాన్ని కూడా పూర్తి చేసుకుంది. 

Latest Videos

undefined

2019 మే 30వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ రెండవ పర్యాయం అధికారాన్ని చేబట్టారు. మోడీ రెండవసారి గెలవడం తన మొదటి 5 సంవత్సరాలపాలనకు రెఫరండం వంటిది. అందులో ప్రజలు మోడీకి తమ సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా మోడీ పాపులారిటీ గతం కన్నా రెట్టింపు అయింది. 

గత మూడు దశాబ్దాల్లో ఇలాంటి మెజారిటీని సాధించిన నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. దేశంలోని అందరు ప్రజలు కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అబద్ధపు రాజకీయాలను తిరస్కరించారు. రెండవ పర్యాయం పాలనను ప్రారంభించేటప్పుడే ప్రధాని ఒక దార్శనికతతో ప్రారంభించారు. 

గ్రామీణం, పట్టణం, పేద, ధనిక, చిన్న, పెద్ద, ముసలి, ముతక అన్న తేడా లేకుండా భారతదేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగం మీద తన దృష్టిని పెట్టి అందరి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసేందుకు కంకణ బద్దుడయ్యారు ప్రధాని. 

రెండవ పర్యాయం అధికారం చేపట్టిన తొలి సంవత్సరంలోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేకపోయిన పనులను ఎన్నో చేసి చూపించారు మోడీ. చారిత్రాత్మక ఆర్టికల్ 370 రద్దు నుండి మొదలు... కొన్ని దశాబ్దాలుగా వివాదాలకు కారణభూతమైన రామ మందిర నిర్మాణానికి ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపెట్టారు. 

21 వ శతాబ్దం రెండవ దశకం ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే ఈ కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడడం నిజంగా దురదృష్టకరం. గడిచిన అయిదున్నర సంవత్సరాలుగా సాధించిన ఆర్ధిక ప్రగతికి తాత్కాలికంగా అయినా ఈ కరోనా వైరస్ మహమ్మారి బ్రేకులు వేసిందని చెప్పక తప్పదు. ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి ఇది ఇప్పుడు ముందున్న అతిపెద్ద సవాలు. 

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ నాయకత్వపటిమ ఏపాటిదో అందరికి మరోసారి రుజువు అయింది. సాధారణ మనుషులకు సాధ్యపడని ఎన్నో పనులను ఆయన అనేక కష్టనష్టాలకోర్చి చేస్తున్నారు. 

సామాన్య మానవులయితే ఈ కరోనా వేళ కుప్పకూలిపోయేవారు, కానీ మోడీ మాత్రం పూర్తిగా పనిలో నిమగ్నుడై ఈ కరోనాను ఎదుర్కోవడం ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారు. యావత్ దేశాన్ని ఈ కరోనాపై పోరులో ఒక్కతాటిపైకి తీసుకొచ్చి నడిపించడం మాత్రమే కాకుండా ఎవ్వరికి ఏ కష్టం రాకుండా చూసుకున్నారు. 

ఒకరోజులో దేశ సాధారణ పరిపాలన బాధ్యతలను చూసుకోవడంతో పాటు అవిశ్రాంతంగా ఆరోగ్య శాఖా అధికారుల నుంచి ఆర్ధిక శాఖ అధికారుల వరకు అందరితో రోజు సమావేశాలను జరుపుతూ వాటితోపాటుగా దేశ రక్షణ, ఇతర బాధ్యతలను కూడా చక్కబెట్టడం కేవలం పనినేదైవంగా భావించే మోడీ వల్ల మాత్రమే సాధ్యమయింది. 

నరేంద్రమోడీ తన తొలి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలు, అనేక మార్పులు అన్ని కూడా ఈ మహమ్మారి విరుచుకుపడ్డ సమయంలో అక్కరకు వచ్చాయి. ప్రజలంతా లాక్ డౌన్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, చేతిలో చిల్లి గవ్వ లేదు అన్నప్పుడు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద డబ్బును వారివారి అకౌంట్లలో జమచేస్తే... మధ్యలో ఎవ్వరు తినేయకుండా నేరుగా వారి అకౌంట్లలోకి వెళ్లాయి. 

జన్ ధన్ అకౌంట్ల పేరిట ప్రతి ఒక్కరికి ఒక బ్యాంకు అకౌంట్ ఉండాలన్న సదుద్దేశంతో డిజిటల్ ఇండియాలో భాగంగా ఆయన చొరవచూపి సాకారం చేసిన JAM ట్రినిటీ- జన్ ధన్, ఆధార్, మొబైల్... ఈ మూడిటి సంయోగం వల్ల మాత్రమే అది సాధ్యమయింది. 

