
ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికల (up election phase 1) పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పెళ్లి బట్టల్లో ఓటు వేసేందుకు పోలింగ్‌కు బూతుకు వచ్చాడు. కొద్ది గంటల్లో పెళ్లి ఉన్నప్పటికీ.. ఓటు వేయడం బాధ్యతగా భావించి తన పనిని పూర్తిచేశాడు. వివరాలు.. ముజఫర్‌నగర్‌కు చెందిన అంకుర్ బల్యాన్ వివాహం నేడు జరగనుంది.
అయితే పెళ్లికి ముందు అంకుర్ బల్యాన్.. పోలింగ్ బూతుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పెళ్లి దుస్తుల్లో పోలింగ్ బూత్‌కు వచ్చిన అంకుర్‌ను మీడియా ప్రతినిధులు పలకరించగా.. ‘ముందు ఓటింగ్, ఆ తర్వాతే భార్య, తర్వాత అన్ని పనులు’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక, యూపీలో తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ స్థానాలకు మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో తొమ్మిది మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇక, ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.