రేవంత్ రెడ్డి చేతిలో చేతులు కలిపి..: కెసిఆర్ కు లెఫ్ట్ షాక్?

By Pratap Reddy KasulaFirst Published Feb 14, 2023, 10:54 AM IST
Highlights

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్నసంఘటన చర్చనీయాంశంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సిపిఐ నాయకులు రేవంత్ రెడ్డితో మాట్లాడిన సంఘటన అది.

వచ్చే ఎన్నికల్లో వామపక్షాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇస్తాయా అనే సందేహం కలుగుతోంది. నిరుడు నవంబర్ 3వ తేదీన జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలు రెండు కూడా కెసిఆర్ వెంట నడుస్తాయనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. వామపక్ష పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల కదలికలు, వ్యాఖ్యలు కూడా ఆ అభిప్రాయాన్ని బలపరుస్తూ వచ్పాయి.

అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. సిపిఐ స్థానిక నాయకులు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతితో చేతులు కలిపారు. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర సందర్భంగా ఆ సంఘటన చోటు చేసుకుంది. వామపక్షాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నాయి. బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో కలిసి నడవడానికి అవి సిద్ధపడ్డాయి. టిఆర్ఎస్ ను కెసిఆర్ బిఆర్ఎస్ గా మార్చి బిజెపిని జాతీయ స్థాయిలో ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. ఈ స్థితిలో తెలంగాణలో కెసిఆర్ కు వామపక్షాలు మద్దతు ఇస్తాయనే భావన బలంగా నాటుకుపోయింది.

రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా అవుషాపురం నుంచి బయలుదేరి పినపాక వచ్చారు. ఈ సందర్భంగా దాదాపు 25 మంది కమ్యూనిస్టు పార్టీలకు చెందిన అనుబంధ సంఘాల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు పినపాకలో రేవంత్ రెడ్డిని కలిశారు. రైతు సమస్యలపై వారు రేవంత్ రెడ్డితో చర్చించారు. 

అయితే తమ నాయకులు రేవంత్ రెడ్డితో కలిశారనే వార్తలను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. ప్రసాద్ ఖండించారు. పినపాకలో తాము చేపట్టిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కలిసిపోయిందని, అంతకు మించి ఏమీ జరగలేదని ఆయన అన్నట్లు ఆంగ్ల దినపత్రిక దక్కన్ క్రానికల్ రాసింది. రేవంత్ రెడ్డి తమ కార్యకర్తల నిరసన కార్యక్రమం వద్దకు వచ్చారని, అప్పుడు రేవంత్ రెడ్డి తమ కార్యకర్తలతో మాట్లాడరని ఆయన అన్నారు.

అయితే, జాతీయ స్థాయిలో ఎలా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో వామపక్షాలు బిఆర్ఎస్ తో నడిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బిఆర్ఎస్ తో సీట్ల పంపకంలో ఎక్కువ సీట్లు సంపాదించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్నాయి. ఇందుకు తగిన కసరత్తు కూడా సిపిఐ, సిపిఎం చేస్తున్నాయి. బిజెపిని అడ్డుకునే వ్యూహంలో భాగంగా అవి కెసిఆర్ తో కలిసి నడవాలని యోచిస్తున్నాయి. 

click me!