టెలికం రంగంలో సంచలనంతో దూసుకెళ్తున్న రిలియన్స్ జియోతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’బాటలోనే ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పయనిస్తున్నాయి. ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో భారీగా కస్టమర్లను కోల్పోయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు.. బీఎస్ఎన్‌ఎల్, రిలయన్స్ జియో బాట పడుతున్నాయి. 2018 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో సంస్థలు మాత్రమే అత్యధికంగా కస్టమర్లను సంపాదించుకున్నాయి.
దిగ్గజ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలికాం కస్టమర్లను కోల్పోయాయి. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో నికరంగా 2.78 కోట్లకుపైగా కస్టమర్లను సంపాదించుకుందని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. దీంతో కంపెనీ కస్టమర్ల సంఖ్య 11 శాతం పెరిగింది.
undefined
ఈ త్రైమాసికంలో బీఎస్ఎన్‌ఎల్ నికరంగా 11.2 లక్షల మంది కస్టమర్లను జత చేసుకుంది. ఇదేకాలంలో వొడాఫోన్ ఐడియా 1.62 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ 32.2 లక్షలు, టాటా టెలీ 29.9 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉమ్మడిగా 80 లక్షలకు పైగా కస్టమర్లను కోల్పోయాయి.
కస్టమర్లను పెంచుకోవడంతోపాటు రాబడి పెంచుకోవడంలోనూ రిలయన్స్ జియో ముందు ఉంటోంది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జియో ఆదాయం అంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే 14.63 శాతం పెరిగి రూ.9,500 కోట్లకు చేరుకుంది.
డిసెంబర్ నెలాఖరు వొడాఫోన్ ఐడియా కస్టమర్ల సంఖ్య 41.9 కోట్లకు పైగా ఉంది. తర్వాతీ స్థానంలో 34.4 కోట్లతో భారతీ ఎయిర్‌టెల్, 28 కోట్లతో రిలయన్స్ జియో, 12.58 కోట్ల కస్టమర్లతో బీఎస్ఎన్‌ఎల్ నిలిచాయి.
గతేడాది డిసెంబర్ త్రైమాసికం చివరినాటికి దేశంలో మొత్తం టెలికం సర్వీసుల (వైర్‌లైన్ ప్లస్ వైర్‌లెస్) వినియోగదారుల సంఖ్య 119.7 కోట్లు. ఇందులో వైర్‌లెస్ కస్టమర్ల సంఖ్య 117.6 కోట్లు. డిసెంబర్ నెలాఖరు నాటికి ఇంటర్నెట్ కస్టమర్ల సంఖ్య 60.4 కోట్లుగా ఉంది.
సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ కస్టమర్ల సంఖ్య 7.89 శాతం పెరిగింది.
వైర్‌లెస్ సర్వీసులను వినియోగించుకుంటున్న ఒక్కో కస్టమర్ నుంచి నెలవారీగా పొందుతున్న రాబడి రూ.70.13గా ఉంది. నెలలో సగటున మొబైల్ డేటా వినియోగం 8.74 జీబీగా నమోదైనట్టు ట్రాయ్ తెలిపింది.