రిలయన్స్ జియో మీ నట్టింట్లోకి దూసుకొస్తానంటోంది. 4జీలో ఆఫర్ల వర్షం కురిపించి తాజాగా చిలకరిస్తున్న చార్జీల మోతతో అసలు స్వరూపం బయటపెట్టుకున్నది.
రిలయెన్స్ జియో అంటే ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ గుర్తుకు వస్తారు. మొబైల్ ఫోన్లు అంటే తెలియని వారికి కూడా జియో పేరు నోళ్లలో నానుతున్నది. కానీ ఈ సంస్థ ఉచిత కాల్స్ అంటూ వినియోగదారులను ఆకర్షించిన జియో.. తాజాగా చార్జీ వసూలు చేస్తోంది.
జియో ఆఫర్ల దెబ్బకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు ప్రైవేట్ సంస్థలు చెల్లాచెదురయ్యాయి. జియో సంస్థ నెట్ వర్క్ విషయంలో పలు నిబంధనలు అతిక్రమించినా..చట్టాలను ధిక్కరించినట్లు ట్రాయ్ గుర్తించినా ఎలాంటి చర్యలూ లేవు.
undefined
ఈ సంస్థ వెనుక మోడీ సర్కార్ అండ ఉండటం వల్లే తామంతా ఉనికిని కోల్పోయామని ఆ సంస్థలన్నీ గుండెలు బాదుకుంటున్నాయి. తాజాగా జియో ఫైబర్ టు ది హోం (ఎఫ్‌టీటీహెచ్) సేవలందిస్తామంటూ మార్కెట్లోకి దూసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.
జియో గిగా ఫైబర్‌లో అల్ట్రా హై డెఫినెషన్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్, వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్, వర్చువల్ గేమింగ్, డిజిటల్ షాపింగ్ వంటి సేవలు అందుతాయి.
ఈ సేవలన్నీ జియో గిగా ఫైబర్‌కు అదనపు బలాలుగా నిలుస్తాయి. దీన్ని పరిశీలిస్తే ఫైబర్ టు ది హోం (ఎఫ్‌టీటీహెచ్) అని గానీ, ఫైబర్ టు ది ప్రిమిసెస్ (ఎఫ్‌టీటీపీ) అని గానీ అంటారు. ఒక కేంద్రం నుంచి ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను నేరుగా ఇంటికి వేయడాన్ని ఎప్‌టీటీహెచ్ అంటారు.
ప్రస్తుతం చాలా ఫైబర్ కేబుల్ సర్వీసుల్లో ఇంటర్నెట్ కొంత నిదానంగా ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకునే దిశగా జియో యత్నాలను ప్రారంభించింది. డెరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ప్రసారకర్తలు జంట సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
కంటెంట్‌కు సంబంధించి ప్రధాన డీటీహెచ్ కంపెనీలు కూడా కొరతను చవి చూస్తున్నాయి. వీక్షకుల సంఖ్యను పెంచడంలో కంటెంట్‌దే కీలక పాత్ర. ఇక పంపిణీ విషయంలో కొన్ని సంస్థలకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. దీంతో డీటీహెచ్ సంస్థలు ఇంటర్నెట్ సేవలను అందించలేకపోతున్నాయి. అవి వాటికి ప్రధాన లోపం.
ఇటీవల డీటీహెచ్ ధరలకు ట్రాయ్ కళ్లెం వేయడంతో లాభాల కోసం టెలికం ప్రొవైడర్లు కొత్త మార్గాలను వెతకాల్సిన పరిస్థితి నెలకొన్నదని నిర్వాహకులు అంటున్నారు. రిలయెన్స్ గ్రూపు అనగానే చిన్న చిన్న డీటీహెచ్ కంపెనీలు తట్టుకోలేకపోతాయి.
బడా కార్పొరేట్ సంస్థ పైగా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కు దగ్గరగా ఉండటంతో.. ఎందుకొచ్చిన తలనొప్పంటూ వీలినానికి సిద్దం అంటున్నాయి. జియో గిగాఫైబర్ మార్కెట్‌లో అడుగు పెట్టడానికి కొంత సమయం పట్టొచ్చు.
