
చెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ మేజర్ స్కోడా ఆటో విపణిలోకి సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు ‘కొడియాక్ స్కౌట్’ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చూనర్, ఇసుజు ఎంయూ-ఎక్స్, మహీంద్రా అల్టురస్ జీ4 కార్లతో కొడియాక్ స్కౌట్ పోటీ పడనున్నదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ కారు ధర రూ.33.99 లక్షల నుంచి మొదలవుతుందని స్కోడా ప్రకటించింది. ఈ కారు ఇంటీరియర్, ఎక్స్ టీరియర్‌ల్లో పూర్తి మార్పులు చేశామని స్కోడా ఆటో తెలిపింది. కారు ముందు వెనుక భాగంలో కొత్త స్కిడ్ ప్లేట్లు, కొత్త డిజైన్‌తో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, సిల్వర్ ఫినిష్‌తో ఓఆర్వీఎంఎస్, రూఫ్ రెయిల్స్ వంటి కొత్త హంగులను సమకూర్చుకుంది. కొడియాక్ స్కౌట్.
వీటితోపాటు క్రోమ్ ఫినిష్ రేడియేటర్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పనోరమిక్ సన్ రూఫ్ ఫీచర్లు అదనం. పూర్తిగా నలుపు రంగు క్యాబిన్, నలుపు రంగు లెదర్ సీట్లు, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్ టెక్నాలజీ, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, డిజిటల్ వాయిస్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ వంటి ఫీచర్లు జోడించారు.
ఈ మోడల్ కారులో ప్రయాణికుల భద్రత కోసం తొమ్మిది ఎయిర్ బ్యాగులను ఏర్పాటు చేశారు. ‘ఐబజ్ ఫాటిగ్యూ అలర్ట్’ అనే సరికొత్త ఫీచర్ జోడించారు. డ్రైవర్ బడలికతో నిద్రలోకి జారుకుంటే దాని ప్రత్యేక వ్యవస్థ తక్షణం వారిని హెచ్చరించి విశ్రాంతి తీసుకోమని సూచిస్తుంది. ఇక ఇంజిన్ విషయానికి వస్తే 2.0 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్ 147 బీహెచ్పీ శక్తిని, 340 ఎన్ఎం టార్చ్ ఉత్పత్తి చేస్తుంది.