మధ్యశ్రేణి ఐటీ సంస్థ ‘మైండ్ ట్రీ’ ప్రమోటర్లలో కాసింత మార్పు కనిపిస్తోంది. ఎల్ అండ్ టీని ఢీకొట్టే కంటే మధ్యేమార్గం బెటరని భావిస్తోంది. బై బ్యాక్ ప్రపోజల్ బోర్డు పక్కన బెట్టిన తర్వాత ఎల్ అండ్ టీతో సయోధ్యకు మార్గాల అన్వేషణపై మైండ్ ట్రీ ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఎల్ అండ్ టీతో ఓడిపోయే యుద్ధాన్ని తాము చేయడం లేదని మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్ పేర్కొన్నారు. సంధి కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఎల్ అండ్ టీ కంపెనీతో చర్చల ద్వారా ‘మధ్యే మార్గం’గా ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవడానికీ సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఎల్ అండ్ టీ టేకోవర్‌పై మైండ్ ట్రీ కమిటీ
ఎల్ అండ్ టీ ‘బలవంతపు టేకోవర్’ను పరిశీలించడానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఒక రోజు తర్వాత ఒక ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటరాజన్ నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడం గమనార్హం. బైబ్యాక్ ప్రణాళికలను సైతం మైండ్‌ట్రీ బోర్డు విరమించుకున్న సంగతి తెలిసిందే.
undefined
ఎల్ అండ్ టీతో సయోధ్యకు మైండ్ ట్రీ రెడీ
షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డు విరమించుకోవడంతో ఎల్ అండ్ టీతో సయోధ్య కోసం యాజమాన్యం ప్రత్యేకించి ప్రమోటర్లు సిద్ధమయ్యారని క్రుష్ణకుమార్ నటరాజన్ మాటలను బట్టి తెలుస్తోంది.
బలవంతపు టేకోవర్ కోసం ప్రయత్నిస్తున్న ఎల్ అండ్ టీపై దాదాపు యుద్ధం ప్రకటించినంత పని చేసిన మైండ్ ట్రీ వ్యవస్థాపక ప్రమోటర్లలో మార్పు రావడం ఆసక్తి కర పరిణామం.
దిగుబడి వచ్చే ముందు తుఫాన్ వచ్చినట్లు ఎల్ అండ్ టీ టేకోవర్
కొద్ది వారాల నుంచి ప్రమోటర్ల నుంచి వెల్లువెత్తిన తీవ్ర ఆందోళనలు, నిరసనల తర్వాత ఈ తరహా సంధి వాతావరణం ఏర్పడడం ఇదే తొలిసారి. కాగా, తాము ఎందుకు అంతగా స్పందించామన్న దానిపై ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరిస్తూ ‘ఎల్ అండ్ టీ బిడ్ తప్పు కాదు.
అది వచ్చిన సమయమే తప్పు. ఎందుకంటే మేం భూమిని చదును చేసి, మంచి విత్తనాలు నాటి, పంటను పెంచాం. ఇపుడు దిగుబడి వస్తుందనగా.. ఒక తుపాను వస్తే.. మా వాటాదార్లకు అది మంచి విషయం కాదు కదా’ అని నటరాజన్ అన్నారు.
షేర్ల బై బ్యాక్ నిర్ణయం బోర్డుది ప్రమోటర్లది కాదని వ్యాఖ్య
‘ఇపుడు ఉద్యోగులు, వినియోగదార్ల ప్రయోజనాలను రక్షించడంపై మేం దృష్టి సారించాం. గతం గురించి ఆందోళన చెందడంలో అర్థం లేదు కదా’ అని పేర్కొన్నారు. బైబ్యాక్ ప్రణాళిక విరమణపై మాట్లాడుతూ ‘అది బోర్డు నిర్ణయం. ప్రమోటర్లది కాదు. ఎల్ అండ్ టీ బిడ్ కంటే ముందే షేర్ల బై బ్యాక్‌ను ప్రకటించిన విషయం గుర్తు పెట్టుకోవాలి’ అని అన్నారు.
ఆశావాదం, ఆచరణాత్మక వైఖరికే ప్రాధాన్యం అన్న క్రుష్ణకుమార్
మైండ్ ట్రీ ప్రమోటర్లు తొలి నుంచి కష్టనష్టాలకు ఓర్చి ఏళ్ల తరబడి కష్ట పడ్డారు. మున్ముందు లాభాలు గడించొచ్చనన్న అంచనాలతో ఉన్నాం అని క్రుష్ణ కుమార్ నటరాజన్ తెలిపారు. అయితే తాము ఆశావాదంతోనూ, ఆచరణాత్మక వైఖరికే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వాస్తవ పరిస్థితులను వదిలేసి గతం గురించి ఆందోళన చెందడం అర్ధం లేనిదన్నారు.
