డబ్బు కోసం వ్యాపారవేత్త కిడ్నాప్ : మహిళ ఆశలపై నీళ్లుచల్లిన పోలీసులు

By Siva KodatiFirst Published May 21, 2019, 12:57 PM IST
Highlights

ఓ వ్యాపార వేత్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. 

ఓ వ్యాపార వేత్తను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీ ఎండీ బిజినెస్ పనుల నిమిత్తం గత గురువారం ఢిల్లీకి చేరుకుని చాణక్యపురిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో దిగాడు.

కొద్దిసేపటి తర్వాత తనకు తెలిసిన ఓ మహిళ ఫోన్ చేసి కలుస్తానని చెప్పింది.. అతడు దీనికి అంగీకరించడంతో మరో మహిళతో కలిసి రూమ్‌కు వెళ్లింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు మహిళలు ఆయనను కారులో తీసుకెళ్లారు.

అనంతరం ఢిల్లీ పోలీసులకు ఓ కాల్ వచ్చింది. తమ కంపెనీ ఎండీని ఎవరో కిడ్నాప్ చేశారని.. రూ.30 లక్షలు ఇస్తేనే ఆయనను విడిచిపెడతామని సదరు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సీసీ కెమెరాల ఆధారంగా ఆయన ఇద్దరు మహిళలతో కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కారు నెంబర్ ఆధారంగా లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లగా మహిళ కనిపించింది.

వారు అడిగిన ప్రశ్నలకు ఆమె సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో తాళం వేసి అనుమానాస్పదంగా కనిపించిన ఓ గదిని తెరిచిచూడగా బాధితుడు ఎండీ కనిపించాడు.

దీంతో ఆయనను అక్కడి నుంచి విడిపించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ప్రమేయమున్న మహిళ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వీరిలో ఎండీ బస చేసిన హోటల్‌కు చెందిన మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. 
 

click me!