జగన్‌తో విజయసాయి రెడ్డికి దూరం పెరిగిందా?.. తారకరత్న పెద్దకర్మ వేళ మరింత జోరందకున్న ప్రచారం..!

By Sumanth Kanukula  |  First Published Feb 25, 2023, 5:07 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. వైసీపీ అధిష్టానానికి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి దూరంగా పెరిగిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. 


ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. వైసీపీ అధిష్టానానికి ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి దూరంగా పెరిగిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతుంది. సినీ నటుడు తారకరత్న చనిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి వ్యవహరించిన తీరు, ఇటీవల పార్టీలో పలు బాధ్యతల నుంచి ఆయనను తప్పించడం చూస్తే సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం నిజమనేపించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే విజయసాయిరెడ్డిలో గతంలో ఉన్న జోష్ కనిపించలేదని చర్చ సాగుతుంది. అయితే జగన్‌‌కు విజయసాయిరెడ్డికి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం నేపథ్యంలో తెరపైకి వస్తున్న విషయాలను ఒకసారి పరిశీలిస్తే.. 

సీఎం జగన్‌ వైసీపీ స్థాపించక ముందు నుంచే విజయసాయి రెడ్డి ఆయనతో కలిసి ప్రయాణించారు. జగన్ కంపెనీలకు ఆడిటర్‌గా కూడా పనిచేశారు. వైసీపీ ఏర్పాటు తర్వాత.. తెరపైకి వచ్చిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి కూడా కొన్ని నెలలు జైలులో గడిపారు. మరోవైపు వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డిపై ముద్ర ఉంది. జగన్‌ దగ్గరికి వెళ్లలేనివారు విజయసాయిరెడ్డి వద్ద తమ సమస్యలు చెప్పుకునేవారని వైసీపీ వర్గాలే చెబుతాయి. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి కీలక భూమిక పోషించారనే సంగతి తలిసిందే. ఐ ప్యాక్‌తో కోఆర్డినేషన్ విషయంలో కూడా విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర అని చెబుతారు. 

Latest Videos

undefined

 

మరోవైపు ఢిల్లీలో జగన్ పర్యటనలు, జాతీయ స్థాయిలో పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ విజయిసాయిరెడ్డే చూసేవారు. ఈ క్రమంలోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డికి.. పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించారు. మూడు రాజధానుల నినాదం, విశాఖ పరిపాలన  రాజధాని కానుందని ప్రకటించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డికి అత్యంత ముఖ్యమైన బాధ్యతలు  అప్పగించారనే ప్రచారం సాగింది. అలాగే ఢిల్లీలో పార్టీ వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి అంతా తానై వ్యవహరించేవారు.  

అయితే గతేడాది నుంచి పార్టీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతుందనే ప్రచారం తెరమీదకు వచ్చింది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతల నుంచి తొలగించడం, ఆ తర్వాత అత్యంత కీలకమైన సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డి నుంచి తప్పించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డికి అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సజ్జల పార్టీలో నెంబర్ 2గా మారారని వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక.. ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సజ్జల.. సీఎం జగన్‌కు మౌత్ పీస్‌గా వ్యవహరించారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడం, ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ప్రజలకు తెలిసేలా చేయడం వంటివి సజ్జల చేస్తున్నారు. ఈ క్రమంలోనే సజ్జల కుమారుడికి కూడా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంతో.. విజయసాయిరెడ్డి ప్రాధాన్యత క్రమంగా తగ్గడం మొదలైందనే వార్తలకు బలం చేకూర్చినట్టైందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటూ వస్తున్నాయి. 

ఇదిలా ఉంటే.. ప్రతి చిన్న విషయానికి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడే విజయసాయి రెడ్డి కొంతకాలంగా విమర్శల జోలికి వెళ్లడం లేదు. పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై పోస్టులు చేస్తున్న ఆయన.. గతంలో మాదిరిగా ప్రతిపక్షాలపై అసభ్య పదజాలం వినియోగించడం లేదు. ఇందుకు రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో విజయసాయిరెడ్డికి చోటు దక్కడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. అయితే ఇటీవల పరిణామాలు పార్టీకి విజయసాయి రెడ్డికి మధ్య మరింత దూరం పెంచాయని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

తారకరత్న విషయంలో..
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైన తారకరత్న.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇక్కడ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి.. విజయసాయిరెడ్డి భార్య సోదరి కూతురు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తారకతర్నను పరామర్శించడమే కాకుండా.. ఆయన మరణించిన తర్వాత కూడా అంతిమ సంస్కారాల కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. అయితే ఈ సమయంలో తారకరత్నకు టీడీపీ ఎమ్మెల్యే, తారకరత్న బాబాయి నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురపించాడన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయనే ప్రచారం కూడా ఉంది. 

అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ విజయసాయిరెడ్డి తారకరత్న భౌతిక కాయం వద్దనే ఉన్నారు. తారకరత్న కుటుంబం తరఫున అంతా తానై బాలకృష్ణ వ్యవహరించగా.. అలేఖ్య రెడ్డి కుటుంబం తరఫున ఆ పాత్రను విజయసాయిరెడ్డి పోషించారు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన ప్రతివారితో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చిరంజీవి.. ఇలా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అయితే చంద్రబాబు పక్కనే కూర్చొని విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న ఫొటో, వీడియో.. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనే తెగ చక్కర్లు కొట్టింది. 

అయితే అలాంటి విషాద సమయంలో అక్కడ రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఎలాంటి  అవకాశం ఉండదు. తారకరత్న కుటుంబానికి ఎలా అండగా ఉండాలనే అంశంపై వారు చర్చించుకుంటారని కూడా సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేశారు. అయితే చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిరెడ్డి పక్కనే ఉండటం.. చంద్రబాబు తారకరత్న నివాసం నుంచి వెళ్తున్న సమయంలో కూడా ఆయన వెంట కారు వైపు వెళ్లడం వైసీపీలో పెద్ద చర్చకే దారితీసిందని ప్రచారం సాగుతుంది. 

మరోవైపు లోకేష్ పాదమహిమ వల్లే తారకరత్నకు ఇలా జరిగిందని కొందరు వైసీపీ నాయకులు సైతం కామెంట్స్ చేశారు. ఇక, తారకరత్న మరణం విషయంలో లక్ష్మీ పార్వతి కొన్ని వ్యాఖ్యలు చేశారు.  తారకరత్న ఎప్పుడో మరణించారని.. లోకేష్ పాదయాత్ర కోసం ఆ విషయాన్ని దాచిపెట్టారనే ఆరోపణలు చేశారు. వైసీపీ మద్దతుదారుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఇదేరకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. అయితే ఈ ఆరోపణలకు విజయసాయిరెడ్డి తారకరత్నను ఆస్పత్రిలో పరామర్శించిన సమయంలో చేసిన కామెంట్స్‌తో టీడీపీ మద్దతుదారులు చెక్ పెట్టారు. ఈ పరిణామాలతో పాటు.. బాలకృష్ణపై పదే పదే ప్రశంసలు, చంద్రబాబుతో చర్చలకు సంబంధించి విజయసాయిరెడ్డి వ్యవహారంలో వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు ఇటీవల వైసీపీలో చోటుచేసుకున్న ఓ పరిణామాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. 

అదేమిటంటే.. 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల సమన్వర్తగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లోనే వైసీపీ అనుబంధ సంఘాల సమన్వయకర్తగా విజయసాయి రెడ్డి ఉండగానే.. ఆయనకు అసిస్టెంట్‌గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జాయింట్ కోఆర్డినేటర్‌గా సీఎం జగన్ నియమించారు. అయితే తాజాగా విజయసాయిరెడ్డిని అనుబంధ సంఘాల సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించినట్టుగా సమాచారం. విజయసాయిరెడ్డి  తీరుపై గుర్రుగా  ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతుంది. 

అయితే సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ.. ఈ వ్యవహారంపై అటు వైసీపీ గానీ, ఇటు విజయసాయి రెడ్డి గానీ ఏ విధంగానూ స్పందించడం లేదు. దీంతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగే అవకాశాలే  కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి స్పందిస్తే తప్ప ఈ ప్రచారానికి తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈలోపే తారకరత్న పెద్దకర్మ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటం.. బాలకృష్ణ, విజయసాయి రెడ్డి ఆ బాధ్యతలను భుజాన వేసుకోవడంతో ఈ ప్రచారం మరింత ఉధృతమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.  

తారకరత్న పెద్దకర్మ.. 
తారకరత్న పెద్దకర్మను మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాలకృష్ణ, విజయసాయిరెడ్డిలు మరోసారి కలవనున్నారు. ఇందుకు సంబంధించి ఓ కార్డు కూడా ప్రస్తుం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే అందులో తారకరత్న ఫొటో విషయానికి  వస్తే.. మెడలో పసువు  కండువా, పక్కనే టీడీపీ జెండా ఉండటం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వ్యవహారాలపై వైసీపీ అధిష్టానం  గానీ, విజయసాయిరెడ్డి గానీ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.  

click me!