విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1 బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాల ప్రభావం ప్రతికూలంగా మారింది. 2018లో హెచ్-1 బీ వీసాలు 10 శాతం తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి.
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ నిపుణులు ఉద్యోగం చేసేందుకు ఉపకరించే హెచ్-1బీ వీసాల ఆమోదం 2018లో 10 శాతం తగ్గింది. వర్క్ వీసా ప్రోగ్రామ్‌పై ట్రంప్ ప్రభుత్వ కఠిన విధానాలే ఇందుకు కారణమని ఇమ్మిగ్రేషన్ విశ్లేషకులు భావిస్తున్నారు.
హెచ్-1బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. దీంతో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణుల నియామకానికి వీలవుతుంది. హెచ్1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులే.
undefined
2018లో కొత్తవి, రెన్యువల్ కలిపి 3.35 లక్షల వీసాలకు యూఎస్ పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్) విభాగం ఆమోదం తెలిపింది. 2017లో ఈ సంఖ్య 3,73,400 కావడం గమనార్హం. ఒక్క ఏడాదిలో హెచ్-1బీ వీసాలు దాదాపు 10% తగ్గాయి.
2017లో హెచ్-1బీ అప్రూవల్ (ఆమోదం) రేటు 93% కాగా, 2018 లో అది 85 శాతానికి తగ్గిందని యూఎస్‌సీఐఎస్ వార్షిక నివేదికలో వెల్లడైంది. 2018లో 3,96,300 హెచ్-1బీ దరఖాస్తులను, 2017లో 4,03,300 దరఖాస్తులను పరిశీలించింది.
2018లో 8.50 లక్షల నాచురలైజేషన్ దరఖాస్తులను యూఎస్‌సీఐఎస్ పరిష్కరించింది. కానీ గతేడాది హెచ్-1బీ వీసాల జారీ తగ్గిపోవడానికి ట్రంప్ ప్రభుత్వ కఠిన నిబంధనలే కారణమని వలస విధాన సంస్థ విశ్లేషకులు సారా పీర్స్ అన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీలు హెచ్-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయని విమర్శిస్తున్న ట్రంప్.. ఆ మేరకు హెచ్1బీ నిబంధనలను కఠినతరం చేశారు.