ఈటెల నర్మగర్భ వ్యాఖ్యల వెనక...: సీఎంగా కేటీఆర్ ప్రమోషన్ ఎజెండా

By telugu teamFirst Published Feb 6, 2021, 8:48 AM IST
Highlights

మంత్రి ఈటెల రాజేందర్ నర్మగర్భ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ ను సీఎంగా ప్రమోట్ చేయాలనే నిర్ణయం జరగడం వల్లనే ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్: రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు మాత్రమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులతో పాటు పలువురిని ఆహ్వానించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండు ఊపందుకుంటున్న తరుణంలో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కొద్ది రోజులుగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతు వేదికల ప్రారంభ కార్యక్రమాల్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పట్ల విధేయత ప్రకటిస్తూనే కొంత అసంతృప్తి రాగం వినిపిస్తున్నట్లు ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. 

గతంలో ఈటెల రాజేందర్ తాము టీఆర్ఎస్ ఓనర్లమని ప్రకటించి దుమారం రేపారు. ఈసారి కాస్తా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా తాను ఉన్నా లేకున్నా రైతులకు అండగా ఉంటామని చెప్పారు. తనకు అమ్మనో నాయననో పదవి ఇవ్వలేదని, రైతుల వల్లనే తాను మంత్రిని అయ్యానని ఆయన చెప్పారు. ఈ మాటలు ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారా సందేహం వ్యక్తమవుతోంది. 

ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే కేటీఆర్ ప్రమోషన్ కు నిర్ణయం జరిగినట్లు అర్థమవుతోందని అంటున్నారు. అందువల్ల రేపు ఆదివారం జరిగే కార్యవర్గ సమావేశానికి ప్రాధాన్యం చేకూరిందని అంటున్నారు. పలు సంస్థాగత వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవడంతో పాటు కొన్ని విషయాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని అంటున్నారు. బిజెపి పట్ల తన వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పార్టీ వార్షిక ఉత్సవాల గురించి, సభ్యత్వ నమోదు గురించి చర్చిస్తారు. ఇదే సమయంలో కేటీఆర్ ను ప్రమోట్ చేసే విషయంపై కూడా కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని అంటున్నారు. 

నిజానికి, రెండోసారి టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత మంత్రివర్గంలోకి కేటీఆర్ కు అనుకూలంగా ఉండేవారినే కేసీఆర్ తీసుకున్నారనే విశ్లేషణ సాగింది. ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టాలని కూడా అనుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే, అప్పటి పరిణామాల నేపథ్యంలో ఈటెలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 

తొలుత కేటీఆర్ ను, హరీష్ రావును కూడా మంత్రి పదవులకు దూరంగా ఉంచారు. లోకసభ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతో వారిద్దరిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే, ఇటీవలి పరిణామాలు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అనివార్యతకు దారి తీశాయని అంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కొంత మంది బహిరంగంగానే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అది కేసీఆర్ కు కూడా తప్పని పరిస్థితిని కల్పించినట్లు చెబుతున్నారు. అయితే, కేసీఆర్ ఆంతర్యం ఏమిటనేది స్పష్టంగా తెలియడం లేదు.

click me!