జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో తాను అనుకున్నది సాధించారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. టిడిపి చీఫ్ చంద్రబాబుతో బిజెపిని పొత్తుకు సిద్ధం చేయాలని ఆయన అనుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. తన పార్టీ సహచరుడు నాదెండ్ల మనోహర్ ను వెంట పెట్టుకుని ఆయన ఢిల్లీ పర్యటన చేశారు. ఈ ఢిల్లీ పర్యటనపై పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత కొంత కాలంగా పవన్ కల్యాణ్ రెండు ప్రధానమైన అంశాల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్గొన్న పలు సమావేశాల్లో ఆ రెండు అంశాల గురించే పదే పదే మాట్లాడుతూ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేది ఆయన పట్టుదలగా కనిపిస్తోంది. అందుకే ఆ రెండు అంశాలను ఆయన ప్రధానం చేసుకున్నారు. ఒకటి... రాష్ట్రంలో వైఎస్సార్ వ్యతిరేక ఓటు లేదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడడం. రెండోది... బిజెపి రాష్ట్ర నాయకత్వం తనకు సహకరించడం లేదనేది. ఈ రెండు విషయాల గురించి బిజెపి జాతీయ నాయకులతో మాట్లాడడానికే ఢిల్లీ వెళ్లారని అనుకుంటూ వస్తున్నారు. అయితే, ఢిల్లీ పర్యటనలో ఆయన మొదటి విషయానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారనే మాట వినిపిస్తోంది.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలంటే నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో జనసేన, బిజెపి పొత్తు పెట్టుకోవాలి. చంద్రబాబుతో కలిసి నడిచేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబును తమ కూటమిలో కలుపుకోవాలని చెప్పడానికి, అందుకు బిజెపి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని భావిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారని ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసిపి నాయకుడు అంబటి రాంబాబు అనడంలోని ఆంతర్యం అదే. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. నిజానికి, అందులో తప్పేమీ లేదు. ఏ పార్టీ ఎవరితోనైనా కలవవచ్చు.
ఇక రెండో విషయానికి వస్తే, బిజెపి రాష్ట్ర నాయకులు తనతో కలిసి ఉద్యమాలు చేయడానికి ముందుకు రావడం లేదని, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేయడానికి ముందుకు వస్తుంటే వారు కలిసి రావడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మీద అది పరోక్ష విమర్శ కూడా. ఒక రకంగా... బిజెపి రాష్ట్ర నాయకత్వం వైసిపికి మద్దతుగా నిలుస్తుందని చెప్పడమే అవుతుంది. అయితే, బిజెపి నాయకుల మాట మరో రకంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపి నాయకులు మాధవ్ పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన తమకు సహకరించడం లేదని ఆయన విమర్శించారు. వైసిపి ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారే తప్ప బిజెపి గెలిపించాలని ప్రజలకు చెప్పలేదని ఆయన అన్నారు.
ఒక రకంగా పవన్ కల్యాణ్ స్పష్టంగానే ఉన్నారని చెప్పాలి. బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు తన నాయకత్వంలో పనిచేయాలని ఆయన కోరుకుంటున్నారు. అదే సమయంలో జగన్ ను ఓడించే లక్ష్యంలో బిజెపి కలిసి వచ్చి, చంద్రబాబుతో నెయ్యానికి సిద్ధపడాలని ఆయన కోరుకుంటున్నారు.
కొసమెరుపు ఏమిటంటే.. ఢిల్లీ పర్యటనలో పవన్ కల్యాణ్ బిజెపి ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇంచార్జి మురళీధరన్ ను రెండు సార్లు కలిశారు. బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడానికి ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అమిత్ షాను కలవకుండానే ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు.