అమెరికా విద్య.. భారతీయ విద్యార్ధులకు శుభవార్త, ఏడాది ముందే స్టూడెంట్ వీసా తీసుకోవచ్చు

By Siva KodatiFirst Published Feb 25, 2023, 4:28 PM IST
Highlights

అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్ధులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. కోర్స్ మొదలవ్వడానికి ఏడాది ముందే యూఎస్ వీసా పొందే అవకాశం కల్పించనుంది. 

అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీసా సాధించడం ఇప్పుడు తలకు మించిన భారంగా మారుతోంది. అటు అగ్రరాజ్యం సైతం కోటా ప్రకారం అన్ని దేశాలకు స్టూడెంట్ వీసాలను ఇస్తూ వస్తోంది. ఇది భారత్ వంటి పెద్ద దేశాలకు ఏ మూలకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులకు అమెరికా శుభవార్త చెప్పింది. కోర్స్ మొదలవ్వడానికి ఏడాది ముందే యూఎస్ వీసా పొందే అవకాశం కల్పించనుంది. 

ఇప్పటికే స్టూడెంట్ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికా నిర్ణయం ఊరట కలిగించింది. యూఎస్ బ్యూరో ఆఫ్ కన్సూలర్ అఫైర్స్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఎఫ్, ఎం కేటగిరీల్లో విద్యార్ధులకు ఇచ్చే వీసాలను 365 రోజుల ముందే జారీ చేసేలా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఐ 20 ప్రోగ్రామ్‌లో భాగంగా ఎఫ్, ఎం స్టూడెంట్ వీసాలను 365 రోజుల ముందే జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఏడాది ముందే వీసా వచ్చినప్పటికీ.. కోర్సు మొదలుకాకముందే అమెరికా వెళ్లేందుకు అనుమతించరు. వర్సిటీలలో అడ్మిషన్ దొరికిన విద్యార్ధులు వీసా ఇంటర్వ్యూలను మూడు నెలలు (120 రోజులు) ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చని అమెరికా తెలిపింది. 

ALso REad: భారత యువతకు గుడ్ న్యూస్ .. యూకే వీసా కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఎలా ఆప్లై చేసుకోవాలంటే..?

కాగా.. యూఎస్ స్టూడెంట్ వీసా కోసం సాధారణంగా వెయిటింగ్ పీరియడ్ 300 రోజుల వరకు వుంటోంది. సమస్య తీవ్రత దృష్ట్యా ఇరుదేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసా నిబంధనలను సులభతరం చేస్తూ అగ్రరాజ్యం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్థాయిలో భారత విద్యార్ధుల నుంచి వీసాలు వచ్చే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. 

click me!