హెచ్-1 బీ వీసాల్లో ది బెస్ట్ టీసీఎస్: యర్నెస్ట్& యంగ్ ఫస్ట్

By sivanagaprasad kodatiFirst Published Oct 24, 2018, 9:48 AM IST
Highlights

అంతర్జాతీయంగా, జాతీయంగా ఐటీ మేజర్ టీసీఎస్ పేరు మరోసారి మార్మోగుతోంది. అమెరికాలో అత్యధికంగా.. హెచ్1 బీ వీసాల కోసం ధ్రువీకరణ పత్రాలు పొందిన సంస్థల్లో టీసీఎస్ మాత్రమే టాప్ టెన్‌లో నిలిచింది. అంతర్జాతీయంగా మాత్రం లండన్ కేంద్రంగా పని చేస్తున్న యర్నెస్ట్ అండ్ యంగ్ టాప్ వన్ స్థానాన్ని దక్కించుకున్నది.

ఇప్పటి వరకు జాతీయంగా, అంతర్జాతీయంగా మెరుగైన ఐటీ సేవలకు పెట్టింది పేరు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌). ఆ సంస్థ తాజాగా మరో ఘనతను సాధించింది. అమెరికాలో 2018 ఆర్థిక ఏడాదిలో హెచ్‌-1బీ వీసాల కోసం ఎక్కువ విదేశీ కార్మిక ధ్రువీకరణ పత్రాలు (ఫారిన్ లేబర్‌ సర్టిఫికెట్‌) పొందిన అగ్రశ్రేణి తొలి 10 సంస్థల్లో నిలిచింది.

ఇరవై వేలకు పైగా పత్రాలతో భారత్‌ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక్క సంస్థ టీసీఎస్‌ కావడం గమనార్హం. భారత్‌ నుంచి ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు హెచ్‌-1బి వీసాల కోసం దరఖాస్తు చేశారని అమెరికా కార్మిక శాఖ తెలిపింది.

అమెరికాలో కొన్ని ప్రత్యేక ఉద్యోగాలు, ఫ్యాషన్‌ మోడళ్లు, అత్యుత్తమ నైపుణ్యాలు, తెలివితేటలు గల విదేశీయులను సంస్థలు తాత్కాలికంగా వలసయేతర పద్ధతిలో నియమించుకొనేందుకు ఈ ధ్రువీకరణ విధానం ఉపయోగపడుతుంది.

ఈ క్రమంలో కంపెనీలు నిపుణుల నియామకానికి విదేశీ కార్మిక ధ్రువీకరణ పత్రాలు పొందుతాయి. అలా ఎక్కువ పత్రాలు పొందిన టాప్-10 సంస్థల్లో 20,755 పత్రాలు పొందిన సంస్థగా టీసీఎస్‌ నిలిచింది.

ఇక లండన్‌ కేంద్రంగా సేవలందించే ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ 1,51,164 హెచ్‌-1బీ ప్రత్యేక నైపుణ్య కార్మిక ధ్రువపత్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం ధ్రువపత్రాల్లో ఇది 12.4 శాతం కావడం గమనార్హం.

కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ (47,732), హెచ్‌సీఎల్‌ అమెరికా (42, 820), కే ఫోర్స్‌ ఇంక్‌ (32, 996), ఆపిల్‌ (26, 833), టీసీఎస్‌ (20,755), క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ (20,723), ఎంఫసిస్‌ కార్పొరేషన్‌ (16,671), క్యాప్‌జెమిని అమెరికా (13,517) టాప్‌-10లో వరుసగా నిలిచాయి.

ఈ ఆర్థిక ఏడాది 6,54,360 దరఖాస్తులను స్వీకరించగా 5,99,782ను ధ్రువీకరించినట్లు అమెరికా కార్మికశాఖ తెలిపింది. మరో 8,627 దరఖాస్తులను తిరస్కరించి, 45,951 దరఖాస్తులను ఉపసంహరించినట్లు వివరించింది.

మొత్తం 12,66,614 పోస్టులకు అనుమతి కోరగా 12,23,053 పోస్టులను అమెరికా కార్మికశాఖ అధికారులు ధ్రువీకరించారు. వీటిలో ఎక్కువ ఉద్యోగాలు 2,85,963 సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌వే కావడం గమనార్హం. 

కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌ (1,76,025), కంప్యూటర్‌ సంబంధిత ఉద్యోగాలు (1,20,736), సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ (67,262), అకౌంటెంట్లు, ఆడిటర్లు (5,42,41), కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌ (53,727) తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.

హెచ్-1బీ  కార్మిక ధ్రువీకరణలో రాష్ట్రాల వారీగా చూస్తే కాలిఫోర్నియా (3,09, 205) అగ్రస్థానంలో ఉంది. టెక్సాస్‌ (1,15,484), న్యూయార్క్‌ (95,722), న్యూజెర్సీ (65,232), ఇల్లినాయిస్‌ (56,196), వాషింగ్టన్‌ (52,522), పెన్సిల్వేనియా (51,471) తర్వాతీ స్థానాల్లో ఉన్నాయి.
 

click me!