అంతకు ముందే డీటీహెచ్‌లో విలీనాలు ఉపందుకున్నాయి. చివరి దశ విలీనాలు 2017లో మొదలయ్యాయి. డిష్‌టీవీ- వీడియోకాన్ డీ2హెచ్, రిలయన్స్ బిగ్‌టీవీ -వీకన్ మీడియా అండ్ టెలివిజన్ విలీనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ తాజాగా డిష్‌టీవీపై ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
మార్కెట్ డిష్‌టీవీనే దేశంలో అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్. ఆ తర్వాత స్థానాల్లో టాటా స్కై, ఎయిర్‌టెల్ డీటీహెచ్ ఉన్నాయి. భారతీ ఎయిర్ టెల్ - డిష్‌టీవీ విలీనం కానున్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో డిష్‌టీవీ షేర్లు ఇంట్రాడేలోనే భారీగా పెరిగాయి.
వాస్తవానికి ఎయిర్‌టెల్ కూడా సింగ్‌టెల్‌తో కలిసి డిష్ టీవీలో 60శాతం వాటాల కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నది. ఈ డీల్ విలువ రూ.6,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే డిష్‌టీవీలోని 80శాతం ప్రమోటర్ వాటాలు మొత్తం పెట్టుబడిదారుల వద్ద తాకట్టులో ఉన్నాయి.
మరోవైపు రిలయన్స్ జియోను సమర్థంగా ఎదుర్కొనేందుకు టాటా స్కై కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.ఆర్థిక వనరులను సిద్ధం చేసుకొనేందుకు బలమైన పెట్టుబడిదారుల కోసం అన్వేషణ ప్రారంభించింది.
టెమసెక్, టాటా ఆర్చ్యూనిటీస్ ఫండ్‌లకు టాటాస్కైలో దాదాపు 19శాతాం వాటాలు ఉన్నాయి. బలమైన పెట్టుబడిదారులకు తమ వాటాలను విక్రయించి దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ వర్గాల్లో వినిపిస్తున్నది.
టాటాస్కైలో మెజారిటీ 51శాతం వాటాలు టాటాసన్స్ వద్ద ఉండగా మరో 30శాతం వాటాలు వాల్ట్ డిస్నీ చేతికి వెళ్లాయి. వాల్ట్ డిస్నీ ఇటీవలే ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌ను కొనుగోలు చేయడంతో ఈ వాటాలు దక్కాయి. గతంలో ట్వంటీఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు దీనిలో వాటాలు ఉండేవి.
అయితే కొత్తగా జియో గిగా ఫైబర్‌తో వినియోగదారులను ఆకట్టుకొని డీటీహెచ్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేలా రిలయన్స్ సంస్థ అడుగులు వేస్తున్నది. రిలయన్స్ జియో గిగాఫైబర్‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్‌ల్లోని ముంబై, సూరత్, అహ్మదాబాద్‌లతోపాటు ఢిల్లీ నగర పరిధిలో ప్రయగాత్మకంగా విక్రయాలు చేపట్టే అంశాన్ని రిలయన్స్ జియో పరిశీలిస్తున్దని.
100 ఎంబీపీఎస్ వేగంతో పనిచేసే కనెక్షన్లను రిలయన్స్ ఆఫర్ చేస్తున్నది. దీనికి నెలకు 100 జీబీ డౌన్‌లోడ్లను ఇస్తున్నారు. వినియోగదారులు రౌటర్‌కు రూ.4,500 చెల్లించాలి. ఈ మొత్తాన్ని చివర్లో రీఫండ్ చేస్తారు.
దీనికి రిలయన్స్ డెన్, హాత్‌వే నెట్‌వర్క్‌లను కూడా వాడుకొనే అవకాశం ఉన్నట్టు జియో వర్గాలు అంటున్నాయి. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు.