కర్ణాటక మోడల్‌తో తెలంగాణ‌లో కాంగ్రెస్... అదే ప్రణాళిక..!!

By Asianet NewsFirst Published Jul 4, 2023, 2:55 PM IST
Highlights

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ అధిష్టానం.. తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీ అధిష్టానం.. తెలంగాణలో కూడా అదే ఫార్ములాతో విజయం సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది. కర్ణాటకలో గత బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ఐదు ప్రధాన హామీలతో ప్రజలను  ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే తరహాలో ప్రజలను ఆకర్షించేలా పావులు కదుపుతుంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్‌, యూత్ డిక్లరేషన్‌లతో.. రైతులను, యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలతో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రాహుల్ వారికి పలు అంశాలపై కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీ నాయకులంతా కలిసి ముందుకు సాగాలని కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఏ అంశాలను తీసుకుని ముందుకు వెళ్లాలనేదానిపై చర్చించామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల కార్యచరణను కాంగ్రెస్ ప్రారంభించిందని అన్నారు. కర్ణాటకలో ఏ ఫార్ములాతో కాంగ్రెస్‌ విజయం సాధించిందో.. అలాంటి పదునైన కార్యచరణతో ముందుకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.  కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా భారీ  విజయం సాధించి.. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు. 

తాజాగా ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభ వేదికగా మరికొన్ని హామీలను కూడా ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన వర్గాలను కూడా ఆకర్షించేందుకు కాంగ్రెస్ అధిష్టాంనం ఇప్పటికే ప్రణాళికను కూడా సిద్దం చేసినట్టుగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించే నాటికి.. మొత్తం ఐదు ప్రధాన హామీలను సిద్దం చేసి.. వాటితో ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తున్నారు. 

మరొక అంశం ఏమిటంటే.. కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్దరామయ్యల మధ్య విభేదాల  ఉన్నప్పటికీ వారు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసి ముందుకు సాగారు. అధికారంలో వచ్చాక కూడా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ నేతల మధ్య విభేదాలను పక్కకు పెట్టాలని అధిష్టానం సూచించిన నేపథ్యంలో.. ఆ దిశలో కూడా నేతలు సన్నద్దమవుతున్నారు. తద్వారా కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా ఒకటిగా ముందుకు సాగడమే కాకుండా.. సంక్షేమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టగా స్పష్టం అవుతుంది. అంతేకాకుండా పార్టీ బలోపేతం కోసం.. పలువురు బలమైన నేతలను పార్టీలోకి తీసుకురావడానికి తెరవెనక ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంది. మరి కాంగ్రెస్ ప్రణాళికలు ఏ మేరకు విజయవంతం అవుతాయనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. 

click me!