ట్రంప్ ‘గ్రీన్ కార్డ్’ పాలసీతో ఇండియన్లకు మేలే

By telugu team  |  First Published May 19, 2019, 3:40 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘బిల్డ్ అమెరికా’ వీసా.. గ్రీన్ కార్డు జారీ చేసే విధానంతో భారతీయులకు మంచి అవకాశం లభించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గ్రీన్ కార్డు కోసం భారతీయులు రమారమీ తొమ్మిదేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటివరకు కుటుంబ సంబంధాలపై ఆధారపడి గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు.  


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెరపైకి తెచ్చిన కొత్త వలస విధానం.. భారతీయులకు భారీగా లబ్ధి చేకూర్చగలదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ యువతకు అమెరికా ఉద్యోగం అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ స్థిర నివాసానికీ మనవాళ్లు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. 

ప్రస్తుత వీసా విధానం, గ్రీన్‌కార్డు వ్యవస్థలో ఇప్పటికే అక్కడ ఉన్నవారి సంబంధీకులకే అధిక ప్రాధాన్యం లభిస్తున్నది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ కొత్త వీసా విధానం.. ప్రతిభ, నైపుణ్యాలకు పెద్దపీట వేస్తున్నదని పలువురు నిపుణులు అంటున్నారు. 

Latest Videos

undefined

ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రపంచంలోనే భారతీయుల ప్రతిభకు గొప్ప పేరున్నది. దీంతో నూతన పాలసీతో భారతీయులకు, ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు కలిసొస్తుందని చెబుతున్నారు. 

‘అమెరికాలో విదేశీ వలసవాదులు శాశ్వత పౌరసత్వం పొందడానికి ట్రంప్‌ కొత్త విధానం ఎంతో దోహదపడుతుంది. ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తూ ఈ పాలసీని ట్రంప్‌ ఆవిష్కరించారు. దీనివల్ల ఇతర అన్ని దేశాల కంటే కూడా భారతీయులకే ఎక్కువ లాభం’ అని ఈబీ5 బ్రిక్స్‌ వ్యవస్థాపకుడు వివేక్‌ టాండన్‌ అన్నారు.

స్వదేశీయతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ట్రంప్‌.. ప్రతిభకూ అంతే ప్రాముఖ్యతనిస్తానని కొత్త వలస విధానం ప్రతిపాదన ద్వారా స్పష్టం చేశారు. నైపుణ్యం ఉన్నవారిని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోదన్న ఆయన గత లోపభూయిష్ట విధానాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఈ క్రమంలోనే తాము తీసుకొస్తున్న కొత్త వలస విధానం.. అప్రయోజకులకు అగ్రతాంబూలం దక్కకుండా చేస్తుందని, ప్రతిభావంతులకే పట్టం కడుతుందని ట్రంప్ చెప్పారు. అమెరికాలో స్థిర నివాసానికి లైసెన్సునిచ్చే గ్రీన్‌ కార్డు కోసం ఇప్పుడు సంబంధాలపై ఆధార పడుతున్న వారే అధికులు. 

ఇప్పటి వరకు గ్రీన్‌ కార్డు ఉన్నవారిని జీవిత భాగస్వాములుగా చేసుకోవడంతో అమెరికా రెసిడెన్సీ ఛాన్స్‌ ఇట్టే వచ్చేస్తున్నది. దీంతో దేశంలో విదేశీయుల సంఖ్య పెరుగుతుండగా, వారివల్ల అక్కడి పౌరులకు ఉద్యోగాలూ దూరమవుతున్నాయని ట్రంప్‌ వాదన. 

ఈ క్రమంలోనే ప్రతిభ ఆధారిత వీసా విధానం, పాయింట్ల ప్రాతిపదికన దరఖాస్తుదారుల ఎంపికకు ట్రంప్‌ సర్కార్ సిద్ధమైంది. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ దేశాలు అమలు చేస్తున్న విధానాలనే అనుసరించడానికి డొనాల్డ్ ట్రంప్‌ ఆసక్తి చూపుతున్నారు.

అమెరికాకు వెళ్లాలంటే ప్రస్తుతం భారతీయులు సగటున కనీసం పదేండ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ట్రంప్‌ తాజా ప్రతిపాదన ‘బిల్డ్‌ అమెరికా’ వీసా కింద చాలామంది భారతీయులకు గ్రీన్‌ కార్డు పొందే అవకాశం వస్తున్నదని, కుటుంబ సంబంధాలు పోయి.. వయసు, ప్రతిభ, నైపుణ్యం రావడం వల్ల వివిధ రంగాల్లో టాలెంట్ ఉన్న యువతకు అమెరికా కల సాకారం సులభతరం కానుందని టాండన్‌ అభిప్రాయపడ్డారు. 

దీంతో ఇప్పటికే ఏండ్ల తరబడి గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న భారతీయులకు మాత్రం ఇది నిరాశను కలిగించవచ్చని వివేక్ టాండన్ పేర్కొన్నారు. కేవలం కుటుంబ నేపథ్యంతో అమెరికాలోకి అడుగు పెట్టాలనుకునే వారి కోటాను ప్రతిభావంతులు జిక్కించుకుంటుండటమే ఇందుకు కారణమన్నారు. 

తక్కువ వయసు ఉన్నవారికి పాయింట్లు ఎక్కువగా ఉండటంతో యువతకు లాభమంటున్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం తొమ్మిదేళ్ల వరకు భారతీయులు వేచి ఉండాల్సి వస్తున్నది. దీనివల్ల ముందుగా ప్రతిభావంతులకు చోటు లభిస్తుంది.

ట్రంప్‌ కొత్త వలస విధానాకి అమెరికా కాంగ్రెస్ ఆమోదం లభిస్తే.. దాదాపు 6 లక్షల భారతీయులకు ఎదురుదెబ్బని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సంబంధాలపై ఆధారపడి గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు 2,61,765 మంది ఉన్నారు. అలాగే ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారు 3,06,601 మంది ఉన్నారు. 

వీరంతా ఏండ్ల తరబడి క్యూలైన్‌లో ఉండగా, నూతన వలస విధానం అమల్లోకి వస్తే.. మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే ఇన్నాళ్ల ఓపిక వృథా అయినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. గ్రీన్‌ కార్డు ఆశావహుల పరిశీలననూ అమెరికా పెంచడంతో పోటీ తీవ్రతరమవుతుందని చెబుతున్నారు. 

సహజంగా అమెరికా వీసాల జారీపై ఎలాంటి మార్పులు జరిగినా ఆ ప్రభావం భారతీయులపై అధికంగా ఉంటుందని, ఆ దేశంలో ఎక్కువమంది ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. కాగా, హెచ్‌- 1బీ వర్కర్లకూ తాజా విధానం దెబ్బేనని, ఉన్నత విద్య, నైపుణ్యం గల వారికే ప్రాధాన్యత వల్ల మధ్య, దిగువస్థాయి ఉద్యోగులకు అమెరికా ప్రవేశం ఇక దాదాపు దూరమైనట్లేనని అభిప్రాయపడుతున్నారు.


 

click me!