బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. బిజెపి నుంచి ఆయన వలసలను ప్రోత్సహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) హుజూరాబాద్ ఆపరేషన్ ను పతాక స్థాయికి తీసుకుని వెళ్లేందుకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి, తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. బిజెపి నుంచి స్థానిక నాయకుల వలసలను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఇల్లంతకుంటకు చెందిన దాదాపు 200 మందిని ఆయన టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.
వారు టీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా హరీష్ రావు తన పాత సహచరుడు ఈటల రాజేందర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో బిజెపి వద్ద తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా హుజూరాబాద్ ను ఈటల రాజేందర్ నుంచి విముక్తి చేస్తామని చెప్పారు.
undefined
బిజెపి నుంచి స్థానిక నాయుకులను పార్టీలోకి ఆహ్వానించడంతోనే సరిపెట్టకుండా టీఆర్ఎస్ శ్రేణులు జారిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక నేతలను సిద్ధిపేటకు పిలిపించుకుని ఆయన మాట్లాడుతున్నారు. వారికి తగిన హామీలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు ఆపరేషన్ ను తట్టుకోవడానికి ఈటల రాజేందర్ ఎక్కువగా శ్రమించాల్సే ఉంటుంది.
Also Read: ఈటల రాజేందర్ ఎఫెక్ట్: హుజూరాబాద్ లో బిజెపికి కార్యకర్తల షాక్
కాగా, హుజూరాబాద్ పార్టీ శ్రేణులతో మరో వైపు మంత్రి గంగుల కమాలకర్ నిత్యం టచ్ ఉంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఊపునిస్తున్నారు. మరోవైవు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు కూడా తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా లోలోపల హుజూరాబాద్ లో టీఆర్ఎస్ విజయం కోసం పనిచేస్తున్నారు.
మరోవైపు బిజెపి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్ చేజారకుండా చూసుకోవాలనే పట్టుదలతో ఉంది. మండలాలకు ఇంచార్జీలను నియమించింది. సమన్వయ బాధ్యతలను కూడా ప్రేమేందర్ రెడ్డికి అప్పగించింది. మాజీ ఎంపీ జీతేందర్ రెడ్డి మొత్తం నియోజకవర్గం బాధ్యతలు చూస్తున్నారు. ఈటల రాజేందర్ మీద నియోజకవర్గంలో సానుభూతి ఉందనే అంచనా టీఆర్ఎస్ నేతలకు ఉంది. ఎన్నికలు వెంటనే జరిగితే ఈటల రాజేందర్ కు ప్రయోజనం కలుగవచ్చుననే అభిప్రాయంతో కూడా ఉంది. మొత్తం, మీద, హుజూరాబాద్ లో పోటీ రసకందాయంలో పడింది.