ఆస్ట్రేలియా అధికారులు కక్ష కట్టారు.. తాగే నీళ్లలోనూ విషం కలిపారు... ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో ట్విస్ట్....

By SumaBala BukkaFirst Published Aug 28, 2023, 3:08 PM IST
Highlights

కర్నాటకలో ఆస్ట్రేలియన్ ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అధికారులు తన పిల్లలను స్వాధీనం చేసుకోవడమే కాదు.. తమ ఇంటికి సరఫరా అయ్యే నీటిలోనూ విషం కలిపారని సూసైడ్ నోట్ లో తెలిపింది. 

కర్ణాటక : కర్ణాటకలో ఓ ఆస్ట్రేలియన్ ఎన్నారై మృతి కలకలం రేపింది. ఆస్ట్రేలియా నుంచి కర్ణాటకకు వచ్చిన ఓ మహిళ మృతి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్నారై మహిళ ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్.. కర్ణాటకలోని బెలగావిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య వెనుక కారణం.. తన పిల్లల కస్టడీ ఆస్ట్రేలియా అధికారులకు  వెళ్ళిపోవడమేనని తెలుస్తోంది. దీంతో పిల్లల దూరమై తీవ్ర మనోవేదనకు గురైన ఆమె ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

ఆస్ట్రేలియా నుండి నేరుగా కర్నాటకలోని బెంగళూరుకు వచ్చిన ప్రియదర్శిని బస్సులో అక్కడి నుంచి బెళగావి వెళ్ళింది. బెలగావి నుంచి గోర్వాన కొల్ల గ్రామం సమీపంలో ఉన్న మలప్రభనది దగ్గరికి వెళ్లి… అందులోకి దూకి ప్రియదర్శిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఆమె ఓ సూసైడ్ నోట్ రాసింది.

హిందూ’ అనే మతం లేదు.. అది ఒక బూటకం - సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య

అందులో తన ఆత్మహత్యకు కారణం ఆస్ట్రేలియా అధికారులు అని..  వారితో పాటు ఇంకొంతమంది సిడ్నీ ప్రాంత వాసులు కూడా తన మృతికి కారణమని పేర్కొంది. వీరంతా గత కొంతకాలంగా తన కుటుంబాన్ని,  తనని తీవ్రంగా వేధిస్తున్నారని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… 

కర్నాటక నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి స్థిరపడిన ప్రియదర్శిని లింగరాజ్ పాటిల్ కు ఇద్దరు పిల్లలున్నారు. అందులో ఓ కుమారుడి పేరు అమర్త్య.  ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో స్థానికంగా ఉన్న  ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అమర్త్యకు చికిత్స అందిస్తున్న సమయంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ప్రియదర్శిని వెంటనే ఆస్పత్రి అధికారులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు.

దీంతో ఆమె అధికారుల నిర్లక్ష్యం మీద, ఆసుపత్రి పై ప్రియదర్శిని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి ప్రియదర్శినికి ఆస్ట్రేలియా అధికారులకు మధ్య వార్ మొదలయ్యింది. అది ఎక్కడివరకు దారి తీసిందంటే ప్రియదర్శిని తన పిల్లలిద్దరిని సరిగా చూసుకోవడం లేదంటూ ఆస్ట్రేలియా అధికారులు వారిని తమ కస్టడీలోకి తీసుకున్నారు.

దీంతో వివాదం సద్దుమనగకపోగా... మరింత ముదురుతుండడంతో ప్రియదర్శిని తాను ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని వదిలేసుకుంటానని తెలిపింది. స్వదేశానికి వెళ్ళిపోతానని తన పిల్లలకు అక్కడే చికిత్స చేయించుకుంటానని వేడుకుంది. దీనికి ఆస్ట్రేలియా అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మానసిక వేదనకు గురై ఆమె అనారోగ్యం బారినబడింది. 

ఈ నేపథ్యంలోనే ఇండియాకు తిరిగి వచ్చి, ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రియదర్శిని తన సూసైడ్ నోట్ లో.. నా పిల్లలు,  భర్త లింగరాజుల బతుకుతెరువు కోసం నా జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి. మా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. నా కుటుంబం బాగుకోసం నేను నా మరణాన్ని ఒప్పుకుంటున్నాను. ఆస్ట్రేలియా కమ్యూనిటీస్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్ 2021 నుండి ఈరోజు వరకు నా కుటుంబాన్ని నాశనం చేసింది.

దీంతోపాటు సిడ్నీలోని వెర్లీ స్ట్రీట్ నివాసితులు కూడా మమ్మల్ని తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. అలాగే ఒక పోలీస్ అధికారి కుటుంబం కూడా మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు’  అని  ఆ లెటర్ లో పేర్కొంది. చివరికి వేధింపులు ఎంతవరకు వెళ్లాయి అంటే తన ఇంటికి సరఫరా అయ్యే నీటిని కూడా విషపూరితంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ తీరుతో విసిగిపోయి… తన అనారోగ్య సమస్యలు తట్టుకోలేక.. ప్రియదర్శిని ఆత్మహత్య చేసుకుంది... అని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు పేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

click me!