దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయా అంటే... సమాధానం అవుననే వచ్చేలా కనబడుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని చెప్పిన తెరాస కనీసం 60 సీట్ల మార్కును కూడా అందుకోలేకపోయింది. గత దఫా ఎన్నికల్లో 99 సీట్లను గెలిచి బల్దియాలో గులాబీ జెండాను రెపరెపలాడించిన తెరాస ఈసారి మాత్రం ఖంగు తిని 55 సీట్లతో సర్దిపెట్టుకుంది.
మొన్న దుబ్బాక ఎన్నికల్లో తెరాస ను ఓడించి షాక్ ఇచ్చిన బీజేపీ.... గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తాను చాటింది అనూహ్యంగా 48 సీట్లను గెలిచి దాదాపుగా తెరాస ను ఓడించినంత పనిచేసి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
undefined
తాము గ్రేటర్ ఎన్నికల్లో కష్టపడ్డది తెరాస కు ప్రత్యామ్నాయం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అని నిరూపించుకోవడానికి అని, రాబోయే 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానే అని బల్లగుద్ది మరి చెబుతున్నారు.
ఈ ఎన్నికలను గనుక పరిశీలిస్తే ఇటు బీజేపీ అయినా, అటు తెరాస అయినా రెండు పార్టీలు కూడా తమ సర్వ శక్తులను ఒడ్డాయి. బీజేపీ తరుఫున హోమ్ మంత్రి వరకు ఎందరో అగ్రనేతలు కదిలి వచ్చారు. తెరాస తమ మంత్రులను డివిజన్ల వారీగా ఇంచార్జిలుగా నియమించి మరీ ఎన్నికల్లో పోటీ చేసింది.
ఈ ఎన్నికల ఫలితాల దెబ్బకు రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించింది. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ లో ఉన్నవారికి భవిష్యత్ లేదని, బీజేపీ మాత్రమే రాష్ట్రంలో తెరాస కు ప్రత్యామ్నాయం అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహించాలని చూస్తుంది కాషాయ దళం. అసలే నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కి ఇదొక జీవన్మరణ సమస్య.
బీజేపీ ఈ ఎన్నికల్లో మేయర్ పదవిని సాధించలేకపోవచ్చు కానీ తెరాస ను పూర్తిగా కార్నర్ చేసి మజ్లీస్ తో పొత్తు పెట్టుకుంటే తప్ప మేయర్ పదవిని దక్కించుకోలేని పరిస్థితిని కల్పించింది.
ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మొన్నటి దుబ్బాక, నేటి గ్రేటర్ ఎన్నికల ఫలితాలే మనకు ఉదహరిస్తున్నాయి. ఇంకో మూడు సంవత్సరాల పాలనా కాలం ఉండగానే ప్రజలు దుబ్బాకలో వారిని ఓడించడంలో కానీ, గ్రేటర్ పరిధిలో బీజేపీని అందలం లెక్కించడంలో కానివివ్వండి ఇదే అంశం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది.
దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు రెండూ కూడా తెరాస కు, ముఖ్యంగా కేటీఆర్ కి వార్నింగ్ బెల్స్ లాంటివి. మరొక నాలుగు నెలల్లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక కూడా జరగబోతుంది. దానికన్నా ముందు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సైతం పోలింగ్ జరగనుంది.
రాష్ట్రంలో ప్రస్తుత తరుణంలో ఉద్యోగులు, నిరుద్యోగులు ఇద్దరు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ విషయాన్నీ స్వయంగా పార్టీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. ఉద్యోగ నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు ఎంత కోపంగా ఉన్నారో గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు అర్థమైపోయింది.
ఇప్పుడు మరో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఉద్యోగుల కోపం నేటి పోస్టల్ బ్యాలట్ల ద్వారా తేటతెల్లమైంది. రానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓట్లేసే వారిలో ఉద్యోగులు, యువతే అధికం. ఇది ఇప్పుడు పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించనుంది.
ఈ రెండు విషయాలను గనుక తెరాస సెట్ చేసుకోకపోతే మాత్రం యువరాజు కేటీఆర్ కి రానున్న కాలంలో మరిన్ని ఎదురుదెబ్బలు తప్పవు. ముఖ్యంగా యువత ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు.
నీళ్లు నిధులు నియామకాలు అని జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొరకు అహర్నిశలు పోరాడిన యువకులు ఉద్యోగ ప్రకటనలను ప్రభుత్వం విడుదల చేయకపోతుండడంతో తమను తెరాస మోసం చేసిందని రగిలిపోతున్నారు.
ఉద్యోగ ప్రకటనలు లేకపోవడంతో దాన్ని కాష్ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ సైతం ప్రభుత్వం పై తూటాలు పేలుస్తూ వారినే ఒడిసి పట్టాలని చూస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తుంటే తెరాస కాలి కింద భూమి జారిపోతుంది.
బీజేపీ కి పడుతున్న ఓట్లలో అత్యధిక శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రమే. వీరిలో అత్యధికులు బీజేపీ అధికారంలోకి రావాలని వేసినవారు కాదు. కేసీఆర్ ఒంటెద్దు పోకళ్లకు ఒక చురక అంటించాలని చూసినవారే.
ఈ పరిస్థితిని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెరాస కోర్స్ కరెక్షన్ చేసుకుంటే లాభపడుతుంది. లేదంటే రానున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఓటమి చెందితే అది పార్టీకి మంచి సంకేతం కాదు. ఇక ఆ తదుపరి నాగార్జున సాగర్ ఉపఎన్నిక నాటికి బీజేపీ తెరాస కు కొరకరాని కొయ్యగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉద్యోగులను, నిరుద్యోగులను గనుక తెరాస ఆకట్టుకోగలిగితేనే వారికి లాభం. లేకుంటే పార్టీకి అపార నష్టం తప్పకపోవచ్చు.