విటారా/వెన్యూలతో బస్తేమే సవాల్: 2020లో విపణిలోకి రెండు కియా కార్లు

By narsimha lodeFirst Published Oct 15, 2019, 10:55 AM IST
Highlights

భారతదేశ విపణిలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా మోటార్స్ వచ్చే ఏడాది రెండు కార్లను ఆవిష్కరించనున్నది. కార్నివాల్ ఎంపీవీ తోపాటు క్యూవైఐ సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును ప్రవేశపెట్టనున్నది. క్యూవైఐ మోడల్ కారు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుండాయ్ వెన్యూ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ వచ్చే ఏడాది రెండు వేర్వేరు కార్లను విపణిలోకి తెచ్చేందుకు సన్నాహలు చేస్తున్నది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన కియా సెల్టోస్ మోడల్ కారుకు మంచి ఆదరణ లభించడంతో అదే మార్గంలో తన సన్నాహాలను వేగవంతం చేసింది. సెల్టోస్ తర్వాత ప్రీమియం ఎంపీవీ కార్నివాల్ మోడల్ కారును పరిచయం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

టయోటాకు చెందిన ఇన్నోవా క్రిస్టాకు కియా ఎంపీవీ కార్నివాల్ మోడల్ కారు గట్టి పోటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల మాట. ఎంపీవీ కార్నివాల్ కారును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంట్‌లో తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చేఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్ పోలో దీనిని ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి.

కార్నివాల్ మోడల్ కారుతోపాటు సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారును కూడా విపణిలోకి తేవాలని కియా మోటార్స్ భావిస్తోంది. ఈ కారును భారతదేశంలోనే రూపొందించి.. ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ కారును ప్రస్తుతం క్యూవైఐ అనే పేరుతో పిలుస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే మార్కెట్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న హ్యుండాయ్ వెన్యూ, మారుతి విటారా బ్రెజా, మహీంద్రా ఎక్స్ యూవీ మోడల్ కార్లను ద్రుష్టిలో పెట్టుకుని కియా మోటార్స్ .. సదరు క్యూవైఐ మోడల్ కారును రూపొందిస్తున్నదని సమాచారం. ఈ కారు వివరాలు కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్ పోలోనే కియా మోటార్స్ వెల్లడించే అవకాశాలు ముందుగా ఉన్నాయి.

కియా మోటార్స్ తన మూడోతరం కార్నివాల్ మోడల్ కారును నాలుగేళ్ల క్రితం 2015లో తొలిసారి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కియో సెడోనా పేరిట ఈ కారును విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ కారు ఫేస్ లిఫ్ట్ వర్షన్ విపణిలోకి తెచ్చారు. భారత్‌లో విక్రయించే ఈ కారులో 7-8 సీట్లు ఉంటాయని తెలుస్తోంది.

click me!