ట్రంప్ షాక్: హెచ్‌1 బీ వీసాపై పరిమితులు?.. ఎందుకంటే

By rajesh y  |  First Published Jun 21, 2019, 11:53 AM IST

ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు డేటా లోకలైజేషన్ చేయాలన్న భారత్ ఆదేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిగా హెచ్ 1 బీ వీసాల జారీపై 10-15 శాతం వరకూ కోత విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై తమకు అధికారిక సమాచారం అందలేదని విదేశాంగశాఖ తెలిపింది. హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించడం వల్ల అమెరికాకే నష్టమని నాస్కామ్ హెచ్చరించింది. 


న్యూఢిల్లీ: ఇప్పటివరకు అమెరికా, చైనా మధ్య సాగిన వాణిజ్య యుద్ధం ప్రభావం ఎలా ఉందో కనిపిస్తూనే ఉంది. తాజాగా భారత్‌, అమెరికాల మధ్య కూడా కొంత సంఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. భారత్‌లోని అమెరికా కంపెనీలు (చెల్లింపుల సంస్థలు) ఈ దేశంలోనే డేటాను (లోకలైజేషన్) నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో అమెరికా అందుకు ప్రతి స్పందించింది. 

హెచ్‌1-బీ వీసాలపై పరిమితి విధించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. డేటా స్థానికీకరణ (లోకలైజేషన్) చేయాలని కోరిన అన్ని దేశాల పైనా హెచ్‌1-బీ అస్త్రం ప్రయోగించాలనుకుంటోంది. హెచ్‌1-బీ వీసాల పరిమితి విధిస్తూ అమెరికా నుంచి ఎటువంటి సమాచారం ఇంకా అందలేదని భారత విదేశాంగ శాఖ గురువారం స్పష్టం చేసింది.

Latest Videos

undefined

దేశంలోని చెల్లింపుల కంపెనీలన్నీ ఇక్కడే తమ వినియోగదార్ల సమాచారం (డేటా లోకలైజేషన్) చేయాలని గతేడాది భారత్‌ తప్పనిసరి చేసింది. అందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని కొన్ని అమెరికా కంపెనీలు ఆ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. 

దీంతో అమెరికా మన భారతీయ ఐటీ నిపుణులు ఆ దేశంలో పని చేయడానికి వీలు కల్పించే హెచ్‌ 1 - బీ వీసాలపై పరిమితులు విధించే అవకాశం కనిపిస్తోంది. ‘అధికారికంగా అమెరికా ప్రభుత్వం నుంచి వీసా పరిమితులపై ఎటువంటి సమాచారం అందలేదు. మేం ఈ విషయంలో అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

వాణిజ్య మంత్రిత్వ శాఖలోని వర్గాలు సైతం వీసా పరిమితులపై ఎటువంటి సమాచారం అందలేదని తెలిపాయి. ‘ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ చూస్తే నియామకాలు చేపట్టిన ఉద్యోగాల సంఖ్య అమెరికాలో 75 లక్షలకు పైగా ఉంది. ఇందులో 67 శాతం వరకు ఉద్యోగాలకు ప్రత్యేక టెక్నాలజికల్ స్కిల్స్ ఉండాలి. ఈ ఖాళీలు భర్తీ కావాలంటే భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులను హెచ్‌1-బీ వీసాల ద్వారా అమెరికా ఆహ్వానం పలకాల్సిందే’నని నాస్కామ్‌ అభిప్రాయపడింది. 

‘2016-17లో అనుమతించిన అన్ని హెచ్‌-1బీ వీసాల్లో ఎక్కువ భాగం భారతీయులదే. మన నైపుణ్యాలకు ఎంత ప్రాధాన్యం ఉందో ఇదే చెబుతోంది. ఇందులో కొంత వాటానే భారతీయు కంపెనీలు నియమించుకుంటున్నాయి. మిగతా అంతా అంతర్జాతీయ, అమెరికా కంపెనీలు ప్రాయోజితం చేస్తున్నవేన’ని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా వీసాలపై పరిమితి విధిస్తే అమెరికా కంపెనీల వ్యాపారాలపైనే ప్రభావం పడుతుందని నాస్కామ్‌ హెచ్చరించింది.

గతేడాది ఏప్రిల్‌ నెలలో ఆర్‌బీఐ ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ‘చెల్లింపుల వ్యవస్థలకు సంబంధించిన మొత్తం సమాచారం’ భారత్‌లో ఏర్పాటు చేసిన సర్వర్లలోనే ఆరు నెలలలోగా నిల్వ చేయాలి. విదేశాల్లో ఎటువంటి డేటా ఉండరాదన్నది ఆ సర్క్యులర్‌ సారాంశం. 

అంతర్జాతీయ దిగ్గజాలు సాధారణంగా తమ వినియోగదార్ల డేటాను అంతర్జాతీయ సర్వర్లలో నిల్వ చేస్తుంటాయి. ఇపుడు భారత్‌లో స్థానికంగా సర్వర్లను ఏర్పాటు చేయాలంటే అవి అదనపు పెట్టుబడులు పెట్టాలి.