కేవలం ఇవి మాత్రమే కాకుండా పేదల సంజీవిని ఆయుష్మాన్ భారత్, తక్కువ రేట్లకే మందులు అందించే జన్ ఔషదధి మందుల దుకాణాలు, ఇలా అనేకం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు చాలా ఉపయుక్తకరంగా మారాయి. 

విదేశాల్లో ఈ కరోనా వల్ల చిక్కుకుపోయిన వారిని తీసుకురావడం కోసం మొదలు పెట్టిన వందే భారత్ మిషన్ కానీ, దేశీయంగా చిక్కుకొన్న వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ ప్రత్యేకరైళ్లు కానివ్వండి అన్ని కూడా ఆయన తీసుకున్న చర్యల వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి.

ఆయన తీసుకున్న ఈ చర్యలన్నీ కూడా భారతదేశంపై ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని సాధ్యమైనంతమేర తగ్గించడమే కాకుండా, భారతదేశంలో ఈ మహమ్మారి వల్ల కలిగే మరణాలను కూడా చాలాతక్కువ చేయగలిగాయి. ఈ మొత్తం వ్యవహారంలో మరో రెండు విషయాలు ఠక్కున మెరుస్తాయి. 

మొదటిది వెల్లివిరుస్తున్న సమాఖ్య విధానం. రాష్ట్రాలు, కేంద్రం సంయుక్తంగా కలిసికట్టుగా తీసుకుంటున్న  నిర్ణయాలు,ప్రధాని ఏ నిర్ణయం తీసుకోవాలన్న కూడా రాష్ట్రాలను అడగడం, వారి వాదనను విన్నతరువాత మాత్రమే దానిపై ఒక నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ కరోనా పై పోరులో భారతదేశాన్ని మిగితా దేశాలకన్నా ముందుంచాయి. 

ఇక మరో అంశం ప్రజలను ఈ మహమ్మారిపై పోరులో భాగస్వాములను చేయడం. ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి,ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ... ప్రధాని పిలుపుకు స్పందించారు. ఆయన ఒక్కమాట చెప్పగానే అందరూ కూడా ఈ లాక్ డౌన్ కి సహకరించారు. ఈ లాక్ డౌన్ పోలీసులతో బలవంతంగా అమలు చేపించింది కాదు. ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్న లాక్ డౌన్. 

ప్రజలకు కూడా ప్రధాని ఈ కష్టకాలంలో ఆదుకుంటారు అన్న నమ్మకం ఉండబట్టే వారు సహకరించారు. ప్రధాని వారి నమ్మకాన్ని నిలబెడుతూ లాక్ డౌన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీని ఇచ్చారు. ఆ తరువాత తాజాగా ఆత్మనిర్భర్ ప్యాకేజి పేరిట దేశంలో ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు కృషి చేస్తున్నారు. 

ఈ సమస్యలు సరిపోవు అన్నట్టుగా తాజాగా సరిహద్దు వెంట పాకిస్తాన్, చైనాల కవ్వింపు చర్యలు. ఈ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ ఈ వైరస్ ని తుదముట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే సరిహద్దుల వెంట వారికి కూడా బలమైన జవాబు ఇచ్చింది నరేంద్ర మోడీ సర్కార్. 

ఈ మహమ్మారి దెబ్బ మన మీద మరికొంతకాలం పాటు తప్పక ఉంటుంది. ఈ సందర్భంలో మనకు కావలిసింది ఒక బలమైన నాయకత్వం. అంతే తప్ప తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అస్థిర నాయకత్వాలు, నిర్ణయాలను తీసుకోలేని నాయకత్వం మాత్రం కాదు. 

అదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి కాలంలో నరేంద్రమోడీ నాయకత్వంలో భారతదేశం బలంగా ఉంది. రానున్న కాలంలో ప్రపంచం మరింతగా మారబోతుంది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మనం ఎలా ప్రపంచానికి మార్గదర్శకులమయ్యామో, కరోనా తరువాత కూడా మనమే ప్రపంచానికి మార్గదర్శకులమవుతాము. తదుపరి నాలుగు సంవత్సరాలు కూడా భారతదేశం ఆర్థికప్రగతిలో దూసుకుపోవడానికి సిధ్దముగా ఉంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్

click me!