అబ్బో సెకండ్ యమ కాస్ట్ లీ.. న్యూ వెహికల్ బెస్ట్!

By Nagaraju penumalaFirst Published Sep 25, 2019, 11:32 AM IST
Highlights

సంక్షోభంలో చిక్కుకున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెస్తున్న పాత వాహనాల స్క్రాపింగ్ విధానం ఆశలు రేపుతున్నది. కానీ సెకండ్ హ్యాండ్ వాహనాలు వాడాలని భావించే వారికి మాత్రం చుక్కలు చూపనున్నది. సెకండ్ హ్యాండ్ వాహనాల రీ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.500 నుంచి రూ.15 వేలకు, రూ.1000 నుంచి రూ.20 వేలకు, రూ.1500 నుంచి రూ.40 వేలకు పెంచనున్నది.

న్యూఢిల్లీ: మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటున్నారా?! ఒక్క నిమిషం.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త పాలసీ గురించి ఒక్కసారి తెలుసుకోండి. కేంద్రం తెచ్చే ఈ పాలసీతో పాత వాహనాలన్నీ ఇక తుక్కుకు పరిమితం కానున్నాయి.

ఈ వారంలో జరిగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ‘వెహికిల్ స్క్రాపేజ్ విధానం’ పై చర్చ జరగనుంది. దీని ప్రకారం పాత వాహనాల్ని ఉపయోగించడం ఇక నుంచి చాలా ఖరీదైన వ్యవహారంగా మారనుంది. దీనికి బదులు పాత వాహనాలను తుక్కు కింద అమ్మేస్తే ప్రభుత్వమందించే పన్ను ప్రోత్సాహకాలు కస్టమర్లకు ఉపయోగపడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

పాత కార్ల వాడకం తగ్గించి కొత్త కార్ల వినియోగం పెంచేందుకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించిన ముసాయిదా ఆమోదం పొందింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని భారీగా తగ్గించేందుకు వీలు కల్పించే భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి. దీని ప్రకారం బీఎస్-6 అర్హత గల వాహనాలు మాత్రమే విక్రయిస్తారు.

ప్రభుత్వం నూతనంగా తెస్తున్న కొత్త పాలసీ ప్రకారం.. నాలుగు చక్రాల ప్రైవేట్ వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌ ఫీజును 25 రెట్లు పెంచారు. ప్రస్తుతం రూ. 600 గా ఉన్న దీనిని రూ. 15 వేలకు పెంచారు. ఇక కమర్షియల్ వాహనాల ఫీజును రూ. 1,000 నుంచి రూ. 20 వేలకు పెంచారు. ఇక మీడియం కమర్షియల్ వాహనాల ఫీజును రూ. 1,500 నుంచి రూ. 40 వేలకు పెంచాలని ప్రతిపాదించారు.

దీని ప్రకారం పాత వాహనాలను రీ-రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం కంటే తుక్కు కింద అమ్ముకోవడమే మేలనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. పైగా తుక్కు కింద అమ్మే వాహనాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నారు. తుక్కు కింద అమ్మినట్లు ధ్రువీకరణ పత్రం చూపి కొత్తగా కొనే వాహనంలో కొన్ని రకాల పన్నుల నుంచి రాయితీ పొందవచ్చని పేర్కొన్నారు.

ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంటోంది. గత ఆగస్టు నాటికి వాహనాల అమ్మకం 38.71 శాతానికి తగ్గింది. అయితే ప్రభుత్వం తెస్తున్న కొత్త పాలసీ ద్వారా పాత కార్ల స్థానంలో కొత్త రానున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే సేల్స్ మళ్లీ పుంజుకోనున్నాయి.

click me!