స్థానికంగా డేటా ఉండే పర్యవేక్షణ సులువవుతుందని.. ఏదైనా దర్యాప్తు చేపట్టాల్సి వస్తే సులువుగా ఉంటుందన్నది భారత్‌ అభిప్రాయం. అమెరికా ఐటీ, ఇ-కామర్స్‌ సంస్థలు సైతం ఇ-కామర్స్‌ ముసాయిదా విధానాల్లోని కొన్ని నిబంధనలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

ఒక వేళ వీసా పరిమితులను అమెరికా విధిస్తే మాత్రం 150 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఐటీ రంగంపై గట్టి ప్రభావమే పడుతుంది. ఉత్తర అమెరికా మార్కెట్‌ నుంచే మన ఐటీ కంపెనీలకు ఎక్కువ భాగం ఆదాయం లభిస్తున్న సంగతి తెలిసిందే. 

అమెరికాలోని తమ క్లయింట్లు ఉన్న ప్రాంతాలకు భారతీయ ఐటీ కంపెనీలు ఈ వీసాల ద్వారానే తమ ఉద్యోగులను పంపుతాయి. అయితే ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత ఐటీ కంపెనీలు అమెరికాలోనే స్థానికంగా నియమాకాలను పెంచడం మొదలుపెట్టాయి. 
మరో పక్క, ప్రస్తుతం దేశలవారీగా హెచ్‌1-బీ వీసాల పరిమితులు లేవు. ప్రతీ ఏటా 85,000 హెచ్‌1-బీ వీసాలు జారీ అయితే అందులో 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. అమెరికా మంత్రి మైక్‌ పాంపియో భారత్ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో వీసాల పరిమితిపై సంఘర్షణ జరుగుతుండడం గమనార్హం. 

టెక్నాలజీ నిపుణులకు ఇచ్చే వీసాలకు సంబంధించి, దేశాల వారీగా పరిమితులు విధిస్తే, అమెరికా కంపెనీలు బలహీన పడతాయని, ఆయా నిపుణుల లభ్యత కొరవడి ఉద్యోగాల భర్తీ కష్టమవుతుందని దేశ ఐటీ పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీస్ (నాస్కామ్‌) పేర్కొంది. 

2017లో హెచ్‌- 1బీ వీసాల్లో అత్యధికం భారతీయులకే దక్కాయంటే, వారి నైపుణ్యమే కారణమని నాస్కామ్‌ పేర్కొంది. ఆయా వీసాలను అధికంగా బహుళజాతి కంపెనీలు, అమెరికా కేంద్రంగా పనిచేసే దిగ్గజ కంపెనీలు స్పాన్సర్‌ చేస్తున్నవేనని గుర్తు చేసింది. భారతీయులకు దేశీయ ఐటీ సంస్థలు ఇచ్చిన వీసాల సంఖ్య స్వల్పమేనని స్పష్టం చేసింది. 

‘స్థానికంగానే డేటా నిల్వ చేయాలంటూ విదేశీ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్న దేశాలకు, హెచ్‌-1బీ వీసాల్లో 10-15 శాతమే జారీ చేయాలనే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది’ అంటూ వచ్చిన వార్తలపై నాస్కామ్‌ పై విధంగా స్పందించింది. అమెరికా ప్రభుత్వం నుంచి ఈ విషయమై ఏరకమైన అధికారిక ప్రకటన రాలేదని, అందువల్ల స్పష్టత కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. 

‘అధునాతన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకునే ప్రక్రియను అమెరికా వీసా విధానం కనుక సంక్లిష్టం చేస్తే, దీనివల్ల నష్టం జరిగేది అమెరికా కంపెనీలకే. తమకు అవసరమైన అత్యున్నత నిపుణులనే ఆ సంస్థలు నియమించుకుంటున్నాయి. సంబంధిత నిపుణులు లభించకపోతే, ఆ ఉద్యోగాల భర్తీయే ప్రమాదంలో పడుతుంది. ఫలితంగా సాంకేతిక సేవలే విదేశాలకు తరలించాల్సిన పరిస్థితి అమెరికా కంపెనీలకు ఏర్పడుతుంది’ అని నాస్కామ్‌ పేర్కొన్నది.

‘విదేశాల నుంచి వలస వస్తున్న, హెచ్‌-1బీ వీసాలపై వస్తున్న సాంకేతిక నిపుణుల వల్లే, అంతర్జాతీయ టెక్నాలజీ లీడర్‌గా అమెరికా ఎదిగింది. ఇందువల్లే మరింతమంది నిపుణులను ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించ గలిగింది’ అని నాస్కామ్‌ తెలిపింది. ఇప్పుడు దేశాల వారీగా ఆంక్షలు అంటే, వ్యాపార సంస్థలకు నిపుణుల లభ్యత ఉండదని వివరించింది.

దేశీయ ఐటీ రంగం విలువ దాదాపు 150 బిలియన్‌ డాలర్లు (రూ.10.50 లక్షల కోట్లు) ఉంటుంది. అమెరికాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేకపోవడానికి 67 శాతం ప్రత్యేక టెక్నాలజీ వసతులు లేకపోవడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి.

click me!