సెర్చింజన్ ‘గూగుల్ ఇండియా’ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అనూహ్య పరిణామాల మధ్య రాజీనామా చేశారు. మంగళవారం రాజీనామా చేసినా ఈ నెలాఖరు వరకు కొనసాగుతారు.
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’కు మరో పెద్ద షాక్ తగిలింది. కంపెనీ ఇండియా, సౌత్ఈస్ట్ ఆసియా ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తన పదవికి రాజీనామా చేశారు. గత ఎనిమిదేండ్లుగా వివిధ హోదాల్లో పనిచేసిన రాజన్ అనూహ్య పరిణామాల మధ్య రాజీనామా చేసినట్లు తెలుస్తున్నది.
మంగళవారం రాజీనామా చేసినా ఈ నెల చివరి వరకు ఆయన పదవిలో కొనసాగనున్నారు. పలు స్టార్టప్‌లలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ఆనందన్ జాయింట్ వెంచర్ ఫండ్ సిక్యూయా క్యాపిటల్‌లో చేరనున్నారు.
undefined
ప్రస్తుతం ఉన్న ఆరుగురు మేనేజింగ్ డైరెక్టర్లతోపాటు ఆనందన్ సంస్థలో నాయకత్వ జట్టులో చేరినట్లు సీక్వోయా క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేంద్ర జి. సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలిపారు.
దీంతో రంగంలోకి దిగిన గూగుల్ యాజమాన్యం ఆనందన్ స్థానంలో గూగుల్ సేల్స్ విభాగం కంట్రీ డైరెక్టర్ వికాస్ అగ్నిహోత్రికి మధ్యంతర బాధ్యతలు అప్పగించింది. గత ఎనిమిదేళ్ళుగా తమ సంస్థకు విశేష సేవలందించినందుకు రాజన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని గూగుల్ ప్రకటించింది.
గడిచిన ఎనిమిదేండ్లుగా గూగుల్ మెరుగైన వృద్ధిలో రాజన్ కీలక పాత్ర పోషించారని, ఆయన నాయకత్వంలో భారత్‌తోపాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఇంటర్నెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ స్కాట్ బౌమాంట్ తెలిపారు.
ఆనందన్ చేరే నాటికి సెర్చింజన్ ‘గూగుల్’ పరిస్థితి చెప్పుదగినంత బాగా ఏమీ లేదు. కానీ గత ఎనిమిదేళ్లలో గూగుల్ ఇండియా ఆపరేషన్ల ద్వారా బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని సముపార్జించింది. కంట్రీ ఇంటర్నెట్ గ్రోత్ స్టోరీ పలు స్థాయిల్లో ఎదిగింది.
ఆనందన్ ఇనిషియేటివ్స్, మూన్ షాట్ ఐడియాలతో భారత్ ఇంటర్నెట్ పురోగతి సాధించింది. రైల్వే స్టేషన్ల వద్ద వై-ఫై సేవల నుంచి ఆన్‌లైన్‌లో ఎస్సెమ్మెస్‌లు, పలు ఇనిషియేటివ్‌లు తీసుకోవడం వల్లే గూగుల్ ఇండియా ఈ స్థాయికి చేరిందని ఆయన సన్నిహిత వర్గాల కథనం.
ఆనంద్ 2010లో మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్‌లో చేరారు. అంతకు ముందు డెల్ ఇండియా, మెకిన్సీ అండ్ కంపెనీలో విధులు నిర్వహించారు. ‘ఎనిమిదేండ్లు అలా గడిచిపోయాయి. భారత్‌తోపాటు ఆగ్నేయా ఆసియా దేశాల్లో 85 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగ దారులను, బిలియన్ డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఆకట్టుకోగలిగాం’ అని ట్విట్టర్ వేదికగా ఆనందన్ చెప్పారు.
వెబ్‌ఎంగేజ్‌తోపాటు ఇన్‌స్టామోజో, కాపిల్లరీ టెక్నాలజీ, ట్రావెల్ ఖానా, ఈసీగవ్ వంటి స్టార్టప్‌లలో ఆయన పెట్టుబడులు పెట్టారు. మరోవైపు సిక్యూయా క్యాపిటల్ ఎండీ శైలేంద్ర జే సింగ్ మాట్లాడుతూ..తమ లీడర్‌షిప్ టీంలో ఆనందన్ జాయిన్ అయ్యారని చెప్పారు.