కెనడాలో ప్రమాదవశాత్తు భవనం 27వ అంతస్తు నుంచి జారిపడి హైదరాబాదుకు చెందిన యువకుడు మరణించాడు. పాణ్యం అఖిల్ అనే యువకుడు ఈ నెల 8వ తేదీన ప్రమాదవశాత్తు మరణించాడు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని వనస్థలిపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలోని టొరంటోలో మరణించాడు. బహుళ అంతస్థుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అతను మరణించాడు. కుటుంబ సభ్యులు ఇందుకు సంబంధించిన వివరాలను చెప్పారు.
వనస్థలిపురంలోని ఫేజ్-4లో ఉంటున్న శ్రీకాంత్ చిన్న కుమారుడు పాణ్యం అఖిల్ (19) కెనడాలోని టొరంటోలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నాడు. తొలి సెమిస్టర్ పూర్తి చేసుకుని మార్చి 20వ తేదీన హైదరాబాద్ వచ్చాడు. గత 5వ తేదీన అతను తిరిగి కెనడా వెళఅలాడు.
ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున తాను ఉంటున్న భవనంలోని 27వ అంతస్తు బాల్కనీలో నించుని ఫోన్ లో మాట్లాడుతుండగా కింద పడి మరణించాడు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
తన కుమారుడి మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకుని రావాలని వారు కేటీఆర్ ను కోరారు. ఈ మేరకు వారు కేటీఆర్ కు ట్వీట్ చేశారు. దాంతో మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకుని వచ్చేందుకు సాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అందుకు కేటీఆర్ భారత రాయబార కార్యాలయంతో మాట్లాడురు.