ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చేరికలపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన సినీ నటి వాణి విశ్వనాథ్ ను కలిశారు. తాజాగా ఆయన ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కార్యాచరణను రూపొందించారు. సినీ, రాజకీయ ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు, టీడీపీల నుంచి వలసలను ఆహ్వానిస్తూనే ఎటు వైపు లేని ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సోము వీర్రాజు ఇటీవల సినీ నటి వాణి విశ్వనాథ్ ను కలిసి ఆమెతో చర్చలు జరిపారు. వాణి విశ్వనాథ్ ను ఆయన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి కూడా ఆయన గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
రేపు శనివారం సోము వీర్రాజు ముద్రగడ పద్మనాభంతో భేటీ కానున్నారు. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం నివాసానికి వెళ్లి ఆయన మాట్లాడనున్నారు. అదే విధంగా కిమిడి కళా వెంకటరావు, పడాల అరుణలను కూడా వారి నివాసాల్లో సోము వీర్రాజు కలిసే అవకాశం ఉంది.
కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఆయన ఉద్యమాన్ని ఉధృతంగా సాగించారు. ఆ తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించడం మానేశారు. తటస్థంగా ఉన్న ముద్రగడను తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నాల్లో సోము వీర్రాజు ఉన్నట్లు అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన వారితో చర్చించే అవకాశం ఉంది. తాను బిజెపి అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి సోము వీర్రాజు చురుగ్గా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.