జాతీయ రాజకీయాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై తన వైఖరిని కూడా పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి కారణమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.
తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తానని పదే పదే చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ట్విస్ట్ ఇచ్చారు. తాను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని, తాను ఢిల్లీకి వెళ్లితేనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని ఆయన ఆదివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. అది ఒక్క ఎత్తయితే, మరి కొన్ని వ్యాఖ్యలు కూడా కేసీఆర్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
కొన్ని విషయాలు బయటికి చెప్పలేనని, ఎవరితో ఎలా మాట్లాడింది ఇతరులతో పంచుకోలేనని కేసీఆర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధ)ాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోలేనని, తాను రాష్ట్రాననీ పార్టీనీ కాపాడుకోవాలీ, అందుకే కొన్ని విషయాలను బయటకు చెప్పలేనని ఆయన అన్నారు బయటకు చెప్పలేని విషయాలు, సంఘటనలు ఏమి ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
undefined
జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బిజెపిపై గర్జించి, జాతీయ రాజకీయాలకు వెళ్తానని చెప్పిన కేసిఆర్ పూర్తిగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. జిహెచ్ఎసీ ఎన్నికల్లో బిజెపి అనూహ్యమైన ఫలితాలు సాధించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాతే ఆయన వైఖరి పూర్తిగా మారిపోయింది.
అంతకు ముందు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, నాయకులు రోడ్డ మీద బైఠాయించి సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. సాగు చట్టాలను కేసీఆర్ పూర్తిగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను కలిసి సంఘీభావం ప్రకటిస్తారని భావించారు. కానీ, అదేమీ జరగలేదు. తిరిగి హైదరాబాదు వచ్చారు.
కేంద్రంపై, బిజెపిపై ఆయన పూర్తిగా మౌనం వహించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అందరూ అంటున్న సమయంలో కూడా కేసీఆర్ మాట్లాడలేదు. మంత్రులు కేటీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడలేదు. దీన్నిబట్టి చూస్తే కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల కార్యాచరణను అటకెక్కించినట్లు భావిస్తున్నారు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏం జరిగిందనేదే ఆసక్తికరంగా మారింది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల ఊసెత్తకపోవడం, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనకపోవడం వంటి కేసీఆర్ వైఖరికి, ఢిల్లీ పర్యటనకు సంబంధం ఉందనే ప్రచారం మాత్రం ముమ్మరంగా సాగుతోంది. దీన్ని కేసీఆర్ ఎలా అధిగమిస్తారనేది చూడాల్సి ఉంది.