దూకుడు పెంచిన నిమ్మగడ్డ రమేష్ కుమార్: జగన్ క్లోజ్ సర్కిల్ టార్గెట్

By telugu team  |  First Published Jan 29, 2021, 1:08 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ క్లోజ్ సర్కిల్ ను ఆయన టార్గెట్ చేశారు.


అమరావతి: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సహకరించడానికి ముందుకు వచ్చిన స్థితిలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు పెంచారు. ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడి డైరెక్షన్ లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఎస్ జగన్ క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన ఆ పని మీదనే ఉన్నారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సూచిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు తొలుత లేఖ రాశారు. ఎస్పీలు, కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో మాట్లాడకుండా ప్రవీణ్ ప్రకాశ్ మీద నిషేధం విధించాలని ఆయన ఆదేశించారు. 

Latest Videos

undefined

ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తప్పించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి మీద కూడా ఆయన గురి పెట్టారు. వారు లక్ష్మణ రేఖ దాటారని ఆయన అంటున్నారు. తనపై రాజకీయ దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. భారత అటార్నీ జనరల్ నుంచి సలహా తీసుకుని సజ్జల రామకృష్ణా రెడ్డిని పదవి నుంచి తప్పించాలని ఆయన గవర్నర్ ను కోరారు. 

వారిని తప్పించాలని ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు. అలా జరగకపోతే తాను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయిస్తానని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, విజయసాయి రెడ్డిలపై తాను కోర్టుకు వెళ్తానని కూడా ఆయన గవర్నర్ కు రాసిన లేఖలో చెప్పారు.

అది వరకే ఆయన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గిరిజా శంకర్, గోపాలకృష్ణ ద్వివేదిలను బదిలీ చేయాలని ఆయన సూచిస్తూ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. మార్చిలో తొమ్మిది మంది జిల్లా అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూడా గతంలో ఆయన కోరారు. 

మొత్తం మీద, సుప్రీంకోర్టు అందించిన అస్త్రంతో వైఎస్ జగన్ ను ఆయన లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. 

click me!