రిలయన్స్ జియో లాంఛనంగా ‘గిగా ఫైబర్’ బ్రాడ్ బాండ్ సేవలను ప్రారంభించింది. రూ.699లకే జియో గిగా ఫైబర్ నెలవారీ ప్లాన్ ప్రారంభం అవుతుంది. జియో గిగా ఫైబర్ ఇచ్చిన ప్లాన్లు.. ఇతర టెలికం సంస్థల ప్లాన్ల కంటే 35 నుంచి 40 శాతం తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
రిలయన్స్ జియో తన ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ‘జియోఫైబర్’ను గురువారం లాంఛనంగా ప్రారంభించింది. వివిధ రకాల ప్లాన్లను ప్రకటించింది. నెలవారీ ప్లాన్ల ప్రారంభ ధర రూ.699 ఉండగా.. కనీస ఇంటర్నెట్ వేగం సెకన్‌కు 100 మెగాబైట్లు (ఎంబీపీఎస్)గా ఉంది.
నెలవారీ ప్లాన్ల ధర రూ.699 నుంచి రూ.8,499 వరకు ఉంది. రూ.1,299 నుంచి రూ.8,499 శ్రేణిలో ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఎంచుకున్న వార్షిక చందాదారులకు టీవీ సెట్‌ను అందజేయనున్నారు.
undefined
హై డెఫినిషన్ సెట్-టాప్-బాక్స్, రౌటర్, ఉచిత వాయిస్ కాలింగ్, టెలివిజన్ ఆధారిత వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ సర్వీస్, జీరో లాటెన్సీ గేమింగ్, ఐదు డివైజ్‌లకు సెక్యూరిటీ వంటి వాటిని అన్ని ప్లాన్ల కస్టమర్లకు కంపెనీ అందిస్తుంది. దేశంలోని 1,600 నగరాల్లో ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్టు కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ ఇన్ఫోకామ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ ఇప్పటికే 5 లక్షల మంది జియో ఫైబర్ ప్రివ్యూ వినియోగదారులు ఉన్నారని, వీరి ద్వారా తమ సర్వీసులు మరింత మెరుగయ్యే అవకాశం ఏర్పడిందన్నారు.
తొలుత జియో ఆరు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. నెలవారీ ప్లాన్లతో పాటు 3 నెలలు, 6 నెలలు, 12 నెలల ప్లాన్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. అయితే జియో ఫైబర్ కనెక్షన్ కోసం వన్‌టైమ్ ఫీజు కింద రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్, రూ.1,000 నాన్ రిఫండేబుల్ ఇన్‌స్టాలేషన్ చార్జీలు ఉంటాయి.
కస్టమర్లు ఎంచుకునే ప్లాన్లపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ప్లాన్‌లోనూ అపరిమిత డేటా డౌన్‌లోడ్, అప్‌లోడ్ వసతి ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే ఎఫ్‌యూపీ (ఫేర్ యూసేజ్ పాలసీ) ప్రకారం.. గరిష్ఠ వేగ పరిమితి తర్వాత వేగం ఒక ఎంబీపీఎస్‌గా ఉంటుంది.
వార్షిక ప్లాన్లను ఎంచుకునే కస్టమర్లు నెలవారీ వాయిదాల్లో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. అదనంగా ఇచ్చే డేటా మొదటి ఆరు నెలల పాటు లభిస్తుంది.
కొత్త జియో ఫైబర్ కస్టమర్లకు రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా వార్షిక ప్లాన్లను ఎంచుకునే కస్టమర్లకు ఉచితంగా జియో హోమ్ గేట్‌వే డివైజ్ (రూ.5,000), జియో 4కే సెట్‌టాప్ బాక్స్ (రూ.6,400), రెండు నెలల ఉచిత సర్వీస్, డబుల్ డేటాను అందిస్తోంది.
3 నెలల పాటు జియో సినిమాలు, జియో సావన్ యాప్స్‌ను పొందే అవకాశం కల్పిస్తోంది. జియో ఫరెవర్ గోల్డ్ వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వారికి ఉచితంగా ఎంయూజ్ 2 బ్లూటూత్ స్పీకర్, సిల్వర్ ప్లాన్‌పై ట్రంప్ 2 బ్లూటూత్ స్పీకర్లు ఇస్తోంది.
డైమండ్, ప్లాటినం వార్షిక ప్లాన్లపై ఉచితంగా హెచ్డీ టీవీ (విభిన్న రకాల స్ర్కీన్ల సైజుతో) ఇస్తోంది. గోల్డ్ ప్లాన్ ఎంచుకుంటే 24 అంగుళాల హెచ్‌డీ టీవీ, టైటానియం వార్షిక ప్లాన్‌పై 43 అంగుళాల 4కే టీవీని ఉచితంగా ఇస్తోంది.
నెలకు రూ.699తో 100ఎంబీపీఎస్ వేగాన్ని జియోఫైబర్ అందిస్తున్న నేపథ్యంలో ఈ ధర ఇతర పోటీ కంపెనీలతో పోల్చితే 35% నుంచి 45% వరకు తక్కువగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిందని, తాజాగా ప్రకటించిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లతోనూ ఇదే తరహాలో సంచలనం రేపే అవకాశం ఉందని భావిస్తున్నారు. రిలయన్స్ ఇన్ఫోకామ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ ‘ప్రస్తుతం మన దేశంలో ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సగటు వేగం 25 ఎంబీపీఎస్ మాత్రమే ఉంది.
అమెరికాలో దాదాపు 90 ఎంబీపీఎస్ అందుబాటులో ఉంది. జియో ఫైబర్ భారత్‌లో తొలి 100 శాతం ఆల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. దీని వేగం 100 ఎంబీపీఎస్ నుంచి ఒక జీబీపీఎస్ వరకు ఉంటుంది. ఈ సర్వీస్ ద్వారా భారత్ టాప్5 బ్రాడ్‌బ్యాండ్ దేశాల సరసన చేరుతుంది’ అని తెలిపారు.