బిగ్‌బాస్‌లో 'విశ్వరూపం' – రివ్యూ

By telugu teamFirst Published Aug 4, 2018, 6:02 PM IST
Highlights

'విశ్వరూపం’ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిన్న బిగ్ బాస్ షోకి విచ్చేసిన కమల్ హసన్ ఆ షో పట్ల ఉన్న చిన్న చూపును తొలగించేలా చేసిన వ్యాఖ్యలు కీలకమైనవే. రియాలిటీ షో లకున్న విశ్వరూపం నిజ జీవితాన్ని ప్రదర్శించడమే అని వారు నొక్కి చెప్పడం విశేషం.

అవును. బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని నిన్న కమల్ తన రాకతో షాక్ కు గురి చేశారు. ఐతే, షాక్ అనడం కంటే అయన వారిని ఆలోచనల్లో పడేశారని చెప్పాలి. 

ఇలాంటి రియాలిటీ షోల పట్ల ప్రజల్లో ముఖ్యంగా మేధావులకు కొంత వ్యతిరేకత ఉండవచ్చని అయన అంగీకరిస్తూనే ఒక సూచన చేశారు. బిగ్ బాస్ అన్నది ఒక మినియేచర్ వరల్డ్ అని, ప్రేక్షకులు దీన్ని సమాజానికి ఒక ప్రతీకగా గుర్తించాలని చెప్పారు.

బయట సమాజంలో వేరు వేరు స్వభావాలకు చెందిన వ్యక్తులు ఎలాగైతే నివసిస్తారో, రకరకాలుగా ప్రవర్తిస్తారో  ఇక్కడా అలాంటిదే ఉంటుందని, ఒక రకంగా ఇది మన సమాజానికి ఒక దర్పణం అని భావించాలని కమల్ గుర్తు చేశారు. హేతువాది బాబు గోగినేనిని చూస్తూ అయన ఈ మాటలు చెప్పడం, ఆలోచనాపరులకు చెప్పినట్టే అని భావించాలి. 

కాగా, విశ్వరూపం సినిమా ప్రమోషన్ లో భాగమే అయినా కమల్ చేసిన వ్యాఖ్యల ప్రాధాన్యత తక్కువేమీ కాదని గుర్తించాలి. 

ఈ కార్యక్రమాన్ని లైట్ గా తీసుకునే వారికి కమల్ హుందాగా చురకవేసి, బుల్లితెర ప్రభావం గొప్పదని, మనం ఒప్పుకున్నా ఒప్పుకొకపోయినా రియాలిటీ షోల ప్రభావం ఉంటుందని  చెప్పినట్టు కూడా గుర్తించాలి.

 

ఆర్డర్ ఉండటమే 'విశ్వరూపం'  

కమల్ కేవలం సూచన చేయలేదు. సమాజానికి ఒక నఖలుగా ఉండే ఈ బిగ్ బాస్ ప్రదర్శన లో ఒక ఆర్డర్ కూడా ఉండాలని, అది లోపించిన విషయాన్ని గుర్తు చేయడం విశేషం. 

నిజానికి బయటి సమాజంలో పద్దతిగా మసలుకోవడం ఎట్లా అవసరమో ఇలాంటి షోలో పాల్గొన్న వారు కూడా కొన్ని విలువలతో కూడిన పద్ధతి పాటించాలని అయన సూచించారు. 

ఒక ఆర్డర్ ఉండాలని కమల్ ఆదేశించడం నిజానికి ఇప్పటిదాకా సరదాగా సాగిపోతున్న షోలో ఒక విశ్వరూపమే అనాలి.

సివిక్ సెన్సిటివిటీ గురించి అయన చెబుతూ, షోలో పాల్గొనే వారికి కూడా అలాంటి సామాజిక బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. “మీ నడవడిక సరిగా ఉండాలి” అని అయన అన్నారు. “మీరు సంఘాన్ని ప్రభావితం చేసే వారని గుర్తు పెట్టుకోవాలి” అని కూడా  చెప్పడం విశేషం.

కార్యక్రమంలో ఇప్పటిదాకా నాని మందలించడం, కోపం తెచ్చుకోవడం అన్నది కేవలం వ్యక్తిగతంగా సాగింది. నిన్న కమల్ ఆలోచనాత్మకంగా సూచిస్తూ, సరైన గైడెన్సీ ఇచ్చి వెళ్ళడం ఈ షోకు అదనపు ఆకర్షణ..

 

విశ్వరూపం వర్సెస్ సూక్ష్మరూపం

నటుడుగా, దర్శకుడిగానే కాకుండా యాంకర్ గా ఉండటం కూడా ఒక బాధ్యత అని  కమల్  చెప్పడం కూడా బాగుంది. సొసైటీని ప్రభావితం చేసే శక్తి ఉన్నందునే తాను కూడా తమిళంలో ఈ షో నిర్వహణకు ఒప్పుకున్నానని కమల్ చెప్పడం కొసమెరుపు. అంతిమంగా ఇది ఒక ఆట ఐనప్పటికే జీవితాన్ని ప్రదర్శిస్తుందని చెప్పడం మరో మేలు కొలుపు.

అంతకు ముందే కమల్ కోపం గురించి కూడా ఒక వ్య్యాఖ్య చేశారు. అది కూడా గోగినేనిని ఉద్దేశించే అన్నారు. మనిషికి వివేచన ముఖ్యం అని, మానవ సమాజం ఒక్క రోజులో ముందుకు పోదని, అందుకు కోపంతో కాకుండా నిలకడగా సాగడమే శరణ్యమని అన్నారు.  ఇలా షోలో కొందరి అతి ప్రవర్తనకు తనదైన శైలిలో చురక వేయడం కూడా నిన్నటి విశేషం.

ఏమైనా, రియాలిటీ షోల కున్న ప్రాముఖ్యతను గుర్తు చేసే అవకాశం తీసుకున్న కమల్ ఈ కార్యక్రమంపై ఇప్పటిదాకా ఉన్న చిన్న చూపును తగ్గించే దిశలో తన విశ్వరూపం చూపించారనే చెప్పాలి. 

చిన్న వాడైన నాని గానీ, కనిపించకుండా ఉన్న బిగ్ బాస్ గానీ చేయలేని పని అతిథిగా వచ్చిన కమల్ చేయడం విశేషం.  ఆ మేరకు అసలైన 'విశ్వరూపం' చూపిన కమల్ నిజమైన 'బిగ్ బాస్' పాత్ర పోషించారనే చెప్పాలి.

-కందుకూరి రమేష్ బాబు

(ఈ ఆర్టికల్ లో రచయిత వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఏసియానెట్ న్యూస్ కు ఏ మాత్రం సంబంధం లేదు. అవి రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని మనవి)

click me!