మైండ్ ట్రీకి రూ.10,800 కోట్లతో ఎల్ అండ్ టీ ఆఫర్
66 శాతం వాటా కోసం రూ.10,800 కోట్ల ఆఫర్‌ను ఎల్ అండ్ టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేఫ్ కాఫీ డే యజమాని వి.జి. సిద్ధార్థకు మైండ్ ట్రీలో ఉన్న 20.32 శాతం వాటా కొనుగోలు కోసం ఎల్ అండ్ టీ ఒప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. కాగా, ఎల్ అండ్ టీ బిడ్ తర్వాత ఏర్పడ్డ అనిశ్చితిలో తాజా పరిణామం ఒక కొత్త మజిలీగా చెప్పవచ్చు.
అనిశ్చితికి తెర దించేందుకు ఎఎం నాయక్ రంగ ప్రవేశం
మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ మధ్య అనిశ్చితి నెలకొన్న తర్వాత రంగ ప్రవేశం చేసిన ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పూనుకున్నారు. మైండ్ ట్రీ యాజమాన్యం ఆందోళనలను పరిష్కరించేందుకు, వారికి హామీలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మైండ్ ట్రీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా క్రుష్ణకుమార్ నటరాజన్‌ను యధావిధిగా కొనసాగిస్తామని ఎఎం నాయక్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
మెత్తబడని మైండ్ ట్రీ వ్యవస్థాపకులు.. ప్రమోటర్లకు నలందా కాపిటల్ సపోర్ట్
కానీ మైండ్ ట్రీ వ్యవస్థాపకులు మాత్రం మెత్తబడినట్లు కనిపించడం లేదు. వారు చివరి వరకు పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్ అండ్ టీలో తమ సంస్థ భవితవ్యం, వారి ప్రయోజనాల సంగతిపై స్పష్టత కోసం ప్రయత్నించాలని చూస్తున్నట్లు సమాచారం.
ప్రమోటర్లకు 13.32 శాతం వాటా ఉండగా, మరో 10.6 శాతం వాటా గల నలందా క్యాపిటల్ తమకు మద్దతునిస్తోందని మైండ్ ట్రీ సీఈఓ రొస్తొవ్ రావణన్ పేర్కొన్నారు.
మైండ్ ట్రీ మెజారిటీ వాటాదారు సిద్దార్థ విశ్వసనీయత ప్రదర్శించాల్సింది
మైండ్ ట్రీలో మెజారిటీ వాటాదారు వీజీ సిద్దార్థ తన వాటాలను విక్రయించడం తప్పేమీ కాదని, చట్ట విరుద్ధం కూడా కాదని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రుష్ణకుమార్ నటరాజన్ తెలిపారు. కానీ పూర్తిగా సంస్థను ఇతరులకు ఆయన అమ్మేయలేరు కదా? అని అన్నారు.
ఆయన విశ్వసనీయంగా వ్యవహరించాలి కదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో పారదర్శకంగా వ్యవహరించాల్సిందని అన్నారు. ప్రస్తుత తరుణంలో పరిస్థితులను బట్టి తాము ముందుకు వెళతామని చెప్పారు.
మేమే తీసుకుంటామన్నట్లు బ్యాంకుల వ్యవహారం: మాల్యా
భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులపై పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా మరోసారి విమర్శలు చేశారు. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్(యూబీహెచ్‌ఎల్)లో మాల్యాకు చెందిన 74లక్షలకు పైగా షేర్లను రూ.1,008 కోట్లకు రుణ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్టీ) బుధవారం విక్రయించిన విషయం తెలిసిందే.
బ్యాంకులు తనను కావాలనే దొంగలా చిత్రీకరిస్తున్నాయని, ‘నువ్వు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత’ అన్నట్లు నన్ను పరిగణిస్తున్నారని మాల్యా ట్వీట్ చేశారు.
బ్యాంకులు దోపిడీ దారుగా చూస్తున్నాయని మాల్యా ఆందోళన
‘ప్రభుత్వ రంగ బ్యాంకుల డబ్బులు దోచుకుని పారిపోయిన వ్యక్తిగా నన్ను చిత్రీకరించేందుకు ఇప్పటివరకు చాలా సార్లు చాలా చేశారు. గతంలో బ్యాంకులు అధిక మొత్తంలో రికవరీ చేసుకున్నాయి. తాజాగా కూడా రికవరీ చేశాయి.
ఇవన్నీ నేను చేసిన రాజీ ప్రతిపాదనలో ఉన్నవే. ‘నువ్వు ఇస్తే ఎంత.. ఇవ్వకపోతే ఎంత.. మేం తీసుకోవాల్సింది తీసుకుంటాం’ అన్న రీతిలో నన్ను పరిగణిస్తున్నారు’ అని మాల్యా ట్వీట్ చేశారు.
మాల్యపై మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు
ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం మాల్యాపై రుణ ఎగవేత ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా యూబీహెచ్‌ఎల్‌లోని మాల్యా షేర్లను డీఆర్‌టీ గతంలో స్వాధీనం చేసుకుంది.
ఈ షేర్లను బుధవారం విక్రయించగా రూ. 1008కోట్లు వచ్చినట్లు ఈడీ తెలిపింది. మాల్యా కేసులో షేర్ల విక్రయం ఇదే తొలిసారని, రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని విక్రయాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.