టెక్సాస్ కాల్పుల ఘటన : ఆందోళన వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వ ప్రతినిధి.. ఈ సూచనలు పాటించాలని విజ్ఞప్తి...

By SumaBala Bukka  |  First Published May 8, 2023, 11:19 AM IST

టెక్సాక్ షాపింగ్ మాల్ ఘటనలో హైదరాబాదీ యువతి మరణించడం పట్ల అక్కడి ఏపీ ప్రభుత్వ ప్రతినిధి సంతాపం వ్యక్తం చేశారు. అక్కడున్న భారతీయులు కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని తెలిపారు. 


ఆంధ్రప్రదేశ్ : అమెరికాలోని టెక్సాస్  రాష్ట్రం,  డల్లాస్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన  కాల్పుల్లో తెలంగాణకు చెందిన  ఐశ్వర్య అనే యువతి మరణించడం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. టెక్సాస్ అమెరికాలోని దక్షిణాది రాష్ట్రం. ఇక్కడ నివసించే వారిలో చాలామంది భారతీయులు ఉన్నారు. అందులోనూ తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలో కాల్పుల ఘటన దురదృష్టకరమని నార్త్ అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్ సంతాపం తెలిపారు. తెలంగాణ యువతి తాటికొండ ఐశ్వర్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు.

డల్లాస్ అల్లెన్ ప్రీమియం మాల్ లో జరిగిన కాల్పుల ఘటనలో.. మరణించిన వారిలో ఐశ్వర్య కూడా ఒకరని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారిలో మరో ఇద్దరు తెలుగు వారు ఉన్నారని తెలిపారు. అయితే వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని.. ప్రస్తుతం వారి పరిస్థితి సురక్షితంగానే ఉందని  తెలిసింది అని అన్నారు. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రుల కోసం కొన్ని జాగ్రత్తలు, సూచనలు తెలిపారు. నిత్యం వీటిని పాటించాలని కోరారు.

Latest Videos

undefined

టెక్సాస్ షాపింగ్ మాల్ కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి..

పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
అమెరికాలో ఇటీవల కాలంలో కాల్పుల ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  అక్కడుంటున్న ప్రవాసాంధ్రులు.. భారతీయులు కొన్ని సూచనలు పాటించాలని ఈ మేరకు చెప్పుకొచ్చారు.

- కాల్పులు,  దాడులు లాంటి ఘటనలు ఏవైనా జరిగినప్పుడు వీలైనంతవరకు బయటకి రాకుండా ఉండాలని తెలిపారు.

- ఆ సమయంలో ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నట్లయితే ఎదుటివారికి కనిపించేలా పరుగులు తీయొద్దని.. ఎవరికి కనిపించకుండా నక్కి ఉండాలని సూచించారు.

- కాల్పుల శబ్దం వినిపించినప్పుడు..  మరీ దగ్గరగా ఉందని అనిపించినప్పుడు..  నేలపైనే పడుకుని ఉండాలి.  పైకి  కనిపించకుండా ఉండడంవల్ల కాల్పులను తప్పించుకోవచ్చు.

- ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆందోళన పడి.. హడావుడిగా అటు ఇటు పరుగులు తీయొద్దు.

- బయట గ్రూప్స్ లో కలిసిన సందర్భాల్లో ఎక్కువ వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి..  వీలైనంత తక్కువగా మాతృభాషను ఉపయోగించాలి.

- బయటికి వెళ్లినప్పుడు చుట్టుపక్కల అనుమానిత వ్యక్తులు కదలికల మీద ఓ కన్నేసి ఉంచాలి. 

- ఏదైనా అనుమానం వచ్చినా..  ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అనిపించిన వెంటనే 911 కు సమాచారం ఇవ్వాలి.

- ఎవరితోనూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదించొద్దు.

- ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి గొడవలకు దిగొద్దు.

- రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. అది గమనించి సాధ్యమైనంతవరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి..  మెల్లిగా అక్కడ నుంచి తప్పుకోవాలి.

- జనసంచారం ఎక్కువగా లేని, నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు.

- ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి అనిపించినా వెంటనే 911కు సమాచారం ఇవ్వాలి.

- అమెరికాలో అనేకసార్లు పరిస్థితులు సురక్షితంగానే ఉంటాయి. ఒకటో, రెండో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

- ఎవరికి వారే, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

click me!