హెచ్ 1 బీ వీసా జారీ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వైఖరి వల్ల చిన్న భారతీయ ఐటీ సంస్థల్లో కలవరం మొదలైంది. కొద్ది మందికి వీసా రాకపోవడంతో చాలా మంది ప్రతిభావంతులైన నిపుణులంతా అమెరికాను వీడుతున్నారని సదరు ఐటీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరితో అమెరికాలోని చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని ఐటీ సర్వ్ అలయన్స్ ప్రెసిడెంట్ గోపి కందుకూరి అన్నారు. అమెరికాలోని చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు చెందిన అతిపెద్ద అసోసియేషన్ 2010లో ఏర్పాటైన ఐటీ సర్వ్ అలయన్స్.
దీంట్లో 1,000కి పైగా కంపెనీలు సభ్య సంస్థలుగా ఉన్నాయి. అందులో చాలా వరకు భారతీయ అమెరికన్లవే. హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారిపై ట్రంప్ ప్రభుత్వ విధానాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కందుకూరి అన్నారు.
undefined
ప్రస్తుతం హెచ్1బీ వీసాల నిరాకరణ రేటు 40 శాతం దాటిందని, ఫలితంగా చాలామంది దాదాపుగా ప్రతిభావంతులైన ఐటీ నిపుణులు అందరూ అమెరికా నుంచి వలసపోతున్నారని, ఇది చిన్న ఐటీ కంపెనీలకు చాలా పెద్ద సమస్యగా మరిందన్నారు.
2010 నుంచి హెచ్1బీ వీసాలను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చే ప్రయత్నం జరుగుతోందని ఐటీ సర్వ్ అలయన్స్ సలహాదారు కిశోర్ కందవల్లి అన్నారు. ముఖ్యంగా హెచ్1బీలను ప్రాసెస్ చేయడంతోపాటు తమ వద్ద లేదా క్లయింట్ వద్దే ప్రాజెక్టు పూర్తిచేయించే తమ అసోసియేషన్ కంపెనీల పాలిట ట్రంప్ ప్రభుత్వ విధానాలు శరాఘాతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
హెచ్1బీ వీసాల విషయంలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలకు బదులు సొంత నిబంధనలను ఏర్పాటు చేస్తోందని, చట్టాల్లో లేని విధానాలను అవలంభిస్తోందని ఐటీ సర్వ్ అలయన్స్ సలహాదారు కిశోర్ కందవల్లి ఆరోపించారు. మెమోలు లేదా వెబ్‌సైట్‌లో సవరణల ద్వారా నియమావళిని ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని అన్నారు.
కొన్ని నిబంధనల మార్పులపై ఐటీ సర్వ్ అలయన్స్ ఇప్పటికే అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హెచ్1బీ వీసాలను మూడేళ్ల కాలానికి జారీ చేయాలి. కానీ యూఎస్‌సీఐఎస్ వీసా కాలపరిమితిని తగ్గించివేస్తోందని కందవల్లి తెలిపారు. అమెరికా కార్మిక శాఖ మూడేళ్ల కాలానికి వీసా ఇచ్చేందుకు అనుమతి ఇస్తుంది. యూఎస్‌సీఐఎస్ అంతేకాలానికి వీసా జారీ చేయాలి.
అయితే ట్రంప్ విధానాలలో కొన్నింటిని ఐటీ సర్వ్ అలయెన్స్ ఇప్పటికే మార్చేందుకు న్యాయ పోరాటంలో విజయం సాధించింది. స్టెమ్ ఆప్ట్ కింద మూడో పార్టీ లొకేషన్ పరిధిలో ఎక్కువ కాలం నివాసం ఉండరాదన్న నిబంధనను ఎత్తివేయించడంలో సక్సెస్ అయింది.
కానీ దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్న చందంగా అమెరికా కార్మికశాఖ మూడేళ్ల హెచ్1 బీ వీసాకు అనుమతిని ఇచ్చినా యూఎస్సీఐఎస్ కొన్ని సందర్భాల్లో ఆ వీసా గడువులో కొన్ని రోజులు తగ్గించడం సంప్రదాయంగా మారింది.
ఉదాహరణకు అక్టోబర్ 31 వరకు కార్మికశాఖ అనుమతినిచ్చినా యూఎస్సీఐఎస్ 21 వరకు మాత్రమే వీసా జారీ చేయడం వంటి ట్రిక్కులు ప్రదర్శిస్తున్నదన్న విమర్శ ఉంది. భారత్ నుంచి అత్యధికులైన ఐటీ నిపుణులను తీసుకోవాలన్నది ఐటీ సర్వ్ అలయెన్స్ డిమాండ్. ఐటీ కంపెనీల్లో పని చేసే విదేశీ ఉద్యోగుల వేతనాలను 6000 నుంచి 8000 అమెరికా డాలర్లకు పెంచాలన్నదే ట్రంప్ నిర్ణయం. దీనివల్లే అమెరికన్లకు విద్యా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ట్రంప్ అంచనా.