తగ్గుతున్న మోజు: అమెరికా ఉద్యోగాలపై ఇండియన్స్ పెదవి విరుపు

By rajesh yFirst Published Jun 7, 2019, 1:52 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ఆ దేశంలో ఉద్యోగాల పట్ల విదేశీయుల్లో ఆసక్తి తగ్గుతోంది. 

న్యూఢిల్లీ: గతంలో అమెరికాలో ఉద్యోగం అటే చాలు ఎగిరి గంతేసేవారు. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అక్కడి ఉద్యోగులకు ఎదురవుతున్న కష్టాలు బోలెడు. అయినా‘అమెరికా మోజు’ను మాత్రం యువత వదులుకోవడం లేదు. 

ఇది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు.. చాలాదేశాల్లోని యువతకు అమెరికా ఓ డ్రీమ్డ్ కంట్రీ. 2018తో పోలిస్తే ఈ ఏడాది అమెరికాలోని టెక్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మరింత పెరిగింది. 

అమెరికా ఉద్యోగాల్లో విదేశీయుల షేర్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 9.6 శాతం కాగా, గతేడాది ఇదే సమయానికి 9.3 శాతంగా ఉన్నట్టు ఇండీడ్ డాట్‌కమ్ ఎకనమిస్ట్ ఆండ్రూ ఫ్లవర్స్ అధ్యయనంలో తేలింది. 

ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు వంటి వాటి వల్ల స్వల్ప పెరుగుదల మాత్రమే నమోదైంది. ప్రత్యేకించి హెచ్-1 బీ వీసా జారీ 10 శాతం తగ్గింది. నిన్నమొన్నటి వరకు అమెరికా ఉద్యోగాలంటే ఎగబడే భారతీయ యువత ఇప్పుడు అంతగా ఆసక్తి చూపడం లేదని ఆండ్రూ ఫ్లవర్స్ పేర్కొన్నారు.

ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గడం ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. అమెరికా అంటే పెదవి విరుస్తున్న వారిలో భారతీయులు ఒక్కరే కాదు.. పాకిస్థాన్, ఇంగ్లండ్ యువత కూడా ఉందని ఆండ్రూ ఫ్లవర్స్ తెలిపారు.

డొనాల్డ్ ట్రంప్ ‘ఫస్ట్ అమెరికన్’ నినాదాన్ని ముందుకు తెచ్చిన తర్వాత ఉద్యోగార్థులు టెక్నాలజీ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకునే వారు ఇతర దేశాల్లో ఆప్షన్లు వెతుక్కున్నారు. కెనడా, యునైటెడ్ కింగ్‪డమ్, జర్మనీ, ఫిలిప్పైన్స్‌ సహా టాప్ ఐదు దేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. 
 

click me!