అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం మనోళ్లకు కష్టాలు పెంచుతోంది. ఇంతకుముందు ప్రతిభా ఆధారంగా హెచ్1 బీ వీసా నిబంధనలు కఠినతరం చేస్తే.. తాజాగా జీవిత భాగస్వాములకు జారీ చేసే హెచ్ 4 వీసాపై నిషేధం విధించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ చర్యలు అమలులోకి రావడానికి ఏడాది పట్టినా.. 1.2 లక్షల మంది భారతీయ మహిళలకు కష్టాలు తప్పకపోవచ్చు. మున్ముందు అమెరికాలో ఉద్యోగం అంటేనే తిరస్కరించే పరిస్థితి తలెత్తొచ్చు.
వాషింగ్టన్: ఉద్యోగార్థులకు వీసా విధానాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న పని చేసేస్తున్నారు. తద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు.
తాజాగా హెచ్-1బీ వీసా కల వారి జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త), 21 ఏళ్ల లోపు పిల్లలు ఉద్యోగం చేసుకునే అవకాశంపై నిషేధం విధించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హెచ్-1బీ వీసాల జారీలో నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే.
undefined
తాజాగా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిపై నిషేధం విధించే ప్రక్రియ ప్రారంభించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు పని అనుమతిని తొలగించేలా ట్రంప్ సర్కార్ గతంలో ప్రతిపాదనలు రూపొందించిన తెలిసిందే.
ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ ప్రతిపాదన రెండవ దశకు చేరుకుంది. ఇక్కడ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే.. వాటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురిస్తారని తెలిపింది. హెచ్4 వీసాలపై నిషేధం విధించే ప్రక్రియలో భాగంగా మే 22న అమెరికా ప్రభుత్వం ఒక నోటీసును కూడా జారీ చేసింది.
ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించిన తర్వాత జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ నిషేధిస్తూ రూపొందించిన కొత్త ప్రతిపాదనలపై 30-60 రోజుల వరకు ప్రజల అభిప్రాయాలు తెలిపేందుకు వీలు ఉంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది పడుతుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు.
కాగా.. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పని చేసేందుకు హెచ్-4 డిపెండెంట్ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తెచ్చింది.
ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీన్ని భారత సంతతి ప్రజాప్రతినిధులు, పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా ట్రంప్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు. అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతోంది.
2015 నుంచి హెచ్-4 వీసా కింద అమెరికాలో 1.2 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో 90శాతం మంది భారతీయులే. ముఖ్యంగా భారత మహిళలే. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్-1బీ వీసాదారుల కుటుంబాల్లో ఒకరే ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. దీంతో వీరు ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.
అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వ్యాఖ్యానించారు. దీని ద్వారా అమెరికాలో ఐటీ నిపుణుల కొరత ఏర్పడుతుందనీ, తద్వారా అమెరికా ఉద్యోగాలను తిరస‍్కరించే పరిస్థితి వస్తుందన్నారు.