అబ్బే వట్టిదే.. హెచ్1 బీ వీసాల పరిమితిపై అమెరికా విదేశాంగశాఖ

By rajesh y  |  First Published Jun 22, 2019, 10:53 AM IST

హెచ్1 బీ వీసాలు జారీ చేసే విషయమై పరిమితులు విధించినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులేనని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వర్కర్‌ వీసా కార్యక్రమం యధాతథంగా కొనసాగుతుందని వివరించింది. 
 


వాషింగ్టన్‌:‘డేటా లోకలైజేషన్ కోసం విదేశీ కంపెనీలపై ఒత్తిడి తెస్తున్న దేశాలకు, హెచ్‌-1బీ వీసాల్లో 10-15 శాతమే జారీచేయాలనే ప్రతిపాదనను అమెరికా పరిశీలిస్తోంది’ అన్నది వదంతేనని స్పష్టమైంది. డేటా నిల్వపై సంప్రదింపులకు, వీసా పరిమితి ప్రణాళికలకు సంబంధం లేదని అమెరికా విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. 

ప్రస్తుత ప్రచారానికి, ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్న వర్కర్‌ వీసా కార్యక్రమానికి సంబంధం లేదని పేర్కొన్నారు. విదేశీ సైద్ధాంతిక, సాంకేతిక నిపుణుల నియామకానికి అమెరికా కంపెనీలకు హెచ్‌-1బీ వీసా వీలు కల్పిస్తుంది. వలసేతర వీసాగా వీటిని వ్యవహరిస్తుంటారు. 

Latest Videos

undefined

అమెరికన్లకే ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా అమెరికాకు అత్యుత్తమ నిపుణులను మాత్రమే ఆహ్వానించేలా వర్కర్‌ వీసా పథకాన్ని రూపొందించిందని, ఇందులో హెచ్‌-1బీ కూడా భాగమే అవుతుందని సదరు అధికారి తెలిపారు. 

‘ఈ పథకం కింద ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకోవడం లేదు. దీనికి, డేటా స్థానికంగా నిల్వ ఉంచాలని ఒత్తిడి తెస్తున్న భారత్‌తో సంప్రదింపులకు సంబంధం లేదు. డేటా నిల్వకు సరిహద్దులు ఉండరాదనేలా చర్చిస్తున్నాం’ అని వివరించారు.

అంతర్జాతీయ కంపెనీలు డేటాను తమకు అనువైన దేశంలోని గ్లోబల్‌ సర్వర్లలో నిల్వ ఉంచుతాయి. మన దేశం కోరుతున్నట్లు స్థానికంగానే డేటా నిల్వ చేయాలంటే, అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. డేటా స్థానికంగా నిల్వ ఉంటే పర్యవేక్షణ సులభం కావడంతో పాటు ఏదైనా అంశంలో విచారణకూ వీలవుతుందన్నది మన ప్రభుత్వ ఆలోచన.

ప్రస్తుత చట్టాల ప్రకారం ప్రభుత్వం భారత్‌కు వీసాలు పరిమితం చేయలేదని ఇమిగ్రేషన్‌ అటార్నీ సైరస్‌ మెహత్తా పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసాలపై దేశాల వారీ పరిమితులు విధించాలంటే, అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందాలి. వేర్వేరు పార్టీలకు ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో, ఈ సవరణకు రెండు చట్ట సభల్లో ఆమోదం పొందడం కష్టమేనని విశ్లేషించారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ తన కార్యనిర్వాహక అధికారాలు వినియోగించి, ఇలాంటి సవరణ విధానాన్ని జారీ చేసే వీలుందని క్లాస్కో ఇమిగ్రేషన్‌ లా పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపక సభ్యులు విలియం స్టాక్‌ పేర్కొన్నారు.

అమెరికన్లకే ఉద్యోగావకాశాలు కల్పించేలా రెండేళ్ల క్రితం ‘బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌’ విధానానికి ట్రంప్‌ ఆమోదం తెలిపారు. అమెరికన్లకు అధిక అవకాశాలు, వేతనాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అమెరికా వలస విధానాలను మరింత కట్టుదిట్టం చేసే నిబంధనలూ పొందుపరచారు. దీని కిందే హెచ్‌-1బీ వీసాలను కూడా అత్యున్నత నిపుణులకే ఇచ్చేలా, అధిక వేతనం పొందేవారికి మాత్రమే జారీచేసేలా గైడ్ లైన్స్ రూపొందించాలని హోంశాఖకు సూచించింది.

click me!