ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ డిస్కౌంట్లపై ప్రభుత్వం నజర్

By narsimha lode  |  First Published Oct 16, 2019, 12:19 PM IST

ఎట్టకేలకు ఈ-కామర్స్ ఆఫర్లపై కేంద్రం నజర్ పడింది. తమకు భారీ నష్టం వాటిల్లుతుందని సీఐఏటీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయా సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థల ప్రతినిధులతో వాణిజ్య శాఖ అధికారులు సంప్రదించారు. తాము భారత ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నామని రెండు సంస్థల ప్రతినిధులు వివరణ ఇచ్చారు.


న్యూఢిల్లీ: పండుగ సమయాల్లో ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ సంస్థలతు డిస్కౌంట్లతో హోరెత్తించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇలా గుక్క తిప్పుకోలేని ఆఫర్లను ప్రకటించడం విదేశీ పెట్టుబడుల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఆన్‌లైన్ మార్కెట్ సంస్థలు భారీ రాయితీలతో హోరెత్తించడం వల్ల చిన్నచిన్న రిటైల్ దుకాణాలపై ఆధారపడే దేశంలోని 130 మిలియన్ల మందిపై ప్రభావం పడుతుందని అంచనా. దీంతో చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

Latest Videos

undefined

ఈ-కామర్స్ సైట్లకు ఈ నిబంధనలు రుచించకపోవడమే కాక అమెరికా నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను ఈ నిబంధనలు కొంతమేర దెబ్బతీశాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ మాత్రం తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నాయి.

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థల వల్ల స్థానిక వ్యాపార సంస్థలు మాత్రం తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆరోపిస్తున్నాయి. ఫెస్టివ్ సీజన్‌లో ఒక్కోసారి 50 శాతానికి పైగా ఆఫర్లు ప్రకటిస్తుండడం వల్ల తమ వ్యాపారం దారుణంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. అలాగే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) చేసిన ఫిర్యాదుపైనా స్పందించింది. సీఏఐటీలో దేశవ్యాప్తంగా 70 మిలియన్ల మంది చిన్న వ్యాపారులు సభ్యులు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని సీఏఐటీ తమ ఫిర్యాదులో ఆరోపించింది.

ఆరోపణలపై చర్చించేందుకు రావాల్సిందిగా ఈ-కామర్స్ సంస్థలకు ప్రభుత్వం సమన్లు జారీ చేయగా, గత వారం ప్రభుత్వం ఆయా సంస్థలతో సమావేశమైంది. ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి మాట్లాడుతూ.. సమావేశం బాగానే జరిగిందని పేర్కొంది. తాము పూర్తిగా భారత్‌లోని నియమ నిబంధనల మేరకే నడుచుకుంటున్నట్టు తెలిపింది. అమెజాన్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది.

నమ్మశక్యం కాని ఆఫర్ల వల్లే వినియోగదారులు అటువైపు మళ్లుతున్నారని, దీనివల్లే ఆఫ్‌లైన్ మార్కెట్ అమ్మకాలు ఈ నెలలో 30 నుంచి 40 శాతం పడిపోయాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు. కాగా, నిబంధనలకు పాతరేస్తూ అమ్మకాలు సాగిస్తున్న ఈ-కామర్స్ సంస్థలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్న విషయం చెప్పేందుకు వాణిజ్యమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు నిరాకరించారు.

click me!