కుమారస్వామి గైర్హాజర్: బెంగుళూర్ కు వచ్చేసిన చంద్రబాబు

By telugu teamFirst Published May 22, 2019, 8:09 AM IST
Highlights

మంగళవారంనాడు చంద్రబాబు బెంగళూరులో జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలుసుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై తాను దేవెగౌడతో మాట్లాడినట్లు చంద్రబాబు భేటీ అనంతరం చెప్పారు.

బెంగళూరు: మంగళవారంనాటి విపక్షాల సమావేశానికి కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన బెంగళూరు చేరుకున్నారు. యుపిఎను నిలబెట్టాలనే తన ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు జెడిఎస్ జారిపోకుండా చూసే ప్రయత్నంలో భాగంగా బెంగళూరు చేరుకున్నారు. 

మంగళవారంనాడు చంద్రబాబు బెంగళూరులో జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడను కలుసుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పై తాను దేవెగౌడతో మాట్లాడినట్లు చంద్రబాబు భేటీ అనంతరం చెప్పారు. ఓట్ల లెక్కింపునకు ముందు వీవీప్యాట్ స్లిప్ లను పరిశీలించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ విషయంపై దేవెగౌడతో మాట్లాడానని ఆయన చెప్పారు. 

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై తాను దేవెగౌడతో మాట్లాడలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఎవరిని ప్రధానిగా చేస్తారని ప్రశ్నించినప్పుడు ఆ విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

మంగళవారంనాటి విపక్షాల సమావేశానికి కుమారస్వామి రాకపోవడానికి గల కచ్చితమైన కారణం తెలియదు. కర్ణాటకలో బిజెపికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తన ప్రభుత్వంపై దాని ప్రభావం పడకుండా చూసుకోవాలనే ప్రయత్నంలో కుమారస్వామి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధాన మంత్రి పదవికి రాహుల్ గాంధీ పేరును జెడిఎస్ సమర్థిస్తోందని, ఫలితాలు వెలువడిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని చంద్రబాబు అన్నారు.

click me!