
వాషింగ్టన్: తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ విజయం సాధించింది. నిరంజన్ కు 10,866 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్ధి నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. నిరంజన్ తో పాటు ఆయన ప్యానెల్ తొలి నుండి ఆధిక్యాన్ని కనబర్చారు. సియోటెల్ లో పోలీస్ బందోబస్తు మధ్య ఓట్లను లెక్కించారు. ప్రన్తుత అధ్యక్షుడిగా ఉన్న జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు శృంగవరపు నిరంజన్ కు మద్దతు తెలిపారు. దీంతో ఆయన విజయం సునాయాసమైందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. నరేన్ కొడాలికి తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, సతీష్ వేమనలు మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ అమెరికాలోని మిచిగాన్ లో చాలా కాలంగా ఉంటున్నాడు. ఈ ఓట్ల లెక్కింపు ఆదివారం నాడు ఉదయానికి పూర్తైంది. అమెరికాలో తానా, ఆటా సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. వీటి పదవుల కోసం పెద్ద పోటీ ఉంటుంది. తానా ఎన్నికల తంతు సాధారణ ఎన్నికలను తలపించేలా రెండు ప్యానెల్ సభ్యులు ప్రచారం నిర్వహించారు.