ఎట్టకేలకు జియోను బీట్ చేసిన ఎయిర్‌టెల్..

By Siva KodatiFirst Published Mar 25, 2019, 12:15 PM IST
Highlights

రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేసిన తర్వాత తొలిసారి యూజర్ల సంఖ్య పెంచుకోవడంలో ఎయిర్ టెల్ పై చేయి సాధించింది. రిలయన్స్ జియో కేవలం 93.2 లక్షల మందిని చేర్చుకోగా, ఎయిర్ టెల్ 99.7 లక్షల మంది సబ్ స్క్రైబర్లు చేర్చుకున్నది. 

దాదాపు రెండున్నరేళ్లుగా అంటే 2016 మధ్య నుంచి టెలికం రంగంలోకి జియో రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి మార్కెట్‌లో పరిస్థితిపై గందరగోళం నెలకొంది. నాటి నుంచి నేటి వరకు రిలయన్స్ జియో ప్రస్థానం దినదిన ప్రవర్థమానమై వెలుగొందుతోంది.

రెండేళ్లలో సబ్ స్క్రైబర్లను పెంచుకుని అతిపెద్ద ప్రొవైడర్‌గా ఎయిర్ టెల్‌ను ఢీకొట్టేందుకు కొద్ది దూరంలో ఉంది. అయితే జనవరిలో భిన్నమైన గణాంకాలు వెలుగు చూశాయి. ఎప్పటికప్పుడు సబ్ స్క్రైబర్లను పెంచుకోవడంలో ఇటు రిలయన్స్ జియో, అటు భారతీ ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి.

జనవరిలో తొలిసారి రిలయన్స్ జియోపై ఎయిర్ టెల్ పై చేయి సాధించిందని ట్రాయ్ పేర్కొన్నది. 2018 డిసెంబర్ నెలలో ఎయిర్ టెల్ మొబైల్ బ్రాడ్ బాండ్ యూజర్ల సంఖ్య 97.99 మిలియన్ల నుంచి 107.96 మిలియన్లకు చేరింది.

అంటే ఒక్క నెలలోనే ఎయిర్ టెల్ 99.7 లక్షల మంది నూతన యూజర్లను ఆకర్షించగలిగింది. మరోవైపు 2018 డిసెంబర్ నాటికి జియో యూజర్ల సంఖ్య 280.12 మిలియన్లు అయితే అది జనవరి నెలాఖరు నాటికి 289.44 మిలియన్ల యూజర్లు చేరారు.

నెల రోజుల్లో కొత్తగా 93.2 లక్షల యూజర్లు చేరారు. దీంతో పోలిస్తే తొలిసారి జియోపై ఎయిర్ టెల్ సంస్థ సుమారు 6.2 లక్షలు ఎక్కువగా యూజర్లను పెంచుకోగలిగింది. దేశీయ టెలికం రంగ పరిశ్రమలో మూడోసారి టెలికం యూజర్లు 120 కోట్ల మార్క్ దాటారు.

గతేడాది మేలో, 2017 జూలై నెలల్లో ఈ మార్కును అధిగమించారు. నూతన యూజర్లను చేర్చుకోవడంలో రిలయన్స్ జియో మొదటి స్థానంలో నిలిచింది. 
 

click me!