పొరుగు దేశం నుంచి కశ్మీర్‌కు మరో రూపంలో ముప్పు.. సరిహద్దు ఆవల నుంచి అడవి పందుల గుంపులు

By Asianet NewsFirst Published Jun 5, 2023, 3:30 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌కు పొరుగు దేశం నుంచి మరో రూపంలో ముప్పు ఎదురవుతున్నది. అక్కడి నుంచి అడవి పందులు సరిహద్దు దాటి వచ్చి ఇక్కడి యాపిల్ తోటలు, ఇతర పంటలను నాశనం చేసి వెళ్లుతున్నాయి. ఈ అడవి పందుల విషయమై స్థానికంగా తీవ్ర చర్చ మొదలైంది.
 

న్యూఢిల్లీ: పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి జమ్ము కశ్మీర్‌కు ఎప్పుడూ ముప్పు పొంచే ఉన్నది. ఆ దేశ ప్రేరేపిత ఉగ్రమూకలతో ఇప్పటికీ కశ్మీర్ నెత్తురోడుతున్నది. సరిహద్దుకు ఆవల నుంచి డ్రోన్‌ల ద్వారా తుపాకులు, డ్రగ్స్ పట్టుబడటం సాధారణమైపోతున్నది. తాజాగా, పాకిస్తాన్ నుంచి కొత్తరూపంలో మరో సమస్య ముందుకు వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి జమ్ము కశ్మీర్‌కు అడవి పందుల గుంపులు వస్తున్నాయి. ఇవి కశ్మీర్‌లోకి వచ్చి యాపిల్ తోటలు, పంటలను నాశనం చేసి వెళ్లుతున్నాయి. 

శ్రీనగర్ నగరానికి వాయవ్యం దిశగా 40 కిలోమీటర్ల దూరంలోని హాజిన్ గ్రామంలో యాపిిల్ చెట్లను, పంట పొలాలను సుమారు 200 నుంచి 400 అడవి పందులు నాశనం చేసి వెళ్లుతున్న ఫొటోలు తాను చూశానని, ఈ ఘటనలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని రిటైర్డ్ వైల్డ్ లైఫ్ అఫీషియల్ సయ్యద్ ముస్తక్ అహ్మద్ పర్సా అన్నారు.

ఆ జంతువులు చెట్లను నాశనం చేసి వెనక్కి వెళ్లాయని, పంట పొలం వద్దకు వెళ్లుతున్న ఓ మహిళపైనా అవి దాడి చేశాయని తెలిపారు. జమ్ము కశ్మీర్ అడవి పందులకు అనువైన ప్రదేశం కాదని, ఇలాంటి చోట్ల వందల అడవి పందులు కనిపించడం నమ్మశక్యంగా లేదని వివరించారు. ఇవి సహజంగా ఇక్కడికి మానవ జోక్యం లేకుండా వచ్చే అవకాశమే లేదని అన్నారు. కానీ, వీటిని ఇక్కడికి పంపినవారెవరో తెలియదని ఆవాజ్ ది వాయిస్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

ఉత్తర కశ్మీర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అధికారులు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలు రూపొందించిన రిపోర్టు గురించి కొన్ని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఆ జంతువులు ఉరి సరిహద్దు గుండా కశ్మీర్‌లోకి వచ్చినట్టు ఆ రిపోర్టు పేర్కొందని వివరించాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) నుంచి ఉద్దేశపూర్వకంగానే వాటిని కశ్మీర్‌లోకి పంపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అవి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అల్పైన్ అడవుల్లోనూ మనుగడ సాధించలేవని చెబుతున్నారు. అంటే.. పీవోకే ఆవల నుంచి బహుశా పాకిస్తాన్ మైదానాల నుంచి వీటిని జమ్ము కశ్మీర్‌లోకి పంపించే కుట్ర జరుగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ అడవి పందులు పీవోకే నుంచి జమ్ము కశ్మీర్‌లోకి సరిహద్దు దాటి వస్తున్నాయని వైల్డ్ లైఫ్ రీసెర్చర్ల బృందం చెబుతున్నది.

పీవోకేలోనూ గణనీయంగా ఈ జంతువుల సంఖ్య పెరగడం కనిపిస్తున్నదని, పీవోకేలోనికీ వీటిని పంపిస్తున్నట్టు తెలుస్తున్నదని మరికొన్ని వర్గాలు చెప్పాయి. వాటిని పంపించారా? లేక అవే సహజంగా ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చాయా? అనేది తేలాల్సి ఉన్నది.

బందిపొరా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఒవైస్ ఆవాజ్ ది వాయిస్‌తో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలోనే అడవి జంతువుల సంఖ్య భారీగా పెరిగిందని, వాటిని ఎలా ఎదుర్కోవాలో గ్రామస్తుల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. వాటిని పట్టుకోవడానికి బోనులను ఏర్పాటు చేస్తున్నామని, అనంతరం, వాటిని అటవీ ప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. 

ఈ అడవి పందులు ఉరి లింబర్, లాచిపొరా, బల్వర్, సుంబల్‌లలో యాపిల్ తోటలు, ఇతర పంటను నాశనం చేస్తున్నాయి. ఈ జంతువుల గుంపులు రాత్రిపూట వచ్చి పంట పొలాల్లో తిరగాడుతున్నాయి.

Also Read: అర్థరాత్రి వరకు అమిత్ షాతో రెజ్లర్ల భేటీ.. అర్ధంతరంగా బయటకు వచ్చేసిన రెజ్లర్లు ఏమన్నారంటే?

సుంబల్‌కు చెందిన 48 ఏళ్ల మహిళపై అడవి పంది దాడి చేసింది. వాటిని అడవి దున్న అని ఆమె అనుకున్నది. అరుదుగా కనిపించే అడవి పంది అని ఆమె గుర్తించలేకపోయింది.

అడవి పందులను గతకాలపు రాజులు వేట కోసం దచ్చిగామ్‌లో 19వ శతాబ్దంలో ఇక్కడికి తీసుకువచ్చారు. కానీ, ఇక్కడి ప్రతికూల వాతావరణం వల్ల 1984 వైల్డ్ లైఫ్ సెన్సన్ ప్రకారం ఒక్క అడవి పంది కూడా లేకుండా అంతరించి పోయాయి. ఒక్క అధికారిక సైటింగ కూడా రిపోర్ట్ కాలేదు. 

అయితే, దశాబ్దం క్రితం దచ్చిగామ్‌లో వీటిని గుర్తించారు. కానీ, ఉత్తర కశ్మీర్‌లో ఇవి కనిపించడం ఆశ్చర్యకరంగా ఉన్నది. ఈ జంతువులు కూడా కుందేలు తరహా ఒక ఆడ జంతువు ఏడు పిల్లలను కనే అవకాశం ఉన్నది.

 

---ఆశా కోసా

